...
...
Next Story

విద్యార్థుల భవిష్యత్‌ ముఖ్యం: ఢిల్లీ పోలీసులకు 'ఫ్రీ హ్యాండ్' అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఆందోళనకారులపై చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులకు 'ఫ్రీ హ్యాండ్' ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిరసనల్లో పాల్గొంటున్న యవజన విద్యార్థుల భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Published on: Oct 9, 2026, 14:09:55 IST
Advertisement

న్యూఢిల్లీ: నిరసనల్లో పాల్గొంటున్న యువ విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబ సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉందంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆందోళనకారులను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులకు 'ఫ్రీ హ్యాండ్' ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్ (PIL) ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఖరాకండిగా తోసిపుచ్చింది.

వారికి సుదీర్ఘ భవిష్యత్తు ఉంది: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విద్యార్థుల భవిష్యత్‌ ముఖ్యం: ఢిల్లీ పోలీసులకు 'ఫ్రీ హ్యాండ్' అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు (HT_PRINT)
విద్యార్థుల భవిష్యత్‌ ముఖ్యం: ఢిల్లీ పోలీసులకు 'ఫ్రీ హ్యాండ్' అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు (HT_PRINT)

ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆందోళనలు చేపట్టే యువ విద్యార్థులను సుదీర్ఘమైన కోర్టు కేసుల్లోకి లేదా చట్టపరమైన చిక్కుల్లోకి లాగకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.

"మన ముందున్నది యువ విద్యార్థులు, ఆందోళనకారులు. వారి తల్లిదండ్రుల గురించి, వారి సుదీర్ఘమైన భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. వారు అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదు" అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు.

పిటిషన్‌ను ఎందుకు కొట్టివేశారంటే..

ఎల్. రామనాథన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులకు సార్వభౌమాధికారం ఉందని, వారు న్యాయపరమైన జోక్యం లేకుండా స్వతంత్రంగా పనిచేసేలా 'ఫ్రీ హ్యాండ్' ఇవ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. గత జూలైలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా నమోదైన ఎఫ్ఐఆర్‌లపై తగిన విచారణ జరిపేలా పోలీసులను అనుమతించాలని కోరారు.

అయితే, ఈ విజ్ఞప్తిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తన ప్రత్యేక రాజ్యాంగ అధికారాలను (Article 142) ఉపయోగించి సదరు విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేసిందని, ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేయడం అంటే ఆ తీర్పును సమీక్షించమని కోరడమే అవుతుందని ధర్మాసనం తెలిపింది. "మేం ఇచ్చే ప్రతీ ఉత్తర్వు 100% సరైనదిగా ఉంటుందని చెప్పలేం. కానీ విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం దృష్ట్యా మేం ఆ నిర్ణయం తీసుకున్నాం" అని సీజేఐ స్పష్టం చేశారు.

అక్టోబర్ 10 నిరసనలకు అనుమతి నిరాకరణ

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, 'ఓట్ల చోరీ'కి బాధ్యత వహిస్తూ సీఈసీ రాజీనామా చేయాలని సీజేపీ, ప్రతిపక్ష కూటమి నాయకులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అక్టోబర్ 6న ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు చేపట్టిన నిరసన ర్యాలీకి కూడా సీజేపీ మద్దతు తెలిపింది.

ఇదిలా ఉండగా, గత 10 నెలల్లో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించిన కీలక నిర్ణయాలను తమకు తెలియకుండా, ప్రతిపాదనలు లేకుండానే తీసుకున్నారంటూ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనంలో వెల్లడైన తర్వాత, సీఈసీపై ప్రతిపక్షాల దాడి మరింత పదునెక్కింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks