T20 World Cup 2026: టీమిండియా కొంపముంచిన జింబాబ్వే! సెమీస్ రేసు మరింత క్లిష్టం..
వెస్టిండీస్ భారీ విజయం తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ రేసు మరింత క్లిష్టంగా మారింది. భారత్ సెమీస్ చేరాలంటే నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకుంటూ తదుపరి మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాల్సిందే! దక్షిణాఫ్రికా ప్రదర్శన కూడా భారత్ అవకాశాలను ప్రభావితం చేయనుంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీ ఫైనల్స్‌కి చేరడం మరింత క్లిష్టంగా మారింది! సోమవారం ముంబైలో జరిగిన సూపర్-8 పోరులో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించడమే దీనికి కారణం. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న టీమిండియాకు, విండీస్ సాధించిన ఈ భారీ విజయం నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర) పరంగా పెద్ద సవాలుగా మారింది. ఇకపై భారత్ తన తదుపరి మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.

ముంబై మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. షిమ్రాన్ హెట్మెయర్ (34 బంతుల్లో 85) మెరుపు ఇన్నింగ్స్, రోవ్‌మన్ పావెల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో 254/6 భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. చివరికి 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గుడకేష్ మోతీ 4 వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించాడు.
ఇక బుధవారం చెన్నై వేదికగా భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. అదే రోజు అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కూడా భారత భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు మార్గం కొంత సులభం అవుతుంది.
టీ20 వరల్డ్ కప్ 2026- భారత్ సెమీస్ చేరాలంటే ఉండాల్సిన సమీకరణాలు:
సమీకరణం 1: భారత్ తన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే..
జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారత్ గెలిస్తే 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా తన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గితే, భారత్ రెండో జట్టుగా సెమీస్ చేరుతుంది. అయితే, దక్షిణాఫ్రికా గనుక వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే.. అప్పుడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ ముగ్గురూ తలా 4 పాయింట్లతో సమంగా నిలుస్తారు. అప్పుడు నెట్ రన్ రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారే సెమీస్ వెళతారు.
సూపర్-8 గ్రూప్ 1లో తలొ మ్యాచ్ అనంతరం నెట్ రన్ రేట్ పరంగా జింబాబ్వే (-5.350) చివరి స్థానంలో ఉంది. టీమిండియా (-3.80) మూడో స్థానంలో ఉంది. +3.80తో సౌతాఫ్రికా రెండో స్థానంలో, +5.30తో వెస్టిండీస్ మొదటి స్థానంలో ఉన్నాయి.
సమీకరణం 2: భారత్ ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే..
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ తన సెమీస్ ఆశలు నిలుపుకోవాలంటే వెస్టిండీస్‌పై తప్పక గెలవాలి. ఒకవేళ సౌతాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి.. భారత్ మాత్రం విండీస్‌పై గెలిచి, జింబాబ్వే చేతిలో ఓడిపోతే అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ తలా 2 పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది.
ఒకవేళ దక్షిణాఫ్రికా తన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే మాత్రం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
టీ20 వరల్డ్ కప్ 2026- సూపర్-8 గ్రూప్ 1 షెడ్యూల్..
ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ (అహ్మదాబాద్)
ఫిబ్రవరి 26: భారత్ వర్సెస్ జింబాబ్వే (చెన్నై)
మార్చి 1: దక్షిణాఫ్రికా వర్సెస్ జింబాబ్వే (ఢిల్లీ)
మార్చి 1: భారత్ వర్సెస్ వెస్టిండీస్ (కోల్‌కతా)

E-Paper












