Stock Investing Rules: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ సింపుల్ సూత్రాలే మిమ్మల్ని లాభాల బాట పట్టిస్తాయి
స్టాక్ మార్కెట్ పెట్టుబడులను సంక్లిష్టంగా మార్చుకోకుండా, సులువైన పద్ధతుల్లో దీర్ఘకాలిక సంపదను ఎలా సృష్టించుకోవచ్చో కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ ఈ కథనంలో వివరిస్తున్నారు. వారి మాటల్లోనే చదవండి.
షేర్ మార్కెట్ అనగానే చార్టులు, ఫైనాన్షియల్ రేషియోలు, ఎకనామిక్ డేటా, రకరకాల విశ్లేషణలు గుర్తుకొస్తాయి. కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఇదంతా పెద్ద గందరగోళంగా అనిపించవచ్చు. కానీ, స్టాక్ మార్కెట్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు అనుసరించిన సాధారణ, క్రమశిక్షణతో కూడిన మార్గాలనే మనం ఇక్కడ తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్ పెట్టుబడి అంటే ప్రతిరోజూ షేర్లను కొనడం, అమ్మడం లేదా మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేయడం కాదు. ఒక మంచి కంపెనీలో భాగస్వామి అవ్వడమే పెట్టుబడి అసలు ఉద్దేశం. ఈ కోణంలో ఆలోచిస్తే మార్కెట్ చాలా సులభంగా అర్థమవుతుంది.
ప్రస్తుతం భారతదేశంలో రీటెయిల్ ఇన్వెస్టర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పుణ్యమా అని దేశంలో 11 కోట్లకు పైగా యునిక్ ఇన్వెస్టర్లు, 21 కోట్లకు పైగా డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. మార్కెట్ ఎంత వేగంగా మారుతున్నా, పెట్టుబడి ప్రాథమిక సూత్రాలు మాత్రం మారలేదు.
1. వ్యాపారాన్ని అర్థం చేసుకోవడమే మొదటి మెట్టు
మనం పెట్టుబడి పెట్టే కంపెనీ వ్యాపారం ఏమిటో మనకు కచ్చితంగా తెలియాలి. అది బ్యాంక్ కావచ్చు, వినియోగ వస్తువుల కంపెనీ కావచ్చు, ఆటోమొబైల్ లేదా టెక్నాలజీ సంస్థ కావచ్చు.. ఆ కంపెనీ ఎలా లాభాలు గడిస్తోంది, భవిష్యత్తులో దాని ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుందో లేదో గమనించాలి. షేర్ ధరలను కాకుండా, కంపెనీ వ్యాపారాన్ని చూసి పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి.
2. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం
మార్కెట్లోకి కొత్తగా వచ్చేవారు ఎక్కువ సంఖ్యలో కంపెనీల షేర్లను కొనేస్తుంటారు. కానీ, వందల కంపెనీల కంటే సరైన పరిశోధన చేసి ఎంచుకున్న కొన్ని బలమైన కంపెనీల పోర్ట్‌ఫోలియోనే ఎక్కువ లాభాలను ఇస్తుంది.
కంపెనీ ఆదాయ వృద్ధి, నగదు నిల్వలు (క్యాష్ ఫ్లో), తక్కువ అప్పులు, అనుభవజ్ఞులైన యాజమాన్యం ఉన్న సంస్థలను ఎంచుకోవాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే కంపెనీలే దీర్ఘకాలంలో లాభాలను అందిస్తాయి.
3. మార్కెట్ ట్రెండ్స్ వెనుక పరుగెత్తకండి
ప్రతి ఏటా ఏదో ఒక రంగం లేదా ఒక స్టాక్ బాగా దూసుకుపోతుంటుంది. అందరూ కొంటున్నారు కదా అని మనం కూడా కొంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.
మార్కెట్లో వచ్చే హడావుడిని పక్కన పెట్టి, కంపెనీ ఆర్థిక బలం (ఫండమెంటల్స్) ఆ షేర్ ధరను సమర్థిస్తుందో లేదో చూడాలి. ట్రెండ్స్ మారుతున్నప్పుడల్లా షేర్లను మార్చడం కంటే, నాణ్యమైన కంపెనీల్లో స్థిరంగా కొనసాగడమే సంపద సృష్టికి రహస్యం.
4. పెట్టుబడులను సులభంగా ఉంచండి
ఇన్వెస్టర్లు ప్రతిరోజూ మార్కెట్ కదలికలను గమనించాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, వేర్వేరు రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం (డైవర్సిఫికేషన్), ఎప్పటికప్పుడు పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవడం సరిపోతుంది.
నేరుగా షేర్లను ఎంచుకోలేని కొత్త ఇన్వెస్టర్లకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) ఒక మంచి మార్గం. మార్కెట్‌పై అవగాహన పెరిగిన తర్వాత సొంతంగా షేర్లను ఎంచుకోవచ్చు.
5. ఓపికే మీ పెట్టుబడికి శ్రీరామరక్ష
సాధారణ ఇన్వెస్టర్లకు ఉన్న అతిపెద్ద ఆయుధం సమయం. భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక మార్పుల వల్ల మార్కెట్లు తాత్కాలికంగా పడిపోవచ్చు. కానీ ఓపిక ఉన్న ఇన్వెస్టర్లను నాణ్యమైన కంపెనీలు ఎప్పుడూ నిరాశపరచవు. స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడకుండా, కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిపైనే దృష్టి పెట్టాలి.
కొత్త ఇన్వెస్టర్లు సోషల్ మీడియా చిట్కాలు (టిప్స్), మితిమీరిన ట్రేడింగ్, మార్కెట్ బాటమ్‌ను అంచనా వేయాలని చూడటం లాంటి తప్పులకు దూరంగా ఉండాలి. విజయం అనేది మార్కెట్ టైమింగ్‌పై ఆధారపడి ఉండదు; అది మీ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు అసాధారణ తెలివితేటలు లేదా సంక్లిష్టమైన వ్యూహాలు అవసరం లేదు. స్పష్టమైన ఆర్థిక లక్ష్యం, క్రమశిక్షణ, కాంపౌండింగ్ మ్యాజిక్ పని చేయడానికి అవసరమైన ఓపిక ఉంటే చాలు. రోజువారీ మార్కెట్ గందరగోళాన్ని పట్టించుకోకుండా, దీర్ఘకాలిక ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టే వారే స్థిరమైన సంపదను సృష్టించగలరు.
వ్యాసకర్త: శ్రీకాంత్ చౌహాన్,
ఈక్విటీ రీసెర్చ్ హెడ్,
కోటక్ సెక్యూరిటీస్

ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


