CM Vijay : సీఎం రోల్​లో దళపతి! తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్​ ప్రమాణం- త్రిష సమక్షంలో..

తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది! ఆ రాష్ట్ర సీఎంగా దళపతి విజయ్​ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం ఉదయం చెన్నైలో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్​లో నటి త్రిషతో పాటు అనేక మంది పాల్గొన్నారు.

Published on: May 10, 2026 10:19 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దాదాపు వారం రోజుల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. ప్రముఖ నటుడు చంద్రశేఖర్​ జోసెఫ్​ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్​లాల్​ స్టేడియంలో ఆదివారం ఉదయం అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత చేత గవర్నర్​ రాజేంద్ర ఆల్రేకర్​ ప్రమాణం చేయించారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం వేళ విజయ్​..
సీఎంగా ప్రమాణ స్వీకారం వేళ విజయ్​..

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రముఖ నటి త్రిష సైతం ఈ ఈవెంట్​లో పాల్గొన్నారు.

విజయ్​తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

విజయ్ ప్రమాణం చేస్తున్న సమయంలో.. రాజకీయ నేతలు, కార్యకర్తలు, అభిమానుల చప్పట్లు, కేరింతలతో స్టేడియం మారుమోగిపోయింది.

విజయ్​ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం!

తమిళనాడు సీఎంగా విజయ్​ ప్రమాణం చేయడం పట్ల ఆయన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈవెంట్​కు వెళ్లే ముందు వారు మీడియాతో సంభాషించారు.

“నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెంట్​లో పాల్గొంటాము. నా కుమారుడు తమిళనాడు సీఎంగా ప్రమాణం చేస్తుండటాన్ని నేను ఎంజాయ్​ చేస్తాను,” అని విజయ్​ తండ్రి ఎస్​ఏ చంద్రశేఖర్​ తెలిపారు.

“మదర్స్​ డే రోజున విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుండటం నాకు బహుమతి లాంటింది. నాకు చాలా సంతోషంగా ఉంది,” అని విజయ్​ తల్లి శోభ చంద్రశేఖర్​ అన్నారు.

అంత ఈజీగా రాలేదు!

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినప్పటికీ.. దళపతి విజయ్​ సీఎం కుర్చీ వరకు వెళ్లడం అంత సులభంగా జరగలేదు. గత సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్​ మెజారిటీ మార్కుకు (118) అడుగు దూరంలో నిలిచిపోయారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ 108 చోట్ల గెలిచింది. కాగా పోటీ చేసిన రెండు చోట్లా విజయ గెలవడంతో, ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే టీవీకే 107 స్థానాలు దక్కించుకోగలిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతును కూడగట్టేందుకు ఆయన కాస్త శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే విజయ్ గవర్నర్​ని కలవడం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పడం, ఆయన ఆ అభ్యర్థనలను రిజెక్ట్​ చేయడం వార్తల్లో నిలిచింది.

ఈ పూర్తి వ్యవహారంపై శనివారం సాయంత్రం నాటికి, ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్​, వీసీకే, సీపీఐ, సీపీఐ-ఎం, ఐయూఎంఎల్​ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న విజయ్​ అభ్యర్థనకు గవర్నర్​ గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు. దీనితో ఆదివారం ఉదయం తమిళనాడు సీఎంగా విజయ్​ ప్రమాణం చేశారు.

తమిళనాడు సీఎం విజయ్​ కేబినెట్​ ఇలా..

తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి తెరతీస్తూ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తన తొలి మంత్రివర్గాన్ని ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెన్నంటే ఉన్న నమ్మకస్తులతో పాటు పాలనా అనుభవం ఉన్న సీనియర్లు, విద్యావంతులైన వారు, కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ విజయ్ ఈ జాబితాను రూపొందించారు.

సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం:

ఈ కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజ ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అపార అనుభవం ఆయన సొంతం. అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని ప్రశ్నించి బయటకు వచ్చిన ఆయనకు విజయ్ పెద్దపీట వేశారు. కొత్త ప్రభుత్వానికి పాలనాపరమైన దిశానిర్దేశం చేసేందుకు సెంగోట్టయన్ అనుభవం ఉపయోగపడుతుందని విజయ్ భావిస్తున్నారు.

మరోవైపు, ఈ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలిగా కీర్తన నిలవనున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అతి పిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఆమె ఒకరిగా రికార్డు సృష్టించబోతున్నారు.

విజయ్ 'కోర్ టీమ్'కు ప్రాధాన్యత..

విజయ్ వ్యక్తిగత వ్యూహకర్తగా, పార్టీ అంతర్గత వర్గాల్లో కీలక నేతగా ఉన్న ఆధవ్ అర్జున (విల్లివాక్కం ఎమ్మెల్యే) కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈయన లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ అల్లుడు కావడం గమనార్హం. అలాగే టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు.

ఇతర ప్రముఖులు:

రాజకీయాల్లో మార్పు కోరుతూ విజయ్ విద్యావంతులకు పెద్దపీట వేశారు.

అరుణ్ రాజ్: ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఈ మెడికల్ డాక్టర్ తిరుచెంగోడ్ నుంచి విజయం సాధించి ఇప్పుడు మంత్రి అయ్యారు.

డాక్టర్ టీకే ప్రభు: కారైకుడి నుంచి గెలిచిన ఈ దంత వైద్యుడు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

నిర్మల్ కుమార్: మాజీ బీజేపీ నేత అయిన ఈయన మదురై రీజియన్‌లో టీవీకే బలోపేతానికి కృషి చేశారు.

పీ వెంకటరమణన్: మైలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు కేబినెట్‌లో ముఖ్యమైన బ్రాహ్మణ ముఖంగా ప్రాతినిధ్యం లభించింది.

రాజ్ మోహన్: సినిమా, టీవీ రంగాల్లో సుపరిచితుడైన ఈయన తన అనర్గళ ప్రసంగాలతో పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చారు.

మొత్తానికి విజయ్ తన తొలి కేబినెట్‌తో ఒకవైపు సామాజిక న్యాయాన్ని, మరోవైపు సమర్థవంతమైన పాలనను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More