Stock market crash : చమురు తెచ్చిన అలజడులు- స్టాక్​ మార్కెట్ క్రాష్​! లక్ష కోట్ల సంపద ఆవిరి..

Stock market today : అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు అతి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 1500కిపైగా, నిఫ్టీ50 500 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

Published on: Mar 9, 2026, 09:16:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆకాశాన్ని తాకిన ముడి చమురు ధరల కారణంగా.. ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో అల్లకల్లోలం నెలకొంది. ఫలితంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లోనూ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు అతి భారీ నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1862 పాయింట్లు పడి 77,057 వద్ద ఓపెన్​ అయ్యింది. నిఫ్టీ50 ఏకంగా 582 పాయింట్లు కోల్పోయి 23,868 వద్ద సెషన్​ని ప్రారంభించింది. ఇక 1662 పాయింట్లు పడిన బ్యాంక్​ నిఫ్టీ 56,121 వద్ద సెషన్​ని మొదలుపెట్టింది.

స్టాక్​ మార్కెట్​ క్రాష్​..
స్టాక్​ మార్కెట్​ క్రాష్​..

దేశీయ సూచీల పతనం కేవలం ఓపెన్​తో ముగియలేదు. ఆ తర్వాత స్టాక్​ మార్కెట్​లు మరింత వేగంగా కిందకు స్లైడ్​ అయ్యాయి. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు సెన్సెక్స్​ 2,130 పాయింట్లు, నిఫ్టీ 651 పాయింట్ల మేర డౌన్​ అయ్యాయి.

సెన్సెక్స్​30లో అన్ని స్టాక్స్​ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. ఇండిగో ఏకంగా 6శాతం, టాటా స్టీల్​ 5.4శాతం, ఎల్​ అండ్​ టీ 4,9శాతం మేర పడ్డాయి.

స్టాక్​ మార్కెట్​ ఎందుకు క్రాష్​ అవుతోంది? ఇవీ కారణాలు..

  1. ముడి చమురు ధర 115 డాలర్లకు పైనే..

పశ్చిమాసియా అలజడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు రాత్రికి రాత్రే అతి భారీగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్​ క్రూడ్​ ధర 26శాతం పెరిగి బ్యారెల్​కు ఏకంగా 117.16 డాలర్ల వద్దకు చేరింది.

హర్ముజ్​ జలసంధి వల్లే ఇదంతా వచ్చింది! ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే ఈ హర్ముజ్​ జలసంధి ఇరాన్​ చేతుల్లో ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్​ దాడుల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఇరాన్​ మూసివేయడంతో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. అందుకే, ముడి చమురు ధరలు ఈ స్థాయిలో పెరిగాయి.

చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఒకటి. మన దేశ అవసరాల్లో 85-90శాతం ముడి చమురు విదేశాల నుంచే వస్తుంది. తాజా పరిణామాలతో దేశంలో సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉండటం ఆవేదనకు గురిచేస్తోంది. సాధారణంగా.. ఒక బ్యారెల్​పై ఒక్క డాలరు పెరిగినా, దేశ ఆర్థిక వ్యవస్థపై సుమారు రూ. 16వేల కోట్ల భారం పడుతుంది. అలాంటిది.. ఇప్పుడు ముడి చమురు ఏకంగా 26శాతం పెరిగింది!

ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ వెళితో.. దేశంలో ద్రవ్యోల్బణం కూడా వృద్ధి చెందుతుంది. ఇదే జరిగితే, వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ స్టాండ్​ మారొచ్చు! ఇది ఇన్వెస్టర్లకు మరో ఆందోళనకర విషయం.

2. పడిపోతున్న రూపాయి విలువ..

తాజా పరిణామాల నేపథ్యంలో 'రూపాయి' పరిస్థితి కూడా బాగోలేదు! రోజురోజుకూ రూపాయి విలువ క్షిణిస్తూనే ఉంది. సోమవారం డాలరుతో పోల్చితే రూపాయి విలువ 0.5శాతం పడి 92.19కి చేరింది.

రూపాయి బలహీన పడుతూ ఉంటే ఎఫ్​ఐఐలు (ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు) స్టాక్​ మార్కెట్​లో తమ వాటాను కట్​ చేసుకుంటారు. ఇది మరింత సెల్లింగ్​కి దారి తీస్తుంది.

3. కనపడని ముగింపు..

స్టాక్​ మార్కెట్​లకు అనిశ్చితి అంటే ఇష్టం ఉండదు! పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పుడు శాంతియుతంగా మారతాయో ప్రస్తుతం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇది ఎంత ఎక్కువ రోజులు కొనసాగితే, సూచీలకు అంత నష్టాలు తప్పవు! ఇది ఇన్వెస్టర్లను భయపెడుతోంది.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More