తుపుక్ తుపుక్ అంటూ బాల్కెనీ నుంచి గుట్కా ఉమ్ముతూ.. వృద్ధుడు మృతి! హైటెన్షన్ వైరుకు తగిలి!
మధ్యప్రదేశ్‌లో విదిశ జిల్లాలో గుట్కా ఉమ్మివేస్తూ ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన విస్తుగొలిపే సంఘటన వెలుగులోకి వచ్చింది. మూడో అంతస్తు బాల్కనీ నుంచి ఉమ్మిన ద్రవం 11 కేవీ హైటెన్షన్ వైరుకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఆయన అక్కడికక్కడే మరణించారు.
మధ్యప్రదేశ్ విదిశ జిల్లా గంజ్బసోడా పట్టణంలో విచిత్ర, షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! మూడో అంతస్తు బాల్కనీ నుంచి గుట్కా ఉమ్ముతూ ఓ 65 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే, గుట్కా ఉమ్మే క్రమంలో ఆయన పై నుంచి కిందపడిపోయి మరణించలేదు. బాల్కెనీకి అత్యంత సమీపంలో ఉన్న 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరుకు ఆ ఉమ్ము ధార తాకడంతో కరెంట్ షాక్‌కు ఆయన అక్కడికక్కడే మరణించారు!

ఉమ్మినప్పుడు కరెంట్ ఎలా షాక్ కొట్టింది? సైన్స్ ఏం చెప్తోంది?
శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. మృతుడిని ఛతర్పూర్ ప్రాంతానికి చెందిన ప్రాభులా నివాసి ప్రభులాల్ గుప్తా (65)గా గుర్తించారు. వృత్తిరీత్యా మేస్త్రీ అయిన ఈయన గత పదేళ్లుగా గాయత్రీ నగర్‌లోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఇంటి మూడో అంతస్తు బాల్కనీలో నిలబడి గుట్కా ఉమ్మివేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఉమ్మి వేస్తే కరెంట్ షాక్ కొడుతుందా? అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ తలెత్తడం సహజం. దీనిపై విద్యుత్ రంగ నిపుణులు, సైన్స్ విశ్లేషకులు శాస్త్రీయ వివరణ ఇచ్చారు. మానవ ఉమ్మిలో నీటి శాతంతో పాటు లవణాలు (సాల్ట్స్), ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి విద్యుత్‌ను తమ గుండా వేగంగా ప్రసరింపజేసే (కండక్షన్) వాహకాలుగా పనిచేస్తాయి.
ధారాళమైన ఉమ్మి ధార: బాల్కనీ నుంచి వృద్ధుడు ఉమ్మినప్పుడు ఆ ద్రవం ఒక నిరంతర ధారగా కరెంట్ వైరును తాకినట్లయితే, విద్యుత్ ఆ ధార ద్వారా క్షణాల్లో శరీరంలోకి ప్రవహించే అవకాశముంది.
ఎలక్ట్రికల్ ఆర్క్ : 11 కేవీ వంటి అధిక వోల్టేజ్ కలిగిన లైన్లు గాలిలోనే విద్యుత్ తరంగాలను ప్రసరింపజేసే శక్తిని కలిగి ఉంటాయి. వైరుకు, బాల్కనీకి మధ్య దూరం చాలా తక్కువగా ఉన్నప్పుడు, విద్యుత్ గాలిని చీల్చుకుంటూ ఉమ్మి ధార ద్వారా శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన షాక్‌కు గురిచేస్తుంది.
నివాసాల మధ్య హైటెన్షన్ వైర్లు: స్థానికుల తీవ్ర ఆగ్రహం!
ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ శాఖ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరకలి జరిగిందని గాయత్రీ నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లపై నుంచి, బాల్కనీలకు అతి సమీపం నుంచి 11 కేవీ లైన్లు వెళ్తున్నాయని, వాటిని తొలగించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ పట్టించుకోలేదని ఆరోపించారు.
"మా వీధిలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇళ్లకు సమీపంలో ఉన్న 11 కేవీ వైరును మార్చాలని ఎన్నోసార్లు అధికారులను కలిశాం. వారు మారుస్తామని హామీలు ఇవ్వడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు," అని బాధితుడి ఇంటి యజమాని పద్మా చిధార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మన తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక పట్టణాలు, నగరాల్లో నివాస గృహాలకు అతి సమీపంగా హైటెన్షన్ వైర్లు వెళ్తుండటం తరచూ చూస్తుంటాం. ఇంటి బాల్కనీలలో ఉండేటప్పుడు, ముఖ్యంగా విద్యుత్ లైన్లు దగ్గరగా ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
“'టొబాకో కిల్స్' అనేది నిజమే!” అని ఒకరు కామెంట్ చేయగా, “ఎలక్ట్రిసిటీ బోర్డును నిందిస్తారు, కానీ గుట్కా తీసుకుని ఊసే వాళ్లని ఏమీ అనరు,” అని మరొకరు అన్నారు. ఇంకొకరు.. “ఫైనల్ డెస్టినేషన్ ఇండియన్ వర్షెన్” అని రాసుకొచ్చారు. “నవ్వకండీ.. సీరియస్ మాటర్” అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


