Sovereign Gold Bonds : సావరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్- 200% పైగా లాభంతో రిడెంప్షన్..

SGB series : సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి అదృష్టం వరించింది! 2020లో తక్కువ ధరకు బాండ్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు అధిక లాభాన్ని పొందుతున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ప్రకటన విడుదల చేసింది.

Published on: Apr 20, 2026, 09:10:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగారంపై పెట్టుబడి అంటే కేవలం నగలు లేదా బిస్కెట్లు మాత్రమే కాదు, ప్రభుత్వ బాండ్లు కూడా లాభాల పంట పండిస్తాయని సావరిన్ గోల్డ్ బాండ్లు నిరూపించాయి. ఈ ఎస్​జీబీలు ఇన్వెస్టర్లకు ఏ రేంజ్​లో లాభాలు తెచ్చిపెట్టాయో తెలిసిందే. ఇక ఇప్పుడు,​ 2020-21 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన ఎస్​జీబీ సిరీస్-VII బాండ్ల ప్రీమెచ్యూర్​ రిడెంప్షన్ ప్రక్రియను ఏప్రిల్ 20న చేపడుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత ఈ ముందస్తు ఉపసంహరణకు నిబంధనలు అనుమతిస్తాయి. ఇవి కూడా మదుపర్లకు భారీ లాభాలనే ఇస్తున్నాయి.

సావరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్ (Representative Image)
సావరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్ (Representative Image)

ఒక్కో యూనిట్‌పై రూ. 10,000 పైగా లాభం!

ఈ దఫా సావరిన్ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్ ధరను ఆర్బీఐ రూ. 15,254 గా నిర్ణయించింది. 2020 అక్టోబర్‌లో ఈ బాండ్లను జారీ చేసినప్పుడు వీటి ధర కేవలం రూ. 5,051 మాత్రమే! అంటే, అప్పట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఏకంగా 202 శాతం లాభం కలుగుతోంది.

ఆన్‌లైన్ ఇన్వెస్టర్లకు మరింత ప్లస్: అప్పట్లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ. 50 తగ్గింపు లభించింది (అంటే వారి కొనుగోలు ధర రూ. 5,001). వారికి ఇప్పుడు లభించే లాభం 205 శాతం.

వడ్డీ బోనస్: ఈ మూలధన లాభం మాత్రమే కాకుండా, ఇన్వెస్టర్లు ఏటా 2.5 శాతం వడ్డీని కూడా అదనంగా పొందారు. ఇదే సావరిన్​ గోల్డ్​ బాండ్ల ప్రత్యేకత. అందుకే వీటిని కొనేందుకు ప్రజలు ఎగబడ్డారు.

సావరిన్ గోల్డ్​ బాండ్ రిడెంప్షన్ ధరను ఎలా లెక్కిస్తారు?

రిడెంప్షన్ ధరను నిర్ణయించడానికి ఆర్బీఐ ఒక నిర్దిష్ట పద్ధతిని పాటిస్తుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించే 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటును తీసుకుంటారు. ఏప్రిల్ 20 నాటి రిడెంప్షన్ కోసం, అంతకుముందు మూడు పని దినాల (ఏప్రిల్ 17 వరకు) సగటు ధరను పరిగణనలోకి తీసుకుని ఈ రూ. 15,254 ధరను ఖరారు చేశారు.

బడ్జెట్ 2026 తర్వాత పన్ను నిబంధనలు ఇవే!

2026 ఏప్రిల్ 1 తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ఎస్‌జీబీ ఆదాయంపై పన్ను విధింపులో కొన్ని మార్పులు వచ్చాయి:

మెచ్యూరిటీ వరకు ఉంటేనే ఊరట: బాండ్లను పూర్తి కాలపరిమితి (8 ఏళ్లు) వరకు ఉంచుకున్న ఒరిజినల్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.

ముందస్తు ఉపసంహరణపై పన్ను: 12 నెలల కంటే ఎక్కువ కాలం బాండ్లను కలిగి ఉంటే, వచ్చే లాభాలపై 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్​టీసీజీ) పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీపై పన్ను: బాండ్ల ద్వారా వచ్చే 2.5 శాతం వార్షిక వడ్డీపై ఇన్వెస్టర్ ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను వర్తిస్తుంది.

వివరాలు2026 బడ్జెట్​కి ముందు2026 బడ్జెట్​ తర్వాత
ఇన్వెస్టర్​సెకెండరీ మార్కెట్సెకెండరీ మార్కెట్
కొనుగోలు ధరరూ. 15,00,000రూ. 15,00,000
మెచ్యూరిటీ నాటికి రిడెంప్షన్​ వాల్యూరూ. 40,00,000రూ. 40,00,000
హోల్డింగ్ పీరియడ్లాంగ్​ టర్మ్ (>12 నెలలు)లాంగ్ టర్మ్ (>12 నెలలు)
లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్రూ. 25,00,000రూ. 25,00,000
ఎల్​టీసీజీ ట్యాక్స్ రేట్మినహాయింపు12.5% (మినహాయింపు లేదు)
ఎల్​టీసీజీ ట్యాక్స్0 (మినహాయింపు)రూ. 3,12,500
సోర్స్​- క్లియర్​ ట్యాక్స్

2026లో ఎస్‌జీబీ భవిష్యత్తు ఏంటి?

ప్రస్తుతానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కొత్త ఎస్‌జీబీ సిరీస్‌లను ప్రకటించలేదు. బంగారం ధరలో భారీ వృద్ధితో పాటు భారీ రుణ భారాల నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే బాండ్లు కలిగి ఉన్నవారు మెచ్యూరిటీ వరకు కొనసాగవచ్చు లేదా స్టాక్ ఎక్స్​ఛేంజీల ద్వారా విక్రయించుకోవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఎస్‌జీబీ ప్రీమెచ్యూర్​ రిడెంప్షన్ ఎప్పుడు చేసుకోవచ్చు?

బాండ్ జారీ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత, వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

2. 2020-21 సిరీస్-VII రిడెంప్షన్ ధర ఎంత?

ఆర్బీఐ ఈ సిరీస్ కోసం ఒక్కో యూనిట్ ధరను రూ. 15,254 గా నిర్ణయించింది.

3. ఎస్‌జీబీ కొన్నవారికి వచ్చే లాభం ఎంత?

ఈ సిరీస్ ఇన్వెస్టర్లకు కొనుగోలు ధరపై సుమారు 202% నుంచి 205% వరకు లాభం లభిస్తోంది. దీనికి అదనంగా ఏటా 2.5% వడ్డీ కూడా అందుతుంది.

4. కొత్త బాండ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా?

ఏప్రిల్ 2026 నాటికి ప్రభుత్వం కొత్త ఎస్‌జీబీ జారీపై ఎటువంటి ప్రకటన చేయలేదు. పాత బాండ్లను మాత్రమే సెకండరీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More