ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలన ఫోటో: ఒకే టేబుల్‌పై జుకర్‌బర్గ్, ఎలోన్ మస్క్..
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తాజాగా బయటపడిన ఒక ఫోటో ఇప్పుడు టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎలోన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఒకే విందులో పాల్గొన్న ఈ చిత్రం పాతదే అయినప్పటికీ, నేరస్తుడు ఎప్‌స్టీన్‌తో వారికి ఉన్న సంబంధాలపై మళ్లీ చర్చ మొదలైంది.
ప్రపంచ కుబేరులు, టెక్ దిగ్గజాలు ఎలోన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలిసిందే. కానీ, వీరిద్దరూ కలిసి ఒకే విందులో పాల్గొన్న అరుదైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంచలనం సృష్టించిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' (Epstein Files) లో భాగంగా విడుదలైన వందలాది చిత్రాలలో ఈ ఫోటో ఒకటి. లైంగిక నేరస్తుడిగా ముద్రపడి, జైలులోనే మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఆధారాల్లో ఈ ఫోటో లభించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆ రాత్రి ఏం జరిగింది?
నివేదికల ప్రకారం, ఈ ఫోటోను స్వయంగా జెఫ్రీ ఎప్‌స్టీనే తీసి ఉండవచ్చని సమాచారం. 2015 ఆగస్టులో ఎప్‌స్టీన్ తన వ్యక్తిగత మెయిల్‌కు ఈ ఫోటోను పంపుకున్నారు. అదే నెలలో రాసిన మరో ఈమెయిల్‌లో.. “జుకర్‌బర్గ్, మస్క్, పీటర్ థీల్, రీడ్ హాఫ్మన్‌లతో కలిసి విందు చేశాను.. ఇదొక వైల్డ్ డిన్నర్” అంటూ ఆయన పేర్కొన్నారు.
ఈ విందులో లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్, పలాంటిర్ ఛైర్మన్ పీటర్ థీల్ కూడా ఉన్నట్లు ఎప్‌స్టీన్ మెయిల్ ద్వారా తెలుస్తోంది. అయితే ఆ చిత్రంలో మాత్రం కేవలం మస్క్, జుకర్‌బర్గ్‌లు మాత్రమే కనిపిస్తున్నారు. వారు ఎప్‌స్టీన్‌తో నేరుగా మాట్లాడారా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
టెక్ దిగ్గజాల స్పందన ఏంటి?
ఈ విందుపై 2019లోనే వానిటీ ఫెయిర్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై మెటా (ఫేస్‌బుక్) ప్రతినిధి స్పందిస్తూ.. "మార్క్ జుకర్‌బర్గ్ ఒకే ఒకసారి ఎప్‌స్టీన్‌ను కలిశారు. అది కూడా యాదృచ్ఛికంగా జరిగిన భేటీ మాత్రమే. ఆ విందు తర్వాత మార్క్ ఎప్పుడూ ఎప్‌స్టీన్‌తో మాట్లాడలేదు" అని స్పష్టం చేశారు.
ఇక ఎలోన్ మస్క్ ఈ విషయంపై గతంలోనే తనదైన శైలిలో స్పందించారు. “ఎప్‌స్టీన్ ఒక వింత మనిషి (Creep). జుకర్‌బర్గ్ నాకు స్నేహితుడు ఏమీ కాదు” అని మస్క్ అప్పట్లో తేల్చి చెప్పారు. ఈ విందును రీడ్ హాఫ్మన్ హోస్ట్ చేసినట్లు సమాచారం.
బ్రిటన్ రాజకీయాల్లో పెను తుఫాను
ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగ కేవలం టెక్ రంగానికే పరిమితం కాలేదు. అటు బ్రిటన్ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారికి ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల కారణంగా బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
లైంగిక నేరాల్లో నిందితుడైన ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్న పీటర్ మాండెల్సన్‌ను 2024లో దౌత్య పదవికి ఎలా నియమిస్తారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్టార్మర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ (లేబర్ పార్టీ) నేతలే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్, కమ్యూనికేషన్ డైరెక్టర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. అయితే, ప్రధాని స్టార్మర్ మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
"నేను పాల్గొన్న ప్రతి పోరాటంలోనూ గెలిచాను. నా బాధ్యతల నుంచి నేను పారిపోను" అని ఆయన పార్లమెంటులో ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, ఒక పాత ఫోటో ఇప్పుడు అటు టెక్ ప్రపంచంలో, ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


