...
...
Next Story

కాంగ్రెస్‌కు సుప్రీం షాక్: మీనాక్షి నటరాజన్ పిటిషన్ తిరస్కరణ

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేస్తూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated on: Jun 12, 2026, 16:34:02 IST
Advertisement

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వివాదంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఆమె నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం ఎన్నికల వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యంపై స్పష్టమైన నిషేధం ఉందని, ఇలాంటి సందర్భాల్లో 'ఎలక్షన్ పిటిషన్' దాఖలు చేయడమే ఏకైక మార్గమని కోర్టు స్పష్టం చేసింది.

ఆర్టికల్ 329 అడ్డంకి.. హైకోర్టుకే మొగ్గు

మీనాక్షి నటరాజన్
మీనాక్షి నటరాజన్

జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ ఎ.ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నటరాజన్ కోసం నిబంధనల్లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని బెంచ్ తేల్చిచెప్పింది.

"ఒక అభ్యర్థి నామినేషన్ పత్రం పొరపాటున తిరస్కరణకు గురైనప్పుడు కొన్ని కేసుల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, మరికొన్ని కేసులను ఎలక్షన్ పిటిషన్‌కు వదిలేయాలని చెప్పే ఎలాంటి వివరణనూ మేం అంగీకరించలేం" అని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

అయితే, ఈ పిటిషన్‌ను తిరస్కరించడం వల్ల భవిష్యత్తులో ఆమె లేదా ఆమె తరఫున ఎవరైనా హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేస్తే, అక్కడ వినిపించే చట్టపరమైన వాదనలపై ఈ ఉత్తర్వుల ప్రభావం ఏమాత్రం ఉండదని కోర్టు స్పష్టం చేసింది.

కోర్టులో వాడివేడి వాదనలు

మీనాక్షి నటరాజన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ రిటర్నింగ్ అధికారి జూన్ 9న జారీ చేసిన ఉత్తర్వులను తీవ్రంగా తప్పుపట్టారు. హైదరాబాద్ కోర్టుకు సంబంధించిన సమన్ల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదనే నెపంతో నామినేషన్‌ను తిరస్కరించడం విడ్డూరమన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అభ్యర్థికి శిక్ష పడిన కేసులను లేదా కోర్టు చార్జీలు నమోదు చేసిన (Charges framed) కేసుల వివరాలను మాత్రమే వెల్లడించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. హైదరాబాద్ కోర్టు ఇంకా ఈ ప్రైవేట్ ఫిర్యాదును అధికారికంగా విచారణలోకి (Cognizance) తీసుకోలేదని, కేవలం ప్రాథమిక వివరణ మాత్రమే కోరిందని సింఘ్వీ వాదించారు. ఇలాంటి తప్పులపై కోర్టుకు జోక్యం చేసుకునే అధికారం ఉందని పేర్కొన్నారు.

ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఫలితాన్ని ప్రకటించిందని సింఘ్వీ ఆరోపించారు. జూన్ 10నే తాము ఈసీ ముందు వాదనలు వినిపించినా ఎలాంటి స్పందన లేదన్నారు. అయితే, నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో, రంగంలో ఉన్న బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నటరాజన్ నామినేషన్‌పై కేవత్ చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఆమె పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరవుతూ.. అభ్యర్థులు తమపై ఉన్న అన్ని కేసుల వివరాలను వెల్లడించాలా వద్దా అనే చట్టపరమైన అంశం భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, అందుకే ఈ చట్టాల వివరణపై కోర్టుకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నివేదించారు.

అసలు హైదరాబాద్ కేసు నేపథ్యం ఏమిటి?

మీనాక్షి నటరాజన్ తన పిటిషన్‌లో హైదరాబాద్ కోర్టుకు సంబంధించిన కేసు వివరాలను వెల్లడించారు. అది ఒక కాంగ్రెస్ కార్యకర్తపై వచ్చిన వేధింపుల ఫిర్యాదుకు సంబంధించిన వ్యవహారం. 2022లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో మీనాక్షి నటరాజన్ ఆ అంతర్గత ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ బాధితురాలు దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదులో నటరాజన్ పేరును కూడా చేర్చారు. ఈ నోటీసుల ఆధారంగానే మధ్యప్రదేశ్‌లో ఆమె నామినేషన్ రద్దయింది, చివరకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe