Artificial Intelligence : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాక్- 80శాతం కోడింగ్ ఇక ఏఐ చేతుల్లోనే! జాబ్ పరిస్థితేంటి?

AI Coding : సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. గతంలో కేవలం 20 శాతంగా ఉన్న ఏఐ కోడింగ్ వాటా, ఇప్పుడు ఏకంగా 80 శాతానికి చేరుకుందని ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ సంచలన విషయాలు వెల్లడించారు. అయితే, ఈ ఏఐ వల్ల నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Published on: May 2, 2026, 09:08:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రపంచం శరవేగంగా మారుతోంది. మొన్నటి వరకు కోడింగ్‌లో కేవలం 'అసిస్టెంట్'గా సాయం చేసిన ఏఐ, ఇప్పుడు 'పవర్‌హౌస్‌'గా మారిపోయింది! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గంటల తరబడి కష్టపడి రాసే కోడ్‌ను ఇప్పుడు ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్ సెకన్లలో పూర్తి చేస్తోంది. తాజాగా సెకోయా క్యాపిటల్ టాక్‌లో మాట్లాడిన ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, ఈ మార్పు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు.

ఏఐ కోడింగ్​పై సంచలన వ్యాఖ్యలు..
ఏఐ కోడింగ్​పై సంచలన వ్యాఖ్యలు..

20 నుంచి 80 శాతానికి.. ఊహించని జంప్!

గతేడాది డిసెంబర్ నాటికి ఏఐ టూల్స్ కేవలం 20 శాతం కోడ్‌ను మాత్రమే రాసేవని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 80 శాతానికి చేరుకుందని బ్రాక్‌మన్ తెలిపారు. దీని అర్థం ఏంటంటే.. ప్రాజెక్టులో ప్రధానమైన కోడింగ్ పనిని ఏఐ పూర్తి చేస్తోంది, మనుషులు కేవలం దానిని పర్యవేక్షించే 'సూపర్‌వైజర్లు'గా మారుతున్నారు.

కేవలం ఓపెన్ ఏఐ మాత్రమే కాదు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇటీవల తమ కంపెనీలో 75 శాతం కొత్త కోడింగ్ ఏఐ ద్వారానే జరుగుతోందని వెల్లడించారు. మెటా, ఆంథ్రోపిక్ వంటి అగ్రగామి సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. భవిష్యత్తులో దాదాపు 100 శాతం కోడింగ్ ఏఐ ద్వారానే జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అతి విశ్వాసం.. కొంపముంచిన ఏఐ!

ఏఐ కోడింగ్ వల్ల పని వేగంగా జరుగుతున్నా, దానివల్ల పొంచి ఉన్న ప్రమాదాలు కూడా తక్కువేమీ కావు! ఇటీవల ‘పాకెట్ ఓఎస్’ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఎదురైన అనుభవం టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ కంపెనీకి చెందిన ఒక ఏఐ ఏజెంట్, కేవలం కొద్ది సెకన్లలోనే కంపెనీకి చెందిన లైవ్ ప్రొడక్షన్ డేటాబేస్ మొత్తాన్ని డిలీట్ చేసేసింది.

ఆ ఏఐ టూల్ ఒక టెస్టింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో పని చేస్తున్నప్పుడు సాంకేతిక సమస్య ఎదురైంది. సాధారణంగా అయితే ఇంజనీర్ సాయం తీసుకోవాలి, కానీ ఆ ఏఐ సొంతంగా నిర్ణయం తీసుకుని, ఏపీఐ టోకెన్ సంపాదించి ఒక కమాండ్‌ను రన్ చేసింది. ఫలితంగా కంపెనీ లైవ్ డేటాతో పాటు బ్యాకప్ డేటా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చివరికి ఆ ఏఐ ఏజెంట్.. "అవును, నేను వెరిఫై చేయకుండా తప్పు చేశాను," అని ఒప్పుకోవడం గమనార్హం.

హ్యూమన్ టచ్ తప్పనిసరి..!

ఈ ఘటన ఏఐ కోడింగ్‌లో భద్రతా లోపాలను ఎత్తిచూపింది. ఏఐ 80 శాతం కోడ్ రాసినప్పటికీ, చివరి నిర్ణయం మాత్రం మనిషి చేతుల్లోనే ఉండాలని గ్రెగ్ బ్రాక్‌మన్ స్పష్టం చేశారు. ఓపెన్ ఏఐలో ప్రతి కోడ్ మెర్జ్ అయ్యే ముందు ఒక వ్యక్తి దానిని క్షుణ్ణంగా పరిశీలించి అప్రూవ్ చేస్తారని ఆయన తెలిపారు.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం పనులను వేగవంతం చేసుకోవచ్చు, కానీ బాధ్యతాయుతమైన పర్యవేక్షణ లేకపోతే ఒకే ఒక్క తప్పుడు కమాండ్ కంపెనీని రోడ్డున పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ప్రస్తుతం ఎంత శాతం కోడింగ్ ఏఐ ద్వారా జరుగుతోంది?

ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ ప్రకారం, కోడింగ్ వాటా 20 శాతం నుంచి ఏకంగా 80 శాతానికి పెరిగింది. గూగుల్‌లో ఇది 75 శాతంగా ఉంది.

2. ఏఐ కోడింగ్ వల్ల ఉద్యోగాలు పోతాయా?

ఉద్యోగాలు పూర్తిగా పోకపోయినా, ఇంజనీర్ల పాత్ర మారుతుంది. ప్రోగ్రామర్లు కేవలం కోడ్ రాయడం కంటే, ఏఐ రాసిన కోడ్‌ను రివ్యూ చేయడం, పర్యవేక్షించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More