...
...
Next Story

మతం మారితే పాత కుల రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇస్లాంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ వర్తించదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇతర మతంలోకి మారి పాత కుల హోదా ఆధారంగా రిజర్వేషన్లు కోరలేరని స్పష్టం చేసింది.

Published on: Oct 15, 2026, 12:23:03 IST
Advertisement

హిందూ సామాజిక వ్యవస్థ నుంచి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ పూర్వ కుల హోదా ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద లబ్ధిని పొందలేరని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పునిచ్చింది.

మతం మారితే పాత కుల రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మతం మారితే పాత కుల రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక జీఓను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

కేసు నేపథ్యం ఇదీ..

తమిళనాడు ప్రభుత్వం 2024 మార్చి 9న ఒక ప్రత్యేక ఉత్తర్వు (GO) జారీ చేసింది. దీని ప్రకారం.. వెనుకబడిన తరగతులు (BC), అత్యంత వెనుకబడిన తరగతులు (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు లేదా షెడ్యూల్డ్ కులాల (SC) నుంచి ఇస్లాంలోకి మారిన వారిని 'బీసీ (ముస్లిం)' పరిధిలోకి తెస్తూ 7 గుర్తించిన తెగల్లో ఒకటిగా బీసీ సర్టిఫికేట్ పొందవచ్చని పేర్కొంది.

ఈ జీఓ ఆధారంగా 2015లో ఇస్లాం మతాన్ని స్వీకరించి, 'సమీర్ అహ్మద్'గా పేరు మార్చుకున్న ఒక వ్యక్తి బీసీ (ముస్లిం) కింద 'ముస్లిం లెబ్బై' కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ ఈ అప్లికేషన్‌ను తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే?

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు, జూన్ 2024లో తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీఓను కొట్టివేసింది. ఇస్లాం, క్రిస్టియన్ మత ప్రచారకులు తమ మతాల్లో కుల వ్యవస్థ లేదని, సమానత్వం ఉంటుందని ప్రచారం చేస్తారని హైకోర్టు గుర్తుచేసింది. మతం మారిన వ్యక్తిని కేవలం ఆ మతస్థుడిగా మాత్రమే పరిగణించాలని, పూర్వపు కుల హోదా ఆధారంగా రిజర్వేషన్లు వర్తింపజేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వ కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

"పూర్వపు సామాజిక వ్యవస్థలో అనుభవించిన వెనుకబాటుతనం, మతం మారిన తర్వాత కూడా స్వయంసిద్ధంగా కొనసాగదు. 1950 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కాస్ట్స్) ఉత్తర్వులోని పేరా 3 ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను కాకుండా ఇతర మతాలను విశ్వసించే వ్యక్తిని షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా పరిగణించలేరు" అని ధర్మాసనం తేల్చిచెప్పింది.

మతం మారినంత మాత్రాన సామాజిక సమతుల్యత దెబ్బతినదని, గతంలో పొందిన రిజర్వేషన్ హక్కులు కోల్పోకుండా చూసేందుకే జీఓ ఇచ్చామన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks