Artificial Intelligence : ‘డెవలపర్లు కోడ్స్ రాయట్లేదు’- కోడింగ్ ఇక చరిత్రేనా?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో సాఫ్ట్‌వేర్ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. స్పాటిఫై తన డెవలపర్లు కోడింగ్ రాయడం మానేశారని ప్రకటించగా, ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు కోడింగ్ వృత్తి అంతరించిపోతుందని హెచ్చరిస్తున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి కోడింగ్ రాసే రోజులు త్వరలోనే ముగిసిపోనున్నాయా? టెక్ దిగ్గజాల మాటలు వింటుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ స్పాటిఫై కో-సీఈఓ గుస్టావ్ సోడర్‌స్ట్రోమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. తమ డెవలపర్లు కోడ్స్ రాసి చాలా కాలమైపోయిందని ఆయన అన్నారు.

"మా డెవలపర్లు కోడింగ్ రాయడం లేదు"
స్పాటిఫైలోని ఉత్తమ డెవలపర్లు డిసెంబర్ 2025 నుంచి ఒక్క లైన్ కోడ్ కూడా స్వయంగా రాయలేదని సోడర్‌స్ట్రోమ్ వెల్లడించారు. దీనికి కారణం 'హాంక్' అనే వారి అంతర్గత ఏఐ సిస్టమ్ అని వివరించారు.
ఈ సిస్టమ్ ద్వారా ఇంజనీర్లు తమ ఆఫీసుకి వెళ్లే దారిలో మొబైల్ నుంచే క్లాడ్ ఏఐకి సూచనలు ఇస్తారు.
ఏదైనా బగ్ (తప్పు) సరిచేయాలన్నా లేదా కొత్త ఫీచర్ చేర్చాలన్నా.. అది కూడా ఏఐనే చేసేస్తోంది.
ఇంజనీర్లు ఆఫీసుకి చేరుకునేలోపే యాప్ కొత్త వెర్షన్ సిద్ధమైపోతుంది. వారు కేవలం దాన్ని చెక్ చేసి 'మెర్జ్' చేస్తే సరిపోతుంది.
ప్రస్తుతం స్పాటిఫై డెవలపర్లు కేవలం ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ నిర్ణయాలపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే ఏఐ సాయంతో 'Prompted Playlists', 'Page Match', 'About This Song' వంటి పలు కొత్త ఫీచర్లను స్పాటిఫై విజయవంతంగా లాంచ్ చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి
2026 నాటికి కోడింగ్ అంతం?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరో అడుగు ముందుకేసి సంచలన అంచనా వేశారు. 2026 చివరి నాటికి కోడింగ్ అనే వృత్తి ప్రాధాన్యతను కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు.
"ఇకపై కోడింగ్ రాయాల్సిన అవసరం ఉండదు. ఏఐ నేరుగా 'బైనరీ' (యంత్ర భాష)ని రూపొందిస్తుంది. ఇది మనుషులు రాసే కోడ్ కంటే అత్యంత సమర్థవంతంగా ఉంటుంది," అని మాస్క్ ఓ సందర్భంలో వివరించారు.
అదేవిధంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా కోడర్లు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూసుకోవాలని సూచించారు. కోడింగ్ అనేది ఇప్పుడు ఒక సృజనాత్మక కళగా మారుతోందని, కేవలం రాయడం మాత్రమే తెలిసిన వారికి భవిష్యత్తు కష్టమని ఆయన హెచ్చరించారు.
ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై ఏఐ స్టార్టప్ “హైపర్‌రైట్” సీఈఓ మ్యాట్ షూమర్ సంచలన వ్యాఖ్యలే చేశారు. స్క్రీన్ ముందు కూర్చుని చేసే వైట్ కాలర్ ఉద్యోగాలు ఇక కనుమరుగైపోతాయని హెచ్చరించారు. ఇప్పుడు ఏఐ అనేది కేవలం ఊహల్లో ఉండే సాంకేతికత కాదని, అది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక మహా శక్తిగా మారిందని వివరించారు.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న: ఏఐ టూల్స్ వల్ల కోడింగ్ పూర్తిగా అంతరించిపోతుందా? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు ఏంటి?
సమాధానం: ఎలాన్ మస్క్ వంటి నిపుణులు 2026 చివరి నాటికి ట్రెడిషనల్ కోడింగ్ అవసరం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీని అర్థం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం లేదని కాదు; వారి బాధ్యతలు మారుతాయని.
ప్రశ్న: ఏఐ నేరుగా కోడ్ రాస్తుంటే, భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొత్తవారిని అసలు తీసుకుంటాయా?
సమాధానం: ఏఐ వల్ల ఎంట్రీ లెవల్ కోడింగ్ పనులు తగ్గుతున్నప్పటికీ, కొత్తవారికి అవకాశాలు పూర్తిగా మాయం కావు. కాకపోతే, నియామక ప్రక్రియలో మార్పులు వస్తాయని అంచనాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


