...
...
Next Story

స్మాల్‌క్యాప్ షేర్లలో భారీ పతనం: ఇది కొనే సమయమేనా? ఇన్వెస్టర్లు గమనించాల్సిన కీలక అంశాలివే

పశ్చిమాసియా యుద్ధ మేఘాల వల్ల భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ షేర్లు కుదేలవుతున్నాయి. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈ తగ్గుదల ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశమా? నిపుణుల విశ్లేషణ మీకోసం.

Published on: Mar 18, 2026 09:12 AM IST
Advertisement

ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు కఠినమైన అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు, మరోవైపు పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం.. వెరసి ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ షేర్లు శిఖరం నుంచి నేలకు దిగివస్తున్నాయి. పోర్ట్‌ఫోలియోలు ఎర్రబడటంతో సామాన్య ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. మరి ఈ పతనాన్ని చూసి భయపడాలా? లేక పెట్టుబడికి సరైన సమయంగా భావించి 'షాపింగ్' మొదలుపెట్టాలా? దీనిపై సీనియర్ అనలిస్టుల అభిప్రాయం ఏంటో చూద్దాం.

ఈ పతనం వెనుక కారణాలేంటి?

స్మాల్‌క్యాప్ షేర్లలో భారీ పతనం: ఇది కొనే సమయమేనా? ఇన్వెస్టర్లు గమనించాల్సినవివే
స్మాల్‌క్యాప్ షేర్లలో భారీ పతనం: ఇది కొనే సమయమేనా? ఇన్వెస్టర్లు గమనించాల్సినవివే

భారత్ తన ఇంధన అవసరాల కోసం (చమురు, గ్యాస్) పశ్చిమాసియా దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. అక్కడి యుద్ధ పరిస్థితులు సరఫరా వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు తోడవ్వడంతో మార్కెట్లలో 'బేరిష్' ధోరణి కనిపిస్తోంది. ఇండెక్స్‌లు పడిపోయే దానికంటే, స్మాల్‌క్యాప్ షేర్లలో పతనం చాలా తీవ్రంగా ఉంది. మీ వద్ద స్మాల్‌క్యాప్ స్టాక్స్ ఉంటే ఆ నొప్పి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.

చరిత్ర ఏం చెబుతోంది? "ఇది కూడా గడిచిపోతుంది"

మార్కెట్ పడిపోతున్నప్పుడు భయం కలగడం సహజం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి: "ఈ కాలం కూడా గడిచిపోతుంది." ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యుద్ధాలు లేదా సంక్షోభాలు తాత్కాలికమే. గతంలో జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే..

  • 1999 కార్గిల్ యుద్ధం: ఆ సమయంలో మార్కెట్ మొదట నెగటివ్‌గా స్పందించినా, యుద్ధం ముగియగానే అద్భుతమైన లాభాలను అందించింది.
  • 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: రష్యా దాడి చేసినప్పుడు మార్కెట్లు కొన్ని నెలల పాటు కుదేలయ్యాయి. కానీ ఆ తర్వాత కోలుకుని, సెప్టెంబర్ 2024 వరకు సరికొత్త రికార్డులను సృష్టించాయి.

ఇప్పుడు కూడా మార్కెట్‌లో చీకటి రోజులు నడుస్తున్నాయి. కానీ, ఈ చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. యుద్ధం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైతే ధైర్యంగా షేర్లను కొంటారో, వారే భవిష్యత్తులో లాభాలు పొందుతారు. అప్పుడు కొనని వారు తర్వాత విచారించాల్సి వస్తుంది.

స్మాల్‌క్యాప్స్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • మార్కెట్ పడిపోతోంది కదా అని కళ్లకి గంతలు కట్టుకుని ఏ షేరు పడితే అది కొనకూడదు. ముఖ్యంగా స్మాల్‌క్యాప్స్ విషయంలో 'సెలెక్టివ్'గా ఉండాలి.
  • వాల్యుయేషన్ చూడండి: షేరు ధర తక్కువగా ఉన్నప్పుడు (Low PE & Low PB) మాత్రమే కొనండి. అంటే ఆ షేరు అసలు విలువ కంటే తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు అది మనకు 'రక్షణ కవచం' (Margin of Safety) లా పనిచేస్తుంది.
  • ఇన్‌సైడర్ ట్రేడింగ్ గమనించండి: మార్కెట్ నిపుణులు చెప్పే మాటల కంటే, కంపెనీ మేనేజ్‌మెంట్ ఏం చేస్తోందో చూడటం ముఖ్యం. కంపెనీ ప్రమోటర్లు లేదా సీనియర్ మేనేజర్లు తమ సొంత కంపెనీ షేర్లను కొంటున్నారా? అలా కొంటుంటే, వారికి కంపెనీ భవిష్యత్తుపై నమ్మకం ఉందని అర్థం. ఇది కంపెనీ పటిష్టతకు ఒక సంకేతం.
  • ముఖ్యమైన ఫండమెంటల్స్: కనీసం 15% రిటర్న్ రేషియో, తక్కువ అప్పు (Low Debt) లేదా అసలు అప్పు లేని కంపెనీలను ఎంచుకోండి. కంపెనీ ఆదాయం (Revenue), లాభాల వృద్ధి రేటును సరిచూసుకోండి.

స్మాల్‌క్యాప్స్ స్వభావాన్ని అర్థం చేసుకోండి

నిజమైన 'మల్టీబ్యాగర్' షేర్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వవు లేదా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌గా రావు. అవి చాలా నిశ్శబ్దంగా, ఎవరూ పట్టించుకోని సమయంలో పెరుగుతుంటాయి. ఈ మార్కెట్ కరెక్షన్ అనేది క్వాలిటీ స్మాల్‌క్యాప్ షేర్లను దీర్ఘకాలం కోసం కొనుగోలు చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం.

గుర్తుంచుకోండి: చిన్న కంపెనీలు మిడ్-క్యాప్ స్థాయికి ఎదగడానికి సమయం పడుతుంది. కాబట్టి ఓపికతో వేచి ఉండండి. తొందరపడి లాభాలు ఆశించకుండా, సరైన వాల్యుయేషన్‌లో పెట్టుబడి పెట్టండి.

(గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది ఎలాంటి స్టాక్ సిఫార్సు కాదు. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe