Fifa world cup 2026 : మెస్సి ఫ్యాన్స్​కి గుండెపోటు! ఫైనల్​లో గెలిచిన స్పెయిన్- అర్జెంటీనా ఓటమికి కారణాలు..

Argentina vs Spain highlights : ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్​లో అర్జెంటీనాపై స్పెయిన్ చారిత్రాత్మక విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెర్రాన్ టోరెస్ కొట్టిన గోల్‌తో స్పెయిన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఓటమికి 5 కారణాలను ఇక్కడ చూడండి..

Published on: Jul 20, 2026, 05:42:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూయార్క్ న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠకు తెరదించుతూ ఫుట్‌బాల్ ప్రపంచానికి కొత్త రాజును పరిచయం చేసింది. పది మంది ఆటగాళ్లతో పోరాడిన అర్జెంటీనా జట్టును లీగ్ దశ నుంచి అజేయంగా దూసుకొచ్చిన స్పెయిన్ మట్టికరిపించింది! మ్యాచ్ 116వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ ఫెర్రాన్ టోరెస్ అందించిన సంచలన గోల్‌తో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనా, లియోనెల మెస్సి ఫ్యాన్స్ గుండెల్ని ముక్కలు చేసింది.

ఫైనల్​లో ఓటమి అనంతరం మెస్సి కన్నీళ్లు.. (REUTERS)
ఫైనల్​లో ఓటమి అనంతరం మెస్సి కన్నీళ్లు.. (REUTERS)

కేవలం ఒకే ఒక్క గోల్ తేడాతో మ్యాచ్ ముగిసినప్పటికీ, మైదానంలో 120 నిమిషాల పాటు సాగిన ఆటలో స్పెయిన్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయంతో స్పెయిన్ జట్టు రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. గతంలో 2010లో నెదర్లాండ్స్‌పై గెలిచిన స్పెయిన్‌ మొదటి ప్రపంచకప్‌ దక్కించుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు అదే సీన్ రిపీట్ చేస్తూ టోరెస్ స్పెయిన్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.

ఈ మెగా ఫైనల్లో అర్జెంటీనా ఓటమితో మెస్సి మైదానంలో ఎడ్చేశాడు. ఆ దృశ్యాలు చూసిన ఫ్యాన్స్​ కూడా భావోద్వేగానికి గురయ్యారు.

అయితే, ఫిఫా వరల్డ్​ కప్ 2026 ఫైనల్​లో అర్జెంటీనా పరాజయం తప్పడానికి, స్పెయిన్ వైపు విజయం మొగ్గడానికి దారితీసిన 5 ప్రధాన కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం:

1. లియోనల్ మెస్సిపై అతిగా ఆధారపడటం!

ఈ ఫైనల్​లో, అంతకుముందు వరకు 8 గోల్స్ కొట్టి ఫామ్‌లో ఉన్న అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సిని స్పెయిన్ డిఫెండర్లు పూర్తిగా కట్టడి చేశారు. మ్యాచ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో మెస్సి కేవలం ఒక్కసారి మాత్రమే బంతిని తాకగలిగాడంటే స్పెయిన్ వ్యూహం ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ మొత్తం మీద మెస్సి ఒక్క కీ-పాస్ కూడా ఇవ్వలేకపోయాడు. అతను ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ రేషియో కేవలం 0.04 గానే నమోదైంది. అర్జెంటీనా జట్టు మెస్సిపైనే అతిగా ఆధారపడటం ఈ మ్యాచ్‌లో దెబ్బతీసింది.

2. మిడ్‌ఫీల్డ్‌లో స్పెయిన్ విశ్వరూపం..

ఫిఫా వరల్డ్​ కప్ 2026 పొడవునా స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ విభాగం మ్యాచ్ గమనాన్ని శాసించింది. ప్రత్యర్థి జట్లకు బంతి ఎక్కువ సమయం దొరకకుండా చేయడంలో వారు సఫలమయ్యారు. స్పెయిన్ ఆటగాళ్లు బంతిని వేగంగా పాస్ చేయడమే కాకుండా, ప్రత్యర్థి ఆటగాళ్ల కాళ్ల వద్ద నుంచి బంతిని లాక్కోవడంలో చూపించిన నైపుణ్యం ఈ ఫైనల్లో కూడా స్పష్టంగా కనిపించింది. దీనివల్ల అర్జెంటీనాకు తగినన్ని అవకాశాలు రాలేదు.

3. ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్..

మ్యాచ్ సెకండ్ హాఫ్ ఇంజూరీ టైమ్ (93వ నిమిషం)లో అర్జెంటీనాకు ఊహించని షాక్ తగిలింది. స్పెయిన్ ప్లేయర్ పావ్ కుబార్సిని ఫౌల్ చేసినందుకు ఎంజో ఫెర్నాండెజ్ రెండో యెల్లో కార్డుతో పాటు రెడ్ కార్డ్ పొంది మైదానాన్ని వీడాల్సి వచ్చింది. టోర్నమెంట్ మొత్తంలో కేవలం ఒకే ఒక్క గోల్ సమర్పించుకున్న బలమైన స్పెయిన్ డిఫెన్స్ ముందు, ఒక ఆటగాడు తక్కువతో అర్జెంటీనా ఆడటం ఆ జట్టు కొంపముంచింది! ఎక్స్‌ట్రా టైమ్ సెకండ్ హాఫ్ 6వ నిమిషంలో ఈ అదనపు ఆటగాడి అడ్వాంటేజ్‌ను వాడుకున్న ఫెర్రాన్ టోరెస్, బంతిని నేరుగా నెట్ పైభాగానికి పంపి స్పెయిన్ క్యాంప్‌లో సంబరాలు నింపారు.

4. లిసాండ్రో మార్టినెజ్ గాయం..

ఈ ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా డిఫెన్స్‌కు లిసాండ్రో మార్టినెజ్, క్రిస్టియన్ రొమెరోల జోడీ కొండంత అండగా నిలిచింది. అయితే, ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి మార్టినెజ్ గాయపడటంతో కోచ్ లియోనెల్ స్కలోని.. విధిలేని పరిస్థితిలో 38 ఏళ్ల సీనియర్ డిఫెండర్ నికోలస్ ఒటామెండిని బరిలోకి దించాల్సి వచ్చింది. ఒటామెండి ఈ టోర్నీలో కేవలం గ్రూప్ స్టేజ్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. మార్టినెజ్ లాంటి కీలక ఆటగాడు తప్పుకోవడంతో అర్జెంటీనా డిఫెన్స్ లైన్ బ్యాలెన్స్ పూర్తిగా తప్పింది.

5. నామమాత్రంగా మారిన అర్జెంటీనా అటాక్!

ఫైనల్‌కు ముందు వరకు 19 గోల్స్ కొట్టి టోర్నీలోనే అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా ఉన్న అర్జెంటీనా అటాక్.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో కనీసం ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్ వైపు కొట్టలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ మొత్తం మీద అర్జెంటీనా కేవలం రెండు షాట్లు మాత్రమే కొట్టింది. దీనికి భిన్నంగా స్పెయిన్ ఏకంగా 20 షాట్లు కొట్టగా, అందులో 12 ఆన్-టార్గెట్ షాట్లు ఉన్నాయి. స్పెయిన్ ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ రేటింగ్ 1.94 కాగా, అర్జెంటీనా కేవలం 0.17 గా మాత్రమే నమోదైంది.

ఏదేమైనా.. ఈ ఫిఫా వరల్డ్​ కప్ 2026 ఫైనల్ మెస్సి ఫ్యాన్స్​కి పీడకలగా నిలిచింది. కానీ, అటు స్పెయిన్​లో మాత్రం సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More