ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన పోలీసు కేసుల ఉపసంహరణపై అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను చట్ట ప్రకారం మూసివేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని వెల్లడించింది.

జూలై 28న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఉన్న 'నేర చరిత్ర' (Criminal Antecedents) అనే పదంపై వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక స్పష్టత ఇచ్చింది.
"చట్ట ప్రకారం ఈ కేసులను మూసివేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఢిల్లీకి, ఇతర రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. గత ఉత్తర్వుల్లో పేర్కొన్న 'నేర చరిత్ర' అనే పదం కేవలం దారుణమైన, తీవ్రమైన నేరాలకు మాత్రమే వర్తిస్తుంది" అని సీజేఐ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
పోలీసులు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను 'నేర చరిత్ర'గా విస్తృతంగా చిత్రీకరిస్తూ అనవసర అరెస్టులకు పాల్పడుతున్నారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించడంతో ధర్మాసనం ఈ వివరణ ఇచ్చింది.
శాంతియుత నిరసనకారులపై చర్యలు ఉండవు
ధర్మాసనం వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తరఫున ప్రవేశించిన సొలిసిటర్ జనరల్ (SGI) తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులను, కరడుగట్టిన నేరస్థులతో పోల్చకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
"చట్టబద్ధమైన రీతిలో నిరసనలు తెలిపిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవు. తీవ్రమైన నేర చరిత్ర లేని విద్యార్థులందరి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం" అని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్పష్టతపై సీజేపీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం సందేహాలను నివృత్తి చేసినందున, జూలై 25న దేశ యువతకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం, బిజేపి/ఎన్డిఎ పాలిత రాష్ట్రాలు వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
{{/usCountry}}సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్పష్టతపై సీజేపీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం సందేహాలను నివృత్తి చేసినందున, జూలై 25న దేశ యువతకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం, బిజేపి/ఎన్డిఎ పాలిత రాష్ట్రాలు వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
{{/usCountry}}"సిజేపి ప్రతి విద్యార్థికి, ప్రతి నిరసనకారుడికి అండగా నిలిచింది. బాధిత విద్యార్థులకు న్యాయపరమైన మద్దతుతో పాటు వైద్య సహాయం అందించాం. మున్ముందు కూడా ఈ సాయం కొనసాగుతుంది" అని సౌరవ్ దాస్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. విద్యార్థులకు అండగా నిలుస్తున్న న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు.
పోలీసుల అతిప్రవర్తనపై ప్రత్యేక విచారణ?
నిరసనకారులపై పోలీసులు అదనపు బలప్రయోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు ఆలోచన చేస్తోంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో కూడిన ఏకసభ్య సిట్ (SIT) లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ద్వారా విచారణ జరిపించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ఈ ప్రత్యేక కమిటీ అధికారులు, నిరసనకారులు ఇరుపక్షాల ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని సీజేఐ సూర్య కాంత్ తెలిపారు.
అలాగే వివిధ రాష్ట్రాల్లోని కేసుల వివరాలను సేకరించి, నేర చరిత్ర లేని విద్యార్థులను, కరడుగట్టిన నేరస్థులను వేర్వేరుగా వర్గీకరించిన తర్వాత కేసుల ఎత్తివేత ప్రక్రియను చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది.