పింఛనుదారులకు ఈపీఎఫ్‌ఓ బిగ్ రిలీఫ్! ఇంటి వద్దకే పోస్ట్‌మాన్.. జీవన్ ప్రమాణ్ పత్ర సమర్పణ మరింత సులభం!
రిటైర్డ్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ తీపి కబురు అందించింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ పత్రం) సమర్పించేందుకు బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోస్టల్ శాఖ ద్వారా ఇంటి వద్దకే వచ్చి ప్రాసెస్ చేసే ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
విశ్రాంత జీవితం గడుపుతున్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఏటా పింఛను క్రమం తప్పకుండా రావడానికి సమర్పించాల్సిన ‘జీవన్ ప్రమాణ్ పత్ర’ ప్రాసెసింగ్‌ను మరింత సులభతరం చేసినట్టు ప్రకటించింది. వయోభారంతో బాధపడేవారు, ఆరోగ్య సమస్యలతో బయటకు రాలేని వృద్ధులు బ్యాంకులు లేదా ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పనిలేకుండా కొత్త సేవను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసిదంి.

"పింఛనుదారులు బయటకు రావాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను ఉపయోగించుకోండి. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం," అని ఈపీఎఫ్‌ఓ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి నవంబర్ 30 చివరి తేదీగా ఉంది. ఆలోగా ఈ డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఇంటి వద్దకే పోస్ట్‌మాన్.. సర్వీస్ ఎలా పొందాలంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సువిశాలమైన పోస్టల్ నెట్‌వర్క్‌ను ఈపీఎఫ్‌ఓ ఇందుకోసం వినియోగిస్తోంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్‌తో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సాంకేతికతను అనుసంధానించారు. దీనివల్ల గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) లేదా పోస్ట్‌మాన్ నేరుగా పింఛనుదారుల ఇంటికే వచ్చి బయోమెట్రిక్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్‌ను పూర్తి చేస్తారు.
ఈ సేవను పొందేందుకు పింఛనుదారులు 033-22029000 నంబర్‌కు ఫోన్ చేసి, డోర్‌స్టెప్ విజిట్ కోసం అభ్యర్థించవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారితో పాటు వేరే ఏ బ్యాంకులో ఖాతా ఉన్న పింఛనుదారులైనా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఎన్ఐసీ నేరుగా పింఛనుదారుడి మొబైల్ నంబర్‌కు ‘ప్రమాణ్ ఐడీ’ పంపుతుంది. ఆ ఐడీ ఆధారంగా అభ్యర్థులు [https://jeevanpramaan.gov.in/ppouser/login](https://jeevanpramaan.gov.in/ppouser/login) లింక్ ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటి వద్దకే వచ్చి ప్రాసెస్ చేసే ఈ సేవకు గాను జీఎస్టీతో కలిపి రూ. 70 నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. దీనికి అదనంగా ఎటువంటి డోర్‌స్టెప్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
అసలు 'జీవన్ ప్రమాణ్ పత్ర' ఎందుకు అవసరం?
పింఛను పొందుతున్న వ్యక్తి జీవించే ఉన్నారని ధ్రువీకరించడానికి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకునే డిజిటల్ దస్త్రమే ఈ 'జీవన్ ప్రమాణ్ పత్ర'. గతంలో వృద్ధులు స్వయంగా బ్యాంకుల వద్దకు వెళ్లి సంతకం లేదా వేలిముద్ర వేయాల్సి వచ్చేది. సాంకేతికత పెరిగిన తర్వాత బయోమెట్రిక్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దీనిని పూర్తి చేస్తున్నారు.
నవంబర్ 30 నాటికి ఈ సర్టిఫికేట్ అందకపోతే డిసెంబర్ నుంచి వచ్చే పింఛను జమకావడం నిలిచిపోతుంది.
స్టేటస్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి!
సర్టిఫికేట్ జెనరేట్ కాగానే పని అయిపోయిందని భావించకూడదు. పింఛను అందజేసే బ్యాంక్ లేదా సంస్థ ఆ సర్టిఫికేట్‌ను ఆమోదించిందో లేదో సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం.
దీనికోసం జీవన్ ప్రమాణ్ అధికారిక పోర్టల్ jeevanpramaan.gov.in సందర్శించి, మీకు వచ్చిన 'ప్రమాణ్ ఐడీ' నమోదు చేసి సర్టిఫికేట్ స్టేటస్‌ని తనిఖీ చేయవచ్చు. ఒకవేళ సర్టిఫికేట్ తిరస్కరణకు గురైనా లేదా ప్రాసెసింగ్‌లోనే ఆగిపోయినా, వెంటనే సంబంధిత బ్యాంకును లేదా పింఛను కార్యాలయాన్ని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


