FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. తెలంగాణలో తెల్లార్లు బార్లు ఓపెన్!

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026 దృష్టిలో పెట్టుకుని మందుబాబుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. బార్ల పనివేళలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Jul 18, 2026, 07:11:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ మ్యాచ్‌లను వీక్షించే మందుబాబుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. నగరంలో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్, అంతేకాకుండా థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ కోసం జరిగే పోటీల దృష్ట్యా బార్లు, క్లబ్‌లు, మైక్రోబ్రూవరీలకు లిక్కర్ సర్వీస్ వేళలను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈ సడలింపు ద్వారా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ పొందిన సంస్థలు జూలై 18-19 మధ్య తెల్లవారుజామున 4.30 గంటల వరకు, అలాగే జూలై 19, 20 మధ్య రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు తెరిచి ఉంచడానికి అనుమతి లభించింది.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్ జారీ చేసిన ఈ ఉత్తర్వులు హైదరాబాద్, దాని పరిసర పట్టణ ప్రాంతాలలోని లైసెన్స్ పొందిన 2B బార్లు, C1 క్లబ్‌లు, TD1, TD2 సంస్థలు, అలాగే మైక్రోబ్రూవరీలకు వర్తిస్తాయి. అర్ధరాత్రి వేళల్లో జరిగే ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ఫుట్‌బాల్ అభిమానుల అవసరాలను తీర్చేందుకు అదనపు పనివేళలను అనుమతించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ చట్టాలు, లైసెన్సింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలనే నిబంధనతో ఎక్సైజ్ శాఖ ఈ సడలింపును మంజూరు చేసింది.

అయితే ఈ సడలింపు కేవలం పనివేళలకు మాత్రమే వర్తిస్తుందని, చట్టపరమైన నిబంధనల అమలులో ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌లలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌లతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, ఎల్.బి. నగర్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జిల్లాల ఎక్సైజ్ అధికారులు ఈ పొడిగించిన వేళల్లో కార్యకలాపాలు కచ్చితంగా చట్టానికి లోబడి జరిగేలా చూడాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లోని నైట్‌లైఫ్‌కు ఈ నిర్ణయం వీకెండ్ వ్యాపారాన్ని మరింత పుంజుకునేలా చేస్తుందని భావిస్తున్నారు. ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌ల సమయంలో అభిమానుల సందడితో కళకళలాడుతుంటాయి బార్లు, పబ్‌లు, మైక్రోబ్రూవరీలు. ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రేమికులు బార్ల వేళలు పొడిగింపుతో చిల్ అవ్వనున్నారు. ఆంక్షలు మాత్రం కఠినంగానే ఉంటాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. సిటీలో ప్రత్యేకంగా తనిఖీలు ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More