ఎస్‌ఐపీ క్యాలిక్యులేటర్లు నిజం చెబుతున్నాయా? రూ.10 వేల మదుపుపై అసలు నిజాలివే
ఆన్‌లైన్ ఎస్‌ఐపీ క్యాలిక్యులేటర్లు చూపించే భారీ లాభాలు నిజ జీవితంలో సాధించడం సాధ్యమేనా? డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ నిర్వహించిన విశ్లేషణలో వెల్లడైన ఆసక్తికర విషయాలు, ఆదాయ ఆధారిత మదుపు ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం.
ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌లో నెలకు రూ.10,000 ఎస్‌ఐపీ (సిప్) అని టైప్ చేసి, 20 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకోగానే తెరపై కనిపిచే భారీ అంకెల చూసి మదుపరులు సంబరపడిపోతుంటారు. ప్రణాళికాబద్ధంగా ప్రతి నెలా ఒకే మొత్తాన్ని పెట్టుబడి పెడితే కోట్లలో రాబడి వస్తుందని ఈ క్యాలిక్యులేటర్లు లెక్కిస్తాయి. అయితే నిజ జీవితంలో వంద శాతం ఈ అంచనాలు ప్రతిబింబించవని, దీని వెనుక పెద్ద వ్యత్యాసం ఉందంటూ డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ తన 2026 సెప్టెంబరు 'నేత్ర' (Netra) నివేదికలో స్పష్టం చేసింది.

20 ఏళ్ల క్రితం రూ.10 వేలు అంటే చిన్న విషయం కాదు!
ప్రతి నెలా స్థిరంగా రూ.10,000 మదుపు చేయవచ్చనే అంచనాతోనే సాధారణ క్యాలిక్యులేటర్లు పనిచేస్తాయి. కానీ నేడు మనం ఎంతో సులభంగా చెల్లించగలిగే రూ.10,000 మొత్తం.. 20 ఏళ్ల క్రితం సగటు భారతీయుడికి చాలా పెద్ద భారం.
డీఎస్పీ విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం రూ.10,000 అనేది సగటు భారతీయుడి నెలకు లభించే నికర జాతీయ తలసరి ఆదాయంలో (NNI) దాదాపు 55 శాతంగా ఉంది. అదే 20 ఏళ్ల క్రితం చూస్తే, నాటి తలసరి ఆదాయంలో ఈ రూ.10,000 ఏకంగా 350 శాతానికి పైగా ఉండేది. అంటే నాటి రోజుల్లో సగటు వ్యక్తి నెలకు రూ.10,000 ఎస్‌ఐపీ కట్టడం ఆచరణ సాధ్యం కాని పని.
ఫ్లాట్ ఎస్‌ఐపీ వర్సెస్ ఆదాయ ఆధారిత ఎస్‌ఐపీ
ఈ వ్యత్యాసాన్ని మరింత స్పష్టంగా వివరించేందుకు డీఎస్పీ ఒక పరిశోధన చేసింది. నాటి ఆదాయ స్థాయికి తగ్గట్లుగా ఎస్‌ఐపీ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తే రాబడి ఎలా ఉంటుందో లెక్కగట్టింది.
2006-07 ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.1,536తో ప్రారంభించి, 2010-11 నాటికి రూ.2,595, 2015-16 నాటికి రూ.4,317, 2020-21 నాటికి రూ.5,795 చొప్పున పెంచుకుంటూ నేడు రూ.10,000 స్థాయికి ఎస్‌ఐపీని తీసుకువెళ్తే వచ్చే నిధిని నిఫ్టీ 50 టీఆర్‌ఐ (Nifty 50 TRI) సూచీ ఆధారంగా పోల్చింది.
ఫ్లాట్ ఎస్‌ఐపీ (నెల నెలా రూ.10,000): సెప్టెంబరు 2006 నుంచి ఆగస్టు 2026 వరకు ప్రతి నెలా స్థిరంగా రూ.10,000 చొప్పున మదుపు చేస్తే, మొత్తం పెట్టుబడి రూ.24 లక్షలు అవుతుంది. దీని ప్రస్తుత విలువ రూ.87.3 లక్షలకు చేరుతుంది.
ఆదాయ ఆధారిత ఎస్‌ఐపీ: ఆదాయ పెరుగుదలకు అనుగుణంగా ఎస్‌ఐపీ మొత్తాన్ని పెంచుకుంటూ పోతే, 20 ఏళ్లలో పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.12.2 లక్షలు మాత్రమే. దీని ప్రస్తుత విలువ రూ.31.9 లక్షలుగా మాత్రమే ఉంటుంది.
గతంలోని స్థిరమైన గణాంకాలను భవిష్యత్తుకు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని, ప్రాక్టికల్ లైఫ్‌లో రాబడి అంచనాలు వేర్వేరుగా ఉంటాయని డీఎస్పీ నివేదిక తేల్చింది.
మధ్యలో ఎస్‌ఐపీ ఆపితే ఎంత నష్టం?
కేవలం ఆదాయ పరిమితులే కాకుండా, మార్కెట్ పతనాల సమయంలో మదుపరులు తీసుకునే నిర్ణయాలు కూడా తుది రాబడిని శాసిస్తాయి. మార్కెట్లు క్షీణించినప్పుడు ఉద్యోగాలు పోవడం, వేతనాల్లో కోతలు రావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమయంలో చాలామంది ఎస్‌ఐపీలను నిలిపివేయడమో లేదా ఉన్న డబ్బును వెనక్కి తీయడమో చేస్తుంటారు.
20 ఏళ్ల ఎస్‌ఐపీ ప్రయాణంలో నిధి నుంచి 50 శాతం మొత్తాన్ని వెనక్కి తీస్తే వచ్చే పరిణామాలను కూడా ఈ నివేదిక విశ్లేషించింది.
- గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ పతనంలో (2008) 50% ఉపసంహరిస్తే: తుది నిధి రూ.75.7 లక్షలకు పరిమితమవుతుంది.
- టేపర్ టాంట్రమ్ సమయంలో ఉపసంహరిస్తే: తుది నిధి రూ.61.8 లక్షలుగా మారుతుంది.
- కోవిడ్ పతనంలో (2020) ఉపసంహరిస్తే: తుది నిధి రూ.49 లక్షలకు పడిపోతుంది.
మదుపరులు గ్రహించాల్సిన పాఠం
ఎస్ఐపీ క్యాలిక్యులేటర్లు చూపించే భారీ అంకెలు కేవలం ఆదర్శవంతమైన పరిస్థితుల్లో మాత్రమే సాధ్యమవుతాయి. సుదీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించాలంటే ఆదాయానికి తగినట్లుగా మదుపు పరిమాణాన్ని క్రమంగా పెంచుకోవడం (Step-up SIP), మార్కెట్ పతనాల్లో భయపడి ఎస్‌ఐపీలను ఆపకపోవడం, అవసరం లేకుండా నిధిని ఉపసంహరించుకోకపోవడం అత్యంత కీలకమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


