...
...
Next Story

CM Vijay : 'సీఎం' విజయ్- ఆ మూడు ఫైళ్లపై తొలి సంతకం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం!

Tamil Nadu Chief Minister Vijay : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్, తన తొలి రోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి కీలక పథకాలపై తొలి సంతకం చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

Published on: May 10, 2026, 12:14:20 IST
Advertisement

Vijay : చెన్నైలో ఆదివారం అట్టహాసంగా జరిగిన వేడుకలో 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత సీ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తన రాజకీయ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా మూడు అత్యంత కీలకమైన దస్త్రాలపై తొలి సంతకాలు చేశారు.

తొలి సంతకం.. మూడు వరాలు..

తమిళనాడు సీఎం విజయ్​.. (TN DIPR)
తమిళనాడు సీఎం విజయ్​.. (TN DIPR)

టీవీకే అధినేత విజయ్ తన మొదటి ఉత్తర్వు ద్వారా తమిళనాడు ప్రజలకు మూడు ప్రధాన వరాలను ప్రకటించారు:

ఉచిత విద్యుత్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేయాలని ఆదేశించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన: రాష్ట్రంలో డ్రగ్స్ బెడదను అరికట్టేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సంతకం చేశారు.

మహిళా రక్షణ: మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ దళంతో పాటు 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

దీనితో పాటు విద్య, ఆరోగ్యం, సాగునీరు వంటి ప్రాథమిక అంశాలపై తన పూర్తి దృష్టి ఉంటుందని.. రైతులు, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని విజయ్ హామీ ఇచ్చారు.

విజయ్ భావోద్వేగ ప్రసంగం..

ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఎన్ నెంజిల్ కుడియిరుక్కుమ్' (నా గుండెల్లో నివసించే వారలారా) అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. "ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను రాజకుటుంబం నుంచి రాలేదు. ఆకలి, పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు. ఎన్నో అవమానాలు భరించి, ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. నన్ను మీ కొడుకులా, సోదరుడిలా భావించి మీ గుండెల్లో చోటు ఇచ్చారు," అని విజయ్ భావోద్వేగానికి గురయ్యారు.

అప్పుల రాష్ట్రం.. కానీ లూటీ చేయనివ్వను:

కూటమి ప్రభుత్వంపై వస్తున్న అనుమానాలకు సమాధానమిస్తూ.. "నా ప్రభుత్వంలో నేనే ఏకైక అధికార కేంద్రం (వన్​మ్యాన్ పవర్​ సెంటర్). ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదు," అని విజయ్ కుండబద్దలు కొట్టారు. తన పనితీరును అంచనా వేయడానికి ప్రజలు కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు.

నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయంతో కూడిన సరికొత్త శకాన్ని ప్రారంభిస్తానని విజయ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ, వామపక్ష నేత మా బేబీ, ఇతర మిత్రపక్షాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా విజయ్‌కు అభినందనలు తెలుపుతూ.. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని హామీనిచ్చారు.

ఒక సామాన్య మనిషిగా వచ్చి అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన విజయ్ పాలన ఎలా ఉంటుందోనని ఇప్పుడు యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks