FD Interest Rates : సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్- ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.5% వడ్డీ! వివరాలివే..
రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన రాబడి కోరుకునే సీనియర్ సిటిజన్లకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధికంగా 8.5 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఏ ఏ బ్యాంకుల్లో ఎంతెంత వడ్డీ వస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతినెలా లేదా ఒకేసారి స్థిరమైన రాబడి కోరుకునే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాలపై అత్యధికంగా 8.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ వంటి పెద్ద వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే కొత్త బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి కొందరు భయపడుతుంటారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ పరిధిలో ప్రతీ బ్యాంకులో రూ. 5 లక్షల వరకు ఉండే డిపాజిట్లకు పూర్తి భద్రత (ఇన్సూరెన్స్) లభిస్తుంది. కాబట్టి రూ. 5 లక్షల పరిమితిలో పెట్టుబడులు పెట్టేవారు నిర్భయంగా ఈ అధిక వడ్డీని సద్వినియోగం చేసుకోవచ్చు.
8.5 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకులు..
ఈ నెలలో అత్యధికంగా 8.5 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకుల్లో ఇసాఫ్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ముందంజలో ఉన్నాయి.
ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 800 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 3 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి.
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ 5 సంవత్సరాల టాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 8.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులకు లభించే ఈ ప్లాన్‌లో ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీని ద్వారా వడ్డీతో పాటు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందే వీలుంది.
8 శాతానికి పైగా వడ్డీ ఆఫర్ చేస్తున్న ఇతర బ్యాంకులు..
మరికొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా వివిధ కాలపరిమితులపై 8 శాతానికి మించి వడ్డీని ఇస్తున్నాయి:
జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 8.3 శాతం వడ్డీని ఇస్తోంది. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 8 శాతం వడ్డీ లభిస్తుంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 3 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల 6 నెలల వ్యవధి ఉన్న డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.3 శాతం వడ్డీని అందిస్తోంది. సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనంగా వడ్డీ ఇస్తున్నారు.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 23 నెలల 1 రోజు నుంచి 27 నెలల వ్యవధి డిపాజిట్లపై 'కాలబుల్' (ముందస్తు విత్‌డ్రా వెసులుబాటు ఉన్న) పథకంలో 8.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదే వ్యవధికి 'నాన్-కాలబుల్' (ముందస్తు విత్‌డ్రా లేని) డిపాజిట్లపై 8.30 శాతం వడ్డీ లభిస్తుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 666 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 8.25 శాతం, 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల డిపాజిట్లపై 8 శాతం వడ్డీని ఇస్తోంది.
డిపాజిట్ చేసే ముందు ఇవి తెలుసుకోండి..
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేటప్పుడు కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా కాలపరిమితి, ముందస్తు విత్‌డ్రా నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలి. 'నాన్-కాలబుల్' డిపాజిట్లలో అత్యవసరమైతే డబ్బులు మధ్యలో తీసుకునే అవకాశం ఉండదు.
అత్యవసర నిధుల కోసం కాకుండా, నిర్దిష్ట సమయం వరకు డబ్బుతో అవసరం లేదనుకున్నప్పుడే ఇటువంటి డిపాజిట్లను ఎంచుకోవడం శ్రేయస్కరం. వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున డిపాజిట్ బుక్ చేసే రోజూ ఉండే రేట్లే వర్తిస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


