స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఉపయోగపడే ఐదు డిజిటల్ టూల్స్ ఇవే

డిజిటల్ వేదికల ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు సులభతరం అయ్యాయి. స్టాక్ స్క్రీనర్లు, చార్టింగ్ టూల్స్, పోర్ట్‌ఫోలియో ట్రాకర్లను సరైన అవగాహనతో వాడితే మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చని కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ విభాగాధిపతి శ్రీకాంత్ చౌహాన్ సూచించారు.

Published on: Nov 25, 2026, 12:27:13 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

డిజిటల్ వేదికల రాకతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు గతంలో ఎన్నడూ లేనంత సులభంగా మారాయి. మార్కెట్ సమాచారం తెలుసుకోవడం, కంపెనీల పనితీరు విశ్లేషించడం, షేర్ల ధరలు గమనించడం, పోర్ట్‌ఫోలియో నిర్వహించడం ఇప్పుడు ఇన్వెస్టర్లకు సులభతరమైంది. అయితే అనేక టూల్స్ అందుబాటులో ఉన్నంత మాత్రాన మెరుగైన పెట్టుబడి నిర్ణయాలు వస్తాయని చెప్పలేమని కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ విభాగాధిపతి శ్రీకాంత్ చౌహాన్ స్పష్టం చేశారు.

కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ విభాగాధిపతి శ్రీకాంత్ చౌహాన్
కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ విభాగాధిపతి శ్రీకాంత్ చౌహాన్

కొత్తగా వచ్చేవారితో పాటు అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు కూడా సరైన టూల్స్ కలిపి వాడితే పరిశోధన సులభం అవుతుంది. పర్యవేక్షణ మెరుగుపడి, పెట్టుబడుల్లో క్రమశిక్షణ వస్తుంది. ఈ టూల్స్ ఎలా పనిచేస్తాయి, ఏ సమాచారం ఇస్తాయి, అన్నింటికంటే ముఖ్యంగా అవి ఏ విషయాలు చెప్పలేవు అనేది అర్థం చేసుకోవడం కీలకం.

స్టాక్ స్క్రీనర్లు: సరైన అవకాశాల వేట

మార్కెట్ క్యాపిటలైజేషన్, ఆదాయ వృద్ధి, లాభదాయకత, రుణ స్థాయిలు, ప్రైస్ టు ఎర్నింగ్స్ నిష్పత్తి, డివిడెండ్ ఈల్డ్ వంటి అంశాల ఆధారంగా కంపెనీలను వడపోయడానికి స్టాక్ స్క్రీనర్లు తోడ్పడతాయి. లిస్టెడ్ కంపెనీలన్నింటినీ విడివిడిగా విశ్లేషించే బదులు, తమ పెట్టుబడి అభిరుచులకు సరిపోయే షేర్ల జాబితాను వీటితో సులభంగా రూపొందించుకోవచ్చు. ఆర్థికంగా బలంగా ఉండే కంపెనీల కోసం చూసేవారు స్థిరమైన లాభాల వృద్ధి, తక్కువ రుణాలు వంటి ఫిల్టర్లు వాడతారు.

అయితే ఎంచుకున్న ప్రమాణాల మేరకు కంపెనీలను గుర్తించడం వరకే స్క్రీనర్లు చేస్తాయి. భవిష్యత్తు పనితీరుకు హామీ ఇవ్వలేవు, సరైన వాల్యుయేషన్‌లో షేరు లభిస్తోందా లేదా అనేదీ చెప్పలేవు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు లోతైన పరిశోధన తప్పనిసరి.

వాచ్‌లిస్టులు, ధరల అలర్ట్లు: ఎప్పటికప్పుడు సమాచారం

ఇన్వెస్టర్లు తమకు ఆసక్తి ఉన్న షేర్లతో ప్రత్యేక జాబితా రూపొందించుకోవడానికి వాచ్‌లిస్టులు ఉపయోగపడతాయి. ప్రతిసారీ షేర్ల కోసం వెతకాల్సిన పని లేకుండా ఎంచుకున్న వాటిని సులభంగా గమనించవచ్చు. ధరల అలర్ట్లు మరో అడుగు ముందుకేసి, షేరు ధర నిర్దేశిత స్థాయికి చేరినప్పుడు లేదా ఏదైనా షరతు నెరవేరినప్పుడు ఇన్వెస్టర్లకు సమాచారం అందిస్తాయి.

ధర కదలికను మాత్రమే ధరల అలర్ట్ తెలియజేస్తుంది. షేరు కొనాలా లేదా అమ్మాలా అనే విషయాన్ని ఇది సూచించదు. ఆ కదలిక వెనుక కారణం ఏమిటో పరిశీలించిన తర్వాతే ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాలి.

చార్టింగ్ టూల్స్: మార్కెట్ ట్రెండ్‌ల అవగాహన

గత ధరల కదలికలు, ట్రేడింగ్ వాల్యూమ్‌లు, మార్కెట్ ట్రెండ్‌లను అధ్యయనం చేయడానికి చార్టులు సహాయపడతాయి. మూవింగ్ యావరేజ్‌లు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ), ఎంఏసీడీ వంటి టూల్స్ మొమెంటం, సంభావ్య మార్పులు, ప్రవేశించే లేదా బయటకు వచ్చే స్థాయిలను గుర్తించడంలో ఉపయోగపడతాయి. దీర్ఘకాలంగా ఓ షేరును గమనించేవారు విస్తృత ధరల ధోరణిని తెలుసుకోవడానికి మూవింగ్ యావరేజ్‌లను వాడతారు.

గత డేటా ఆధారంగా పనిచేసే టెక్నికల్ ఇండికేటర్లు, ముఖ్యంగా మార్కెట్ ఒడుదొడుకుల్లో తప్పుదారి పట్టించే సంకేతాలు ఇవ్వవచ్చు. వీటిని విడిగా కాకుండా ఇతర పరిశోధనలతో కలిపి వాడాలి.

ఆర్థిక డేటా వేదికలు: కంపెనీ మూలాల విశ్లేషణ

కంపెనీల త్రైమాసిక ఫలితాలు, బ్యాలెన్స్ షీట్లు, వార్షిక నివేదికలు, నగదు ప్రవాహాలు, షేర్‌హోల్డింగ్ సరళి, రంగాల పోలికలను ఆర్థిక డేటా వేదికలు అందిస్తాయి. వీటి ద్వారా కంపెనీ ఆర్థిక ఆరోగ్యం, వ్యాపార పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఒకే రంగంలోని కంపెనీల ఆదాయ వృద్ధి, లాభదాయకత, రుణ స్థాయిలను పోల్చి చూడటానికి ఇవి పనికొస్తాయి.

ఆర్థిక సమాచారం గత, ప్రస్తుత పనితీరును మాత్రమే చూపుతుంది, భవిష్యత్తు వృద్ధికి హామీ ఇవ్వదు. యాజమాన్యం నాణ్యత, రంగం పరిస్థితులు, మారుతున్న వ్యాపార రిస్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

పోర్ట్‌ఫోలియో ట్రాకర్లు: పెట్టుబడుల పనితీరు పర్యవేక్షణ

ఇన్వెస్టర్ల వద్ద ఉన్న షేర్లు, కొనుగోలు ధరలు, ప్రస్తుత మార్కెట్ విలువలు, మొత్తం రాబడి, రంగాల వారీ కేటాయింపులను పోర్ట్‌ఫోలియో ట్రాకర్లు చూపిస్తాయి. కొన్ని వేదికలు పోర్ట్‌ఫోలియో ఏకాగ్రత, పనితీరుపై విశ్లేషణ కూడా ఇస్తాయి. పెట్టుబడులు ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని వీటితో తెలుసుకోవచ్చు.

పెర్ఫార్మెన్స్‌ను మాత్రమే పోర్ట్‌ఫోలియో ట్రాకర్లు చూపుతాయి. పెట్టుబడిని కొనసాగించాలా లేక అమ్మేయాలా అనేది నిర్ణయించలేవు. ఆ నిర్ణయాల కోసం కంపెనీ మూలాలు, ఇన్వెస్టర్ ఆర్థిక లక్ష్యాలను సమీక్షించాలి.

సరైన విధానంలో టెక్నాలజీ వినియోగం

కోటక్ నియో వంటి వేదికలు స్క్రీనర్లు, వాచ్‌లిస్టులు, ధరల అలర్ట్లు, చార్టింగ్ సౌకర్యాలు, పోర్ట్‌ఫోలియో టూల్స్‌ను ఒకేచోట అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకే వేదికపై ఉండటం వల్ల పరిశోధన, పర్యవేక్షణ సులభం అవుతుంది.

"టెక్నాలజీ అనేది కేవలం సహాయక వ్యవస్థ మాత్రమే కానీ, సొంత పరిశోధనకు లేదా సరైన విచక్షణకు ప్రత్యామ్నాయం కాదు," అని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అధికంగా అలర్ట్లు, ఇండికేటర్లు లేదా మార్కెట్ అప్‌డేట్లు అనవసర ట్రేడింగ్‌కు, భావోద్వేగ నిర్ణయాలకు దారితీయవచ్చు.

స్టాక్ మార్కెట్‌కు చేరువ కావడాన్ని టెక్నాలజీ సులభతరం చేసింది. కానీ విజయవంతమైన పెట్టుబడులు ఇప్పటికీ జ్ఞానం, క్రమశిక్షణ, ఓపికపైనే ఆధారపడి ఉంటాయి. ఏ ఒక్క ఇండికేటర్‌పైనా ఆధారపడకుండా స్క్రీనర్లు, చార్టులు, ఆర్థిక డేటా, పోర్ట్‌ఫోలియో ట్రాకర్లను పరస్పర సహాయక సాధనాలుగా వాడాలి. ప్రతి మార్కెట్ కదలికను వెంటాడటం కాకుండా, దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు తగిన సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడమే లక్ష్యం కావాలి. టెక్నాలజీ పెట్టుబడి ప్రక్రియను మెరుగుపరుస్తుంది కానీ, నిర్ణయాల నాణ్యత మాత్రం ఇన్వెస్టర్ చేతిలోనే ఉంటుంది.

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.