...
...
Next Story

మహారాష్ట్రలో మరిన్ని ప్రకంపనలు… శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే హెచ్చరిక

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు సోమవారం అధికారికంగా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ ప్రకంపనలు ఉంటాయని ఎంపీ శ్రీకాంత్ షిండే హెచ్చరించారు.

Published on: Jun 23, 2026, 11:31:17 IST
Advertisement

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) వర్గానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు సోమవారం అధికారికంగా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఈ భారీ వలసలతో లోక్‌సభలో షిండే నేతృత్వంలోని శివసేన ఎంపీల బలం 7 నుండి ఒక్కసారిగా 13కి పెరిగింది. ఇది ఉద్ధవ్ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బగా మారగా, షిండే వర్గానికి పార్లమెంటులో మరింత బలాన్ని చేకూర్చింది.

‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’

శివసేన బ్యానర్
శివసేన బ్యానర్

ఈ తాజా రాజకీయ మార్పులపై శివసేన యువనేత, ఎంపీ శ్రీకాంత్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు.

"రాజకీయాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా బాంబు పేలుళ్లు కొనసాగుతూనే ఉంటాయి. గత నాలుగేళ్లుగా మేము కేవలం రాజకీయ షాక్‌లు ఇస్తూనే ఉన్నాం. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా బాకీ ఉంది" అని శ్రీకాంత్ షిండే పేర్కొన్నారు.

నిరంతర మీడియా కవరేజీని ఉద్దేశించి ఆయన చమత్కరిస్తూ.. ఒకే రోజులో జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న రెండు పెద్ద వార్తలు వచ్చాయని, జర్నలిస్టులు కూడా ఉదయం నుంచి బ్రేకింగ్ న్యూస్‌లు ఇస్తూ అలసిపోయి ఉంటారని అన్నారు. ఈ రోజు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని, రేపటి నుంచి మళ్లీ సరికొత్తగా ప్రకంపనలు మొదలుపెడతామని వ్యాఖ్యానించారు.

ఆరుగురు రెబల్ ఎంపీలు వీరే..

శివసేన (యూబీటీ) నుంచి బయటకు వచ్చి షిండే వర్గంలో చేరిన వారిలో ప్రముఖ నేతలు ఉన్నారు. సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భావ్‌సాహెబ్ వాక్‌చౌరే, నాగేష్ పాటిల్ అస్తికార్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ అధికారికంగా కండువా కప్పుకున్నారు. వీరంతా ఎటువంటి ఒత్తిడి లేకుండా, స్వచ్ఛందంగానే తమ పార్టీలోకి వచ్చారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే స్పష్టం చేశారు.

రెబల్ ఎంపీలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఈ పరిణామాన్ని రాజకీయ పునర్వ్యవస్థీకరణలో "రెండో విడత"గా అభివర్ణించారు. 2022లో ఉద్ధవ్ ఠాక్రేపై తాను చేసిన తిరుగుబాటుతో మొదటి విడత ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. ఈ తాజా పరిణామం తమ క్యాంప్‌కు లభించిన ఒక ‘సిక్సర్’ లాంటిదని ఆయన కొనియాడారు.

బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలు, సిద్ధాంతాలకు తమ శివసేన మాత్రమే నిజమైన వారసురాలని, ఆ విలువలను కాపాడేందుకే తాము పోరాడుతున్నామని షిండే పునరుద్ఘాటించారు. రవాణా శాఖ మంత్రి, శివసేన నేత ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ.. ఏకనాథ్ షిండే, శ్రీకాంత్ షిండేల అద్భుతమైన పనితీరుకు ఆకర్షితులై ఈ ఆరుగురు ఎంపీలు పార్టీలో చేరారని తెలిపారు. వీరంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించారని, బాలాసాహెబ్ సిద్ధాంతాల మేరకే నడుచుకుంటారని ఆయన స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe