15 లక్షలు పెట్టి 'నీట్' పేపర్ కొన్నాడు.. కొడుక్కి వచ్చిన స్కోర్ ఎంతో తెలుసా?
కోట్లాది రూపాయల బేరాలు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం. నీట్ (NEET) పేపర్ లీక్ కేసులో రోజుకో షాకింగ్ నిజం బయటపడుతోంది. రాజస్థాన్‌కు చెందిన బివాల్ కుటుంబం ఈ దందాలో చేసిన అక్రమాలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో ఇప్పుడు దేశవ్యాప్తంగా 'బివాల్ కుటుంబం' పేరు మారుమోగిపోతోంది. రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన ఈ కుటుంబం, పేపర్ లీక్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ (CBI) ఆధారాలు సేకరించింది. ఈ కేసులో దినేష్ బివాల్, అతని సోదరుడు మాంగీలాల్ బివాల్, మాంగీలాల్ కొడుకు వికాస్ బివాల్‌ను ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేశారు.

15 లక్షల ఖర్చు.. ఫలితం మాత్రం ‘సున్నా’
ఈ కథలో అత్యంత విచిత్రమైన మలుపు దినేష్ బివాల్ కొడుకు రిషి మార్కులు. తన కొడుకును ఎలాగైనా డాక్టర్‌ను చేయాలన్న తాపత్రయంతో దినేష్ బివాల్.. హర్యానాకు చెందిన యశ్ యాదవ్ అనే వ్యక్తి నుంచి 15 లక్షల రూపాయలు పోసి నీట్ ప్రశ్నపత్రాన్ని కొన్నాడు. పరీక్షకు ముందే చేతికి పేపర్ వచ్చింది.. ఏ ఏ ప్రశ్నలు వస్తాయో ముందే తెలుసు. కానీ, తీరా ఫలితాలు వచ్చేసరికి రిషికి వచ్చింది కేవలం 720 మార్కులకు గానూ 107 మార్కులు మాత్రమే.
అసలు రిషి విద్యా నేపథ్యం చూస్తే.. అతను టెన్త్ క్లాస్‌లో కేవలం 43.6 శాతం మార్కులతో అతి కష్టమ్మీద పాస్ అయ్యాడు. ఎంత లీకైన పేపర్ ఇచ్చినా, కనీస పరిజ్ఞానం లేకపోవడంతో ఆ పేపర్‌ను కూడా అతను సరిగ్గా రాయలేకపోయాడని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం రిషి తండ్రి అరెస్ట్ కావడంతో పరారీలో ఉన్నాడు.
ఒక్కటే కుటుంబం.. ఐదుగురు డాక్టర్లు.. అంతా అనుమానమే
బివాల్ కుటుంబంపై సీబీఐకి బలమైన అనుమానాలు కలగడానికి మరో ప్రధాన కారణం ఉంది. గతేడాది అంటే నీట్ 2025 పరీక్షలో ఇదే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఏకకాలంలో మెడికల్ సీట్లు సాధించారు.
2024లో కనీసం పాస్ మార్కులు కూడా సాధించలేని వీరు, 2025లో మాత్రం అత్యధిక స్కోరు సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించారు.
ప్రస్తుతం కాలేజీల్లో వారి పనితీరును పరిశీలిస్తే.. కనీస సబ్జెక్టు నాలెడ్జ్ కూడా లేదని అక్కడి ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు.
దీంతో గతేడాది కూడా వీరు యశ్ యాదవ్ ముఠా సాయంతో పేపర్ లీక్ చేసి ఉంటారని సీబీఐ గట్టిగా నమ్ముతోంది. విచారణలో భాగంగా వికాస్ బివాల్ నోరు విప్పడంతో.. సీకర్ కోచింగ్ సెంటర్లలో సాగుతున్న లీక్ నెట్‌వర్క్ గుట్టు రట్టయింది.
పెట్టిన పెట్టుబడికి డబుల్ లాభం
దినేష్ బివాల్ కేవలం తన కొడుకు కోసమే పేపర్ కొనలేదు, దీన్నొక వ్యాపారంగా మార్చాడు. తాను 15 లక్షలకు కొన్న పేపర్‌ను స్కాన్ చేసి, డిజిటల్ రూపంలో సీకర్‌లోని ఇతర విద్యార్థులకు 30 లక్షల రూపాయల చొప్పున అమ్మేసినట్లు సమాచారం. అంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం చూస్తూ, అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఈ అక్రమ సంపాదనలో ఈ కుటుంబం పీకల్లోతు కూరుకుపోయిందని సీబీఐ కోర్టుకు వివరించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నీట్ పేపర్ లీక్ కేసులో బివాల్ కుటుంబం పాత్ర ఏమిటి?
రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన బివాల్ కుటుంబం మధ్యవర్తుల నుంచి పేపర్ కొని, దాన్ని ఇతర విద్యార్థులకు భారీ ధరలకు అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కుటుంబంలోని ముగ్గురు సభ్యులను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది.
2. దినేష్ బివాల్ కొడుకు రిషికి నీట్ 2026లో ఎన్ని మార్కులు వచ్చాయి?
లీకైన పేపర్ చేతిలో ఉన్నప్పటికీ, రిషి 720 మార్కులకు గానూ కేవలం 107 మార్కులు మాత్రమే సాధించాడు. అతను చదువులో చాలా వెనుకబడి ఉండటమే దీనికి కారణం.
3. 2025 నీట్ ఫలితాలపై సీబీఐ ఎందుకు ఆరా తీస్తోంది?
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు గతేడాది అకస్మాత్తుగా అత్యధిక మార్కులతో మెడికల్ సీట్లు సాధించడం అనుమానాలకు దారితీసింది. వారు 2024లో ఫెయిల్ అయ్యి, 2025లో టాపర్లుగా రావడం వెనుక కూడా లీక్ కోణం ఉందన్నది అధికారుల అనుమానం.
4. పేపర్ లీక్ కోసం దినేష్ బివాల్ ఎంత ఖర్చు చేశాడు?
హర్యానా ముఠాకు 15 లక్షల రూపాయలు ఇచ్చి పేపర్ కొన్న దినేష్, దాన్ని ఇతరులకు 30 లక్షల రూపాయలకు అమ్మినట్లు దర్యాప్తులో తేలింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


