...
...
Next Story

ఉచితాల సంస్కృతితో దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతం: రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రాల్లో అమలవుతున్న 'ఉచిత పథకాల'పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓట్ల కోసం ఇచ్చే ఈ ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, అభివృద్ధిని కుంటుపరుస్తాయని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ హెచ్చరించింది.

Published on: Feb 19, 2026, 14:43:29 IST
Advertisement

దేశంలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటిస్తున్న ‘ఉచితాల సంస్కృతి’ (Freebie Culture)పై సుప్రీంకోర్టు గురువారం నిప్పులు చెరిగింది. ఇలాంటి ధోరణి దేశ ఆర్థిక పురోగతికి గొడ్డలి పెట్టు వంటిదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తక్షణమే ఈ విధానాలపై పునఃసమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది.

నేపథ్యం ఏమిటి?

ఉచితాల సంస్కృతితో దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతం: రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు (HT_PRINT)
ఉచితాల సంస్కృతితో దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతం: రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు (HT_PRINT)

తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్’ (Tangedco) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రతిపాదనపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిరుపేదలకు సాయం చేయడం రాష్ట్రాల బాధ్యత అని అంగీకరిస్తూనే, చెల్లించే స్తోమత ఉన్నవారికి కూడా ఉచితాలు పంచడం ఏంటని ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు ప్రధాన పరిశీలనలు:

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసనం పలు కీలక అంశాలను లేవనెత్తింది.

  • రెవెన్యూ లోటున్నా ఉచితాలా?: "దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయి. అభివృద్ధిని విస్మరించి, అప్పుల్లో ఉన్నప్పటికీ ఇలాంటి ఉచిత పథకాలను ఎలా ప్రకటిస్తారు?" అని ధర్మాసనం నిలదీసింది.
  • అభివృద్ధి ఎక్కడ?: రాష్ట్రాలు వసూలు చేసే ఆదాయంలో 25 శాతాన్ని కేవలం ఉచితాలకే కేటాయిస్తే, ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని CJI సూర్యకాంత్ ప్రశ్నించారు.
  • సంక్షేమం vs బుజ్జగింపు: "నిజంగా చెల్లించలేని పేదలకు సాయం చేయడం సంక్షేమం. కానీ, అందరికీ ఉచితంగా పంచడం కేవలం రాజకీయ బుజ్జగింపు (Appeasement Policy) అవుతుంది. ఇది ఏ రకమైన సంస్కృతిని ప్రోత్సహిస్తోంది?" అని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
  • ప్రణాళికాబద్ధమైన విధానాలు: వనరులను ఉచితంగా పంపిణీ చేసే బదులు, నిరుద్యోగ నిర్మూలన వంటి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పక్కా ప్రణాళికలను రూపొందించాలని కోర్టు సూచించింది.

బడ్జెట్ లెక్కలు ఉండాలి

తమిళనాడు విద్యుత్ సంస్థ టారిఫ్ ప్రకటించిన తర్వాత అకస్మాత్తుగా ఉచితాల కోసం నిధులు కేటాయించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అభివృద్ధి ప్రాజెక్టుల కంటే ఉచిత పథకాలకే ప్రాధాన్యత ఇస్తుండటం దేశ భవిష్యత్తుకు క్షేమకరం కాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks