...
...
Next Story

IPL 2026 RR vs LSG : వైభవ్ సూర్యవంశీ విధ్వంసం - లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..!

IPL RR vs LSG 2026 :ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ఊదేసింది. వైభవ్ సూర్యవంశీ 93 పరుగులతో చెలరేగగా, ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీతో రాణించి ఆర్ఆర్ కు 7 వికెట్ల విజయాన్ని అందించారు.

Published on: May 20, 2026, 06:41:36 IST
Advertisement

IPL Rajasthan Royals vs Lucknow Super Giants 2026 : జైపూర్‌ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ సమరంలో రాజస్థాన్ రాయల్స్ (RR) సూపర్ విక్టరీ కొట్టింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయాసంగా ఛేదించింది. సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.

సూర్యవంశీ సిక్సర్ల తుఫాన్

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం - ప్లే ఆఫ్స్‌కు మరో అడుగు దూరంలో రాజస్థాన్
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం - ప్లే ఆఫ్స్‌కు మరో అడుగు దూరంలో రాజస్థాన్

221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే జైస్వాల్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత లక్నో బౌలర్ మొహసిన్ ఖాన్ రెండో ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడి చేసినప్పటికీ…. ఆ తర్వాతి ఓవర్లోనే జైస్వాల్ మళ్లీ చెలరేగి 19 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. ఈ దశలో జైస్వాల్ (39), సూర్యవంశీ (25) క్రీజులో ఉన్నారు.

అయితే, పవర్‌ప్లే ముగిసిన వెంటనే లక్నో బౌలర్ ఆకాష్ సింగ్ రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. 43 పరుగులు చేసిన జైస్వాల్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ అవుట్ అయినా సూర్యవంశీ అస్సలు తగ్గలేదు. లక్నో బౌలర్లను మైదానం నలుమూలలా బాదాడు. ఆకాష్ సింగ్ వేసిన 9వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

హాఫ్ సెంచరీ తర్వాత సూర్యవంశీ మరింత వేగంగా ఆడాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన 11వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఆ ఓవర్లో రాజస్థాన్ ఏకంగా 29 పరుగులు సాధించింది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ పై మార్క్‌రమ్ ఇచ్చిన పరుగుల తర్వాత….. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ ఇచ్చిన 29 పరుగులే రెండో అత్యధికం కావడం గమనార్హం.

సెంచరీకి చేరువవుతున్న తరుణంలో సూర్యవంశీ అవుట్ అయ్యాడు. కేవలం 38 బంతుల్లో 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 93 పరుగులు చేసిన సూర్యవంశీని మొహసిన్ ఖాన్ అవుట్ చేశాడు. దీంతో లూవాన్ డ్రే ప్రిటోరియస్ క్రీజులోకి వచ్చాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 7 పరుగుల వద్ద రనౌట్ రూపంలో ప్రిటోరియస్ ఔటయ్యాడు. ఆ తర్వాత డోనవన్ ఫెరీరా, ధ్రువ్ జురెల్ కలిసి మిగిలిన పనిని పూర్తి చేసి రాజస్థాన్ కు విజయాన్ని అందించారు. ధ్రువ్ జురెల్ 38 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో హై-స్కోరింగ్ పిచ్‌పై రాజస్థాన్ బౌలింగ్ విభాగం మరోసారి విఫలమైంది. జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్ లక్నోకు భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. పవర్‌ప్లేలోనే లక్నో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. ఈ సీజన్ లో లక్నోకు ఇది నాలుగో అత్యధిక పవర్‌ప్లే స్కోరు.

జోష్ ఇంగ్లిస్ కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని… మిచెల్ మార్ష్ తో కలిసి మొదటి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లిస్ 60 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ, మార్ష్ తన దాడిని కొనసాగించాడు. మార్ష్ 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని, మొత్తం 57 బంతుల్లో 96 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో కెప్టెన్ రిషబ్ పంత్ మెరుపులు మెరిపించడంతో లక్నో 200 పరుగుల మార్కును దాటింది. అయితే చివరి ఓవర్లో మార్ష్, పంత్ ఇద్దరూ రనౌట్ అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యష్ రాజ్ పుంజా 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఇక ఈ విక్టరీతో రాజస్థాన్ టీమ్ 14 పాయింట్లతో టేబుల్ లో 4వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్ మిగిల ఉంది. ఇందులో కూడా గెలిస్తే నేరుగా ఫ్లేఆఫ్ కు వెళ్తుంది. అయితే పంజాబ్ జట్టుకు కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగా….ఈ మ్యాచ్ లో ఆ జట్టు గెలిస్తే రాజస్థాన్ ఫ్లే ఆఫ్ కు వెళ్లటమే కష్టమవుతుంది..!

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe