Stock market holiday : ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్! ఈరోజు స్టాక్ మార్కెట్లకు సెలవు- కారణం..
Stock market holiday today : మొహర్రం పురస్కరించుకుని ఈరోజు (శుక్రవారం, జూన్ 26) భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్ఈల్లో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది. కమోడిటీ మార్కెట్ (ఎంసీఎక్స్) మాత్రం సాయంత్రం సెషన్‌లో పనిచేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతీయ స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు గమనిక. మొహర్రం సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు (జూన్ 26, శుక్రవారం) పనిచేయడం లేదు. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లు ట్రేడింగ్ సెలవును ప్రకటించాయి. దాదాపు నెల రోజుల క్రితం మే 28న బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు ఇవ్వగా.. మళ్లీ ఇన్నాళ్లకు మార్కెట్లకు ట్రేడింగ్ సెలవు వచ్చింది. ఈ సెలవు ముగిసిన తర్వాత తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు సెప్టెంబర్ 14 (సోమవారం) గణేష్ చతుర్థి నాడు రానుంది!

ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ అధికారిక క్యాలెండర్ ప్రకారం.. ఈరోజు ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎన్‌డీఎస్-ఆర్‌ఎస్‌టీ, ట్రై-పార్టీ రెపో సెగ్మెంట్లలో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. 2026 సంవత్సరానికి గానూ మొత్తం 16 స్టాక్ మార్కెట్ సెలవులు ప్రకటించగా.. ఇప్పటివరకు 9 సెలవులు ముగిశాయి. మిగిలిన ఏడాదిలో మార్కెట్లు మరో 7 సందర్భాల్లో మూతపడనున్నాయి.
స్టాక్ మార్కెట్లకు రాబోయే సెలవుల వివరాలు..
ఈ ఏడాది రాబోయే రోజుల్లో గాంధీ జయంతి (అక్టోబర్ 2), దసరా (అక్టోబర్ 20), దీపావళి బలిపాడ్యమి (నవంబర్ 10), గురునానక్ జయంతి (నవంబర్ 24), క్రిస్మస్ (డిసెంబర్ 25) లలో మార్కెట్లకు ట్రేడింగ్ సెలవులు ఉంటాయి. కాగా, ఈ ఏడాది మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), ఈద్-ఉల్-ఫితర్ (మార్చి 21), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), దీపావళి లక్ష్మీపూజ (నవంబర్ 8) పండుగలు వారాంతాల్లో (శని, ఆదివారాలు) రావడం వల్ల వీటికి అదనపు ట్రేడింగ్ సెలవులు లభించలేదు.
కమోడిటీ మార్కెట్ అప్‌డేట్..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే, జూన్ 26న మార్కెట్లకు పాక్షిక సెలవు ఉంటుంది. ఎంసీఎక్స్ క్యాలెండర్ ప్రకారం.. ఈరోజు ఉదయం సెషన్ (ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు) ట్రేడింగ్ నిలిచిపోతుంది. అయితే, సాయంత్రం సెషన్ (సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 11:30 / 11:55 గంటల వరకు) యథావిధిగా ట్రేడింగ్ కొనసాగుతుంది.
నిన్నటి స్టాక్ మార్కెట్ పరిస్థితి..
గురువారం నాడు భారత బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 0.7% లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక శాంతి ఒప్పందం కుదరడంతో హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పునఃప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశానికి ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి పరంగా పెద్ద ఉపశమనంగా మారింది.
మరోవైపు గురువారం ట్రేడింగ్ సెషన్‌లో ఎఫ్ఐఐలు రూ. 383.76 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,747.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


