Tata Kuno EV : 450 కి.మీ రేంజ్‌తో టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు! ఎంజీ విండ్సర్ ఈవీకి పోటీగా ‘కూనో’
భారత ఈవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా మోటార్స్ మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలోకి సరికొత్త మోడల్‌తో అడుగుపెట్టబోతోంది. ‘కూనో’ కోడ్‌నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ 4.3 మీటర్ల కారు ఎంజీ విండ్సర్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తిరుగులేని చక్రవర్తిగా ఏలుతున్న టాటా మోటార్స్ మరో సంచలనానికి సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఐసీఈ (ఇంధన), ఎలక్ట్రిక్ కార్లలో మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు లభిస్తున్న విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఒక సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చేందుకు తుది కసరత్తు ప్రారంభించింది.

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి అంతర్గతంగా 'కూనో' అని కోడ్‌నేమ్ కేటాయించారు. ఇది మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం కస్టమర్ల నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఎంజీ విండ్సర్ ఈవీకి నేరుగా పోటీని ఇవ్వనుంది.
'హారియర్' రాకముందు నుంచే టాటా నుంచి ఒక సరైన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ వస్తుందనే వార్తలు వినిపించేవి. ఇక హారియర్ లాంచ్ అనంతరం సంస్థ ఈ మోడల్‌పై పనిచేస్తున్న సమాచారం.
నెక్సాన్, సియెర్రాల మధ్యలో కొత్త రైడర్..
సుమారు 4.3 మీటర్ల పొడవు ఉండే ఈ కొత్త 'కూనో' ఎస్‌యూవీని టాటా మోటార్స్ తమ రాబోయే నెక్ట్స్-జనరేషన్ ‘నెక్సాన్ ఈవీ’, 'సియెర్రా ఈవీ' మోడళ్ల మధ్య ఖాళీని భర్తీ చేయడానికి డిజైన్ చేస్తోంది.
గుజరాత్‌లోని సానంద్ ప్లాంట్‌లో ఈ మోడల్ తయారీ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం దాదాపు 80,000 నుంచి 1 లక్ష యూనిట్లుగా ఉంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి తమ వద్ద ఉన్న ఈవీ మోడళ్ల సంఖ్యను 6 నుంచి 10కి పెంచాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌లో భాగంగానే ఈ 'కూనో' ఎస్‌యూవీని 2027-28 నాటికి షోరూమ్‌లకు తీసుకురావడానికి ప్రణాళికలు వేస్తోంది.
టాటా మోటార్స్ తమ కొత్త ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన అధునాతన Acti.ev ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే కూనో ఎస్‌యూవీ రూపుదిద్దుకోనుంది.
ఈ ప్లాట్‌ఫారమ్ అత్యంత సరళమైనది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ (ఎఫ్‌డబ్ల్యూడీ), రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ), ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వంటి విభిన్న కాన్ఫిగరేషన్లకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, ఈ ఆర్కిటెక్చర్‌లో బ్యాటరీ ప్యాక్‌ను కారు అడుగుభాగంలో సమర్థవంతంగా అమర్చడం వల్ల కారు లోపల క్యాబిన్ స్పేస్ చాలా ధారాళంగా లభిస్తుంది. 4.3 మీటర్ల పొడవుండే ఈ మోడల్‌లో విండ్సర్ ఈవీకి సరిసమానమైన సౌకర్యం అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
450 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
ప్రస్తుతం టాటా వద్ద ఉన్న ‘కర్వ్ ఈవీ’లో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 167 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ ఉండి 502 కిమీ రేంజ్ ఇస్తోంది. మరోవైపు రాబోయే 'సియెర్రా ఈవీ'లో 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లతో సింగిల్, డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్లు ఉండనున్నాయి.
కూనో ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇందులో ఇచ్చే హై-స్పెసిఫికేషన్ వేరియంట్లు సింగిల్ ఛార్జింగ్‌పై కనీసం 450 కిలోమీటర్లకు పైగా ప్రామాణిక రేంజ్‌ను అందిస్తాయని భావిస్తున్నారు.
లగ్జరీ ఫీచర్లు, సెక్యూరిటీ..
క్యాబిన్ విషయానికి వస్తే, కస్టమర్లను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీతో టాటా దీనిని నింపేస్తోంది:
- పెద్ద పరిమాణంలో ఉండే టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- లెవెల్-2 అడాస్ డ్రైవర్ అసిస్టెన్స్ సెక్యూరిటీ ఫీచర్లు
- పానోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈవీ కార్ల వాడకం వేగంగా పెరుగుతుండటంతో, సరసమైన ధరలో ప్రీమియం రేంజ్, స్పేస్ ఇచ్చే ఈ టాటా కూనో మార్కెట్లో మరో విప్లవం సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


