ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026-27 నోటిఫికేషన్ విడుదల- పూర్తి వివరాలు..
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే యువత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 'యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026-27' దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోరుకునే వారు వెంటనే అప్లై చేసుకోండి..
భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని నమ్మే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు కోసం తపిస్తూ, క్షేత్రస్థాయిలో అనుభవం పెంచుకోవాలనుకునే వారికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 'యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026-27' దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఏడాది కాలం పాటు సాగే ఈ ఫెలోషిప్ ద్వారా యువత నేరుగా గ్రామాల్లో నివసిస్తూ అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు register.youthforindia.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్- ఎవరు అర్హులు?
ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్‌కి కేవలం భారతీయ పౌరులే కాకుండా.. నేపాల్, భూటాన్ పౌరులు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా అభ్యర్థులు కింద పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి:
విద్య: 2026 అక్టోబర్ 4 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: ప్రోగ్రామ్ ప్రారంభం నాటికి (అక్టోబర్ 5, 2026) అభ్యర్థి వయస్సు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థి ఆగస్టు 4, 1994 కంటే ముందు, అక్టోబర్ 5, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు.
ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ విశేషాలు..
ఎంపికైన అభ్యర్థులు (ఫెలోస్) 13 నెలల పాటు గ్రామాల్లో ఉంటూ స్వచ్ఛంద సంస్థలతో (ఎన్జీఓ) కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి కల్పన వంటి రంగాల్లో ఎదురయ్యే సామాజిక సవాళ్లను వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల యువతకు గ్రామీణ జీవనశైలిపై లోతైన అవగాహన రావడమే కాకుండా, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి.
ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్- ప్రయోజనాలు, సదుపాయాలు..
ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కాలంలో అభ్యర్థులకు సంస్థ అన్ని విధాలా అండగా ఉంటుంది:
ప్రతి నెలా గౌరవ వేతనం అందుతుంది.
ప్రయాణ ఖర్చులు, ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ప్రత్యేక అలవెన్సులు ఇస్తారు.
ప్రాంతీయ భాషా సమస్యలు తలెత్తకుండా తగిన శిక్షణ, మెంటార్ల ద్వారా మార్గనిర్దేశం చేస్తారు.
కోర్సు విజయవంతంగా ముగిసిన తర్వాత సర్టిఫికేట్, రీ-అడ్జస్ట్‌మెంట్ అలవెన్స్ అందజేస్తారు.
ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది..
అర్హత తనిఖీ: ముందుగా వయస్సు, విద్యా అర్హతలను సరిచూసుకోవాలి.
రిజిస్ట్రేషన్: అధికారిక వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
దరఖాస్తు: అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి వివరాలతో సబ్మిట్ చేయాలి.
ఆన్‌లైన్ అసెస్‌మెంట్: దరఖాస్తు చేసిన వారిని ఆన్‌లైన్ పరీక్ష ద్వారా వడపోస్తారు.
ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ అయిన వారికి గ్రూప్ యాక్టివిటీస్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
గ్రామీణ భారతాన్ని మార్చాలనే సంకల్పం ఉన్న వేలాది మంది యువత కెరీర్‌ను ఈ ఫెలోషిప్ ఇప్పటికే మలుపు తిప్పింది. మీరు కూడా ఆ మార్పులో భాగస్వాములు కావాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


