Tata Curvv : టాటా కర్వ్‌లో సీఎన్జీ ఆప్షన్! త్వరలోనే లాంచ్- ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా?
భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన టాటా కర్వ్ కూపే ఎస్‌యూవీ ఇప్పుడు సరికొత్త రూపంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. భారీ మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో సరికొత్త సీఎన్జీ వేరియంట్‌ను లాంచ్ చేసేందుకు టాటా మోటార్స్ ముమ్మరంగా పరీక్షలు జరుపుతోంది. ఆ వివరాలు..
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. మరో సంచలనానికి తెరలేపనుంది. విభిన్నమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో అటు పెట్రోల్, ఇటు డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లలో అందుబాటులో ఉన్న ‘టాటా కర్వ్’.. త్వరలోనే సరికొత్త సీఎన్జీ అవతారంలో దర్శనమివ్వనుంది. ఇప్పటికే మార్కెట్లో విక్రయాలు సాగుతున్నప్పటికీ, ఈ కూపే స్టైల్ ఎస్‌యూవీకి సంబంధించిన ఒక సీక్రెట్ టెస్ట్ మోడల్ భారతీయ రోడ్లపై పరీక్షలు జరుపుతూ కెమెరా కంటికి చిక్కింది. దీన్ని బట్టి చూస్తే కర్వ్ లైనప్‌లో సరికొత్త పవర్‌ట్రెయిన్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోందని స్పష్టమవుతోంది.

కంపెనీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, టెస్టింగ్ దశలో ఉన్న ఈ వాహనం సీఎన్జీ వెర్షన్ మాత్రమేనని ఆటోమొబైల్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
పెద్ద కార్లలోనూ సీఎన్జీ వ్యూహం!
నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండే పెద్ద వాహనాల్లోనూ సీఎన్జీ పవర్‌ట్రెయిన్‌లను ప్రవేశపెట్టాలని టాటా మోటార్స్ ఇదివరకే ఒక ప్రణాళికను ప్రకటించింది. ఈ వ్యూహానికి సరిగ్గా సరిపోయే మోడళ్లలో టాటా కర్వ్ ముందు వరుసలో నిలుస్తుంది.
ఒకవేళ ఈ మోడల్ మార్కెట్లోకి వస్తే, టాటాకు చెందిన పేటెంటెడ్ 'డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ' సాంకేతికతతోనే రానుంది. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా డిక్కీ (బూట్ స్పేస్) లోపల కింది భాగంలో రెండు చిన్న సిఎన్‌జీ సిలిండర్లను అమరుస్తారు. దీనివల్ల కారులో ప్రయాణించే వారికి లగేజీ పెట్టుకోవడానికి తగినంత స్థలం దొరకడమే కాకుండా, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే స్పేర్ వీల్ (స్టెప్నీ) ఉంచడానికి కూడా వీలుంటుంది. ఇప్పటికే మార్కెట్లో భారీ విజయాన్ని అందుకున్న టాటా నెక్సాన్ సీఎన్జీలోనూ ఇదే టెక్నాలజీని వాడారు.
మధ్యతరగతికి చౌకైన ప్రత్యామ్నాయం!
రోజురోజుకూ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీ కార్లు ఒక వరం లాంటివి. ఫ్యాక్టరీ నుంచే వచ్చే సీఎన్జీ ఆప్షన్ కనుక అందుబాటులోకి వస్తే, తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో కారు నడపాలనుకునే బడ్జెట్ ప్రియులను ఈ కర్వ్ మరింతగా ఆకర్షిస్తుంది.
మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇది నేరుగా మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీ, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్జీ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మాస్టర్ ప్లాన్!
టాటా కర్వ్ లాంచ్ అయిన కొత్తలో కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభించినప్పటికీ, ఇటీవలి కాలం దీని అమ్మకాల వేగం కాస్త మందగించింది. గత 12 నెలల కాలంలో టాటా మోటార్స్ మొత్తం 18,763 కర్వ్ యూనిట్లను విక్రయించగా, నెలకు సగటున 1,560 యూనిట్ల చొప్పున అమ్ముడవుతూ వచ్చాయి. జూన్ 2026 నాటికి ఈ ఎస్‌యూవీ 1,753 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, మే నెలతో పోలిస్తే కాస్త మెరుగుపడినప్పటికీ, లాంచ్ అయిన మొదటి కొన్ని నెలల్లో వచ్చిన నంబర్లతో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి.
అందుకే, మార్కెట్లో మరింత ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కర్వ్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి సీఎన్జీ వెర్షన్ లాంచ్ చేయడం టాటాకు చాలా అవసరం
ఫ్లెక్స్-ఫ్యూయల్ రేసులోనూ కర్వ్?
ప్రస్తుతానికి సీఎన్జీ వెర్షన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ ఇందులో 'ఫ్లెక్స్-ఫ్యూయల్' టెక్నాలజీని కూడా పరీక్షిస్తోందని సమాచారం. దేశంలో ఇథనాల్ బ్లెండెడ్ ఇంధన వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా టాటా ఈ అడుగు వేసే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ ఇప్పటివరకు ప్యాసింజర్ వెహికల్ విభాగంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ మార్కెట్లోకి ప్రవేశించలేదు. ఒకవేళ ఈ ప్రయోగం కనుక సఫలమైతే, భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో వచ్చే మొదటి టాటా కారుగా కర్వ్ నిలిచే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


