...
...
Next Story

నెలకూ ₹3,500 ఎస్‌ఐపీతో ₹3 కోట్లు: చక్రవడ్డీ మ్యాజిక్ వివరాలివే

25 ఏళ్ల వయసులో నెలకు ₹3,500 ఎస్‌ఐపీ ప్రారంభించి, ప్రతి ఏటా 10% పెట్టుబడి పెంచుకుంటూ పోతే 30 ఏళ్లలో ₹3.09 కోట్ల నిధిని సమకూర్చుకోవచ్చు. అదే 5 ఏళ్లు ఆలస్యం చేస్తే వచ్చే మొత్తం సగానికి తగ్గిపోతుంది. పూర్తి గణాంకాలు, ఎస్‌ఐపీ పనిచేసే విధానం ఇక్కడ చూడండి.

Published on: Oct 27, 2026, 15:43:40 IST
Advertisement

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా స్వల్ప మొత్తంతో పొదుపు మొదలుపెట్టి కోటీశ్వరులు కావడం సాధ్యమేనా అంటే.. అవుననే సమాధానమిస్తున్నారు ఆర్థిక నిపుణులు. పెట్టుబడి విషయంలో పెద్ద మొత్తాల కంటే ‘సమయం’ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంత త్వరగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించే అవకాశం ఉంటే, చక్రవడ్డీ (Power of Compounding) ప్రయోజనం అంత ఎక్కువగా లభిస్తుంది. కేవలం 5 ఏళ్లు ఆలస్యంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించినా, చివరికి చేతికి అందే కార్పస్ నిధిలో సగం కోల్పోవాల్సి వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

₹3,500 ఎస్‌ఐపీ ₹3.09 కోట్లుగా ఎలా మారుతుంది?

నెలకూ  ₹3,500 ఎస్‌ఐపీతో  ₹3 కోట్లు: చక్రవడ్డీ మ్యాజిక్ వివరాలివే
నెలకూ ₹3,500 ఎస్‌ఐపీతో ₹3 కోట్లు: చక్రవడ్డీ మ్యాజిక్ వివరాలివే

25 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ప్రతినెల ₹3,500తో ఎస్‌ఐపీ ప్రారంభించారనుకుందాం. వార్షిక సగటు రాబడి 12 శాతంగా భావించి, ప్రతి ఏటా పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం చొప్పున పెంచుకుంటూ (Step-up Method) పోవాలి.

  • మొదటి సంవత్సరం (25 ఏళ్ల వయసు): నెలకు ₹3,500 ఇన్వెస్ట్ చేస్తారు.
  • రెండో సంవత్సరం (26 ఏళ్ల వయసు): 10 శాతం ( ₹350) పెంచి, నెలకు ₹3,850 జమ చేస్తారు.
  • మూడో సంవత్సరం (27 ఏళ్ల వయసు): మళ్లీ 10 శాతం ( ₹385) పెంచి, నెలకు ₹4,235 పెట్టుబడి పెడతారు.

ఇలా 30 సంవత్సరాల పాటు వరుసగా కొనసాగిస్తే, 55 ఏళ్ల వయసు నాటికి మొత్తం పెట్టుబడి ₹69.09 లక్షలు దాటుతుంది. దీనిపై వచ్చిన అంచనా రాబడి మాత్రమే దాదాపు ₹2.40 కోట్లుగా ఉంటుంది. అంటే, చివరికి చేతికి ₹3.09 కోట్లకు పైగా భారీ నిధి చేరుతుంది.

'స్టెప్-అప్' పద్ధతి ఎందుకు మేలు? త్వరగా ఎందుకు ప్రారంభించాలి?

జీతం లేదా రాబడి పెరిగే కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచడాన్నే 'స్టెప్-అప్ పద్ధతి' అంటారు. కెరీర్ ప్రారంభంలో చిన్న మొత్తంతో మొదలుపెట్టి, ఆదాయం పెరిగే కొద్దీ ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకునేందుకు ఈ విధానం అనుకూలంగా ఉంటుంది.

అలాకాకుండా, ఎలాంటి స్టెప్-అప్ లేకుండా ప్రతి నెలా స్థిరంగా ₹5,000 చొప్పున 30 ఏళ్ల పాటు 12 శాతం రాబడితో ఇన్వెస్ట్ చేస్తే.. మొత్తం పెట్టుబడి ₹18 లక్షలు కాగా, లభించే అంచనా రాబడి ₹1.36 కోట్లు. చివరికి సమకూరే మొత్తం ₹1.54 కోట్లు మాత్రమే అవుతుంది. స్థిరమైన పెట్టుబడి కంటే స్టెప్-అప్ విధానం ఎంత శక్తివంతమైనదో ఈ వ్యత్యాసం నిరూపిస్తోంది.

ఎస్‌ఐపీ ఎలా పనిచేస్తుంది?

మ్యూచువల్ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా పెట్టుబడి పెట్టడం ఎంతో సులభం. బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెలా లేదా పక్షం రోజులకు ఒకసారి నిర్దేశిత మొత్తం కట్ అయ్యేలా ఆటో-డెబిట్ (Standing Instructions) సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టిన పెట్టుబడికి సమానమైన మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కేటాయిస్తారు.

ఉదాహరణకు, ఒక ఫండ్ యూనిట్ ధర (NAV) ₹10 ఉంటే, నెలకు ₹1,000 పెట్టుబడికి 100 యూనిట్లు లభిస్తాయి.

మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా యూనిట్ల ధరల్లో మార్పులు ఉంటాయి. మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్లు, పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తాం. దీనివల్ల 'రూపీ కాస్ట్ యావరేజింగ్' ప్రయోజనం లభించి, లంప్‌సమ్ (ఒకేసారి పెద్ద మొత్తంలో) పెట్టుబడి కంటే సగటు కొనుగోలు ధర తగ్గి నష్టభయం తగ్గుతుంది.

(గమనిక: ఈ వార్తా కథనం కేవలం అవగాహన, సమాచారం కోసం మాత్రమే. విశ్లేషకులు లేదా బ్రోకరేజ్ సంస్థలు అందించిన అభిప్రాయాలను ఇక్కడ వివరించడం జరిగింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks