US Jets : కూలిపోతున్న అమెరికా యుద్ధ విమానాలు! 20ఏళ్లల్లో తొలిసారి- ఇరాన్‌కి ఇది ఎలా సాధ్యం?
US jets shot down : ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేని అధికారం ఉందన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాదనలు తలకిందులయ్యాయి. గత 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చివేయగా, మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు దాడులకు గురయ్యాయి. ఇరాన్‌కి ఇది ఎలా సాధ్యమవుతోంది?
ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా విహరించవచ్చన్న అమెరికా ధీమాకు గట్టి దెబ్బ తగిలింది! గత 24 గంటల్లో ఇరాన్ జరిపిన దాడుల్లో రెండు అమెరికా యుద్ధ విమానాలు, గాలింపు చర్యల్లో ఉన్న రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు దెబ్బతినడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ సైనిక శక్తి అమెరికాతో సమానమని చెప్పలేం కానీ, "టెహ్రాన్ గగనతలంపై మాదే పూర్తి అధికారం" అన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు మాత్రం పసలేనివని తేలిపోయాయి. శుక్రవారం నాటి పరిణామాలు ట్రంప్ యంత్రాంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అసలు పాతబడిన గగనతల రక్షణ వ్యవస్థ ఉన్న ఇరాన్.. ఇంతటి అత్యాధునిక విమానాలను ఎలా కూల్చగలిగింది?

ఇరాన్ 'అసిమెట్రిక్' వ్యూహం..
అమెరికా ఊహించని పద్ధతుల్లో దెబ్బకొట్టడం (అసిమెట్రిక్ వార్ఫేర్) ఇరాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. యుద్ధం మొదలై రెండో నెలలోకి ప్రవేశించినా, ఇరాన్ వేస్తున్న గూగ్లీలను అమెరికా పసిగట్టలేకపోతోంది. శుక్రవారం అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన తర్వాత, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తమ వద్ద ఉన్న కొత్త, అత్యాధునిక రక్షణ వ్యవస్థే దీనికి కారణమని ప్రకటించింది. ఆ వెంటనే, కూలిన విమానం సిబ్బంది కోసం గాలిస్తున్న రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. అయితే అవి తృటిలో తప్పించుకుని ఇరాన్ సరిహద్దు దాటగలిగాయి. ఇదే సమయంలో కువైట్ మీదుగా ఎగురుతున్న మరో అమెరికా విమానం ఏ-10 వార్‌హాగ్ కూడా కుప్పకూలడం గమనార్హం.
గత 20 ఏళ్లలో శత్రువుల దాడిలో అమెరికా యుద్ధ జెట్లు కూలిపోవడం ఇదే తొలిసారి! చివరిసారిగా 2003 ఇరాక్ యుద్ధంలో ఇలాంటి ఘటన జరిగింది. "మేము టెహ్రాన్ పైన, దేశంలోని ఇతర ప్రాంతాల పైన విమానాలను తిప్పుతున్నాం.. వారు మమ్మల్ని ఏమీ చేయలేరు," అని మార్చి 24న ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు వారం తిరక్కుండానే ఇరాన్ చేతల్లో సమాధానం చెప్పింది.
అమెరికా విమానాలను ఇరాన్ ఎలా కూల్చింది?
ఈ దాడులకు ఏ ఆయుధాన్ని వాడారనేది ఇరాన్ బయటపెట్టలేదు. కానీ, రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 'మజిద్' ఇన్ఫ్రారెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా భుజంపై ఉంచుకుని ప్రయోగించే క్షిపణులు దీనికి కారణం కావచ్చు. ఇవి రాడార్లకు చిక్కవు. అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు వీటి ద్వారా లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు. గత మార్చి 19న అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్ ఎఫ్-35ను దెబ్బతీసింది కూడా ఈ మజిద్ వ్యవస్థేనని భావిస్తున్నారు.
ఏంటి ఈ 'మజిద్' క్షిపణి వ్యవస్థ ప్రత్యేకత?
2021 నుంచి ఇరాన్ వాడుతున్న ఈ వ్యవస్థ తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను కూల్చడానికి రూపొందించబడింది. దీని ప్రత్యేకతలు ఇవే:
రాడార్ ఉండదు: ఇది రాడార్ సిగ్నల్స్ విడుదల చేయదు. బదులుగా విమానం నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ని (వేడి) గుర్తిస్తుంది. దీనివల్ల క్షిపణి వస్తున్న విషయాన్ని విమానంలోని సెన్సార్లు గుర్తించడం దాదాపు అసాధ్యం.
పరిధి: ఇది 8 కిలోమీటర్ల దూరం, 6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.
గుర్తింపు సామర్థ్యం: ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల ద్వారా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాన్ని ఇది పసిగట్టగలదు. కాషెఫ్-99 సిస్టమ్‌తో అనుసంధానిస్తే ఈ పరిధి 30 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది.
ఎఫ్-35 బలహీనత: అత్యంత ఆధునిక విమానమైనా, ఎఫ్-35 ఇంజిన్ నుంచి వెలువడే విపరీతమైన వేడే దానికి శాపంగా మారింది. మజిద్ వ్యవస్థ ఆ వేడిని సులభంగా పసిగట్టి దెబ్బకొడుతోంది.
వ్యూహం మార్చిన ఇరాన్: 'షూట్ అండ్ స్కూట్'
గత ఏడాది ఇజ్రాయెల్‌తో జరిగిన చిన్నపాటి యుద్ధం తర్వాత ఇరాన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకే చోట ఉండే స్థిరమైన క్షిపణి కేంద్రాల కంటే, మొబైల్ లాంచర్లపై దృష్టి పెట్టింది.
అండర్‌గ్రౌండ్ మిస్సైల్ సిటీస్: ఇరాన్ తన క్షిపణులను పర్వతాల లోపల, భూగర్భ సొరంగాల్లో దాచి ఉంచింది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి.
మొబైల్ లాంచర్లు: ఇవి ఒకచోట నుంచి క్షిపణిని ప్రయోగించి, అమెరికా దాడులు చేసేలోపే వేగంగా మరో చోటికి వెళ్లిపోతాయి. దీన్నే "షూట్ అండ్ స్కూట్" పద్ధతి అంటారు.
రష్యా, చైనా సహకారం: రష్యా నుంచి అత్యాధునిక 'వెర్బా' క్షిపణులను, చైనా నుంచి హెచ్‌క్యూ-9బీ లాంగ్ రేంజ్ మిస్సైల్ సిస్టమ్స్‌ను ఇరాన్ సేకరించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, ఇరాన్ గగనతలంపై పట్టు సాధించడం అమెరికా అనుకున్నంత సులభం కాదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మధ్య ఇరాన్ ప్రాంతం శత్రు విమానాలకు ఒక మృత్యుపాశంగా మారుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


