ఎన్సీఈఆర్‌టీ పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం: 'న్యాయవ్యవస్థలో అవినీతి' పాఠం వెనుక పెద్ద కుట్ర ఉందన్న సీజేఐ

8వ తరగతి ఎన్సీఈఆర్‌టీ పుస్తకంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే వివాదాస్పద పాఠంపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. దీని వెనుక లోతైన కుట్ర ఉందని పేర్కొంటూ, విద్యాశాఖ కార్యదర్శికి, ఎన్సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ పుస్తకంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Feb 26, 2026, 12:09:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

8వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ నుంచి పీడీఎఫ్ కాపీలను వెంటనే తొలగించాలని కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఎన్సీఈఆర్‌టీ పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం: 'న్యాయవ్యవస్థలో అవినీతి' పాఠం వెనుక పెద్ద కుట్ర ఉందన్న సీజేఐ (HT_PRINT)
ఎన్సీఈఆర్‌టీ పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం: 'న్యాయవ్యవస్థలో అవినీతి' పాఠం వెనుక పెద్ద కుట్ర ఉందన్న సీజేఐ (HT_PRINT)

న్యాయవ్యవస్థ రక్తం ఓడుతోంది - సీజేఐ సూర్యకాంత్

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా పాఠ్యపుస్తకాల్లో కంటెంట్‌ను పొందుపరచడంపై సుప్రీంకోర్టు అత్యంత కఠినంగా స్పందించింది. 8వ తరగతి ఎన్సీఈఆర్‌టీ సోషల్ సైన్స్ పుస్తకంలో "న్యాయవ్యవస్థలో అవినీతి" (Corruption in Judiciary) అనే సబ్-చాప్టర్‌పై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.

"వారు తుపాకీతో కాల్చారు, నేడు న్యాయవ్యవస్థ రక్తం ఓడుతోంది. ఈ రోజు ఎవరైనా ఏదైనా చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఇది చాలా పక్కాగా జరిగిన కుట్రగా కనిపిస్తోంది. భారత న్యాయవ్యవస్థను అవినీతిమయంగా చూపిస్తూ పిల్లలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?" అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

ఎవరెవరికి నోటీసులు?

ఈ వివాదాస్పద పాఠాన్ని రూపొందించిన వారిని గుర్తించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి, ఎన్సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఆన్‌లైన్ కాపీల తొలగింపునకు ఆదేశం

ఈ పుస్తకానికి సంబంధించి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని పీడీఎఫ్ (PDF) కాపీలను తక్షణమే తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. దీనిపై స్పందించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అండగా ఉంటుందని, కోర్టు కోరిన విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆ రచయితలు ఎవరు?

ఈ పాఠాన్ని రూపొందించిన 'టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీ' వివరాలను రికార్డుల్లో ఉంచాలని ఎన్సీఈఆర్‌టీని కోర్టు ఆదేశించింది. సదరు చాప్టర్ డెవలప్‌మెంట్ టీమ్‌లో ఉన్న సభ్యుల పేర్లు, వారి విద్యార్హతలు, వారి పూర్వాపరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్సీఈఆర్‌టీ క్షమాపణలు చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణను కొనసాగిస్తోంది.

"ఈ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమించినా లేదా పక్కదారి పట్టించాలని చూసినా, దానిని నేరుగా న్యాయవ్యవస్థ పాలనలో జోక్యంగా భావిస్తాం. అటువంటి వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయి" అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అసలు ఈ వివాదం ఏమిటి?

ఎన్సీఈఆర్‌టీ 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో 'మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర' అనే పాఠంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే అంశాన్ని చేర్చారు. దీనిపై న్యాయవర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

2. సుప్రీంకోర్టు తీసుకున్న ప్రధాన చర్యలేమిటి?

సదరు పుస్తకంపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ఇంటర్నెట్ నుంచి డిజిటల్ కాపీలను తొలగించాలని ఆదేశించింది. దీని వెనుక ఉన్న రచయితల వివరాలను కోరింది.

3. ప్రభుత్వం దీనిపై ఏమంటోంది?

న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోర్టు ఆదేశాల మేరకు తక్షణమే వెబ్‌సైట్ల నుంచి ఆ కంటెంట్‌ను తొలగిస్తామని కేంద్రం తెలిపింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More