...
...
Next Story

సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం- జమ్ముకశ్మీర్‌లో సైన్యం హై అలర్ట్..

జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు కలకలం రేపాయి. రాజౌరీ, పూంచ్, సాంబా జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్లు కనిపించడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Updated on: Jan 12, 2026, 06:09:41 IST
Advertisement

జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వెంబడి ఆదివారం సాయంత్రం అనుమానాస్పద డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని పలు సరిహద్దు ప్రాంతాల్లో ఈ డ్రోన్ల కదలికలను భద్రతా దళాలు గుర్తించాయి.

పాకిస్థాన్​ డ్రోన్ల కలకలం..

ఎల్​ఓసీ వెంబడి డ్రోన్ల కలకలం.. (Pixabay)
ఎల్​ఓసీ వెంబడి డ్రోన్ల కలకలం.. (Pixabay)

పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఈ ఎగిరే వస్తువులు, కొన్ని నిమిషాల పాటు గగనతలంలో సంచరించి, ఆపై తిరిగి పాక్ వైపునకే వెళ్లిపోయాయని భద్రతా అధికారులు వెల్లడించారు.

భారత సాయుధ దళాలు తక్షణమే స్పందించి 'కౌంటర్ అన్-మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్' (డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలు) ద్వారా చర్యలు చేపట్టడంతో అవి వెనుదిరిగాయని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో సైన్యం విస్తృత గాలింపు చర్యలు చేపట్టింది.

రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పహారా కాస్తున్న సైనికులు, ఆదివారం సాయంత్రం 6:35 గంటల ప్రాంతంలో గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికలను గమనించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు మీడియం, లైట్ మెషీన్ గన్లతో ఆ డ్రోన్ లక్ష్యంగా కాల్పులు జరిపారు.

పూంచ్ జిల్లాలోని మన్‌కోట్ సెక్టార్‌లో కూడా ఇదే తరహా డ్రోన్ హల్‌చల్ చేసింది. సాయంత్రం 6:25 గంటలకు తైన్ నుంచి తోపా వైపు ఇది ప్రయాణించినట్లు సైన్యం గుర్తించింది.

రెండు రోజుల క్రితమే..

వాస్తవానికి రెండు రోజుల క్రితమే సాంబా జిల్లాలోని ఘగ్వాల్ సమీపంలో ఉన్న పలూరా గ్రామంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఆ కన్సైన్‌మెంట్‌లో రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 16 రౌండ్ల తూటాలతో పాటు ఒక గ్రెనేడ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా డ్రోన్ల సంచారం పెరగడం భారత రక్షణ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయుధాలను లేదా మాదకద్రవ్యాలను జారవిడచడానికే పాక్ ఈ డ్రోన్లను ఉపయోగిస్తుండవచ్చని అనుమానిస్తున్నారు.

భద్రతా దళాలు ప్రస్తుతం సరిహద్దు వెంబడి అణువణువూ గాలిస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks