Tata EV Discounts: ఈవీలపై టాటా మోటార్స్ బంపర్ ఆఫర్- ఏకంగా రూ. 3.35లక్షల వరకు తగ్గింపు!

Discounts on Tata cars : టాటా మోటార్స్ జూన్ 2026లో తన ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ మోడళ్లపై గ్రీన్ బోనస్, ఎక్స్​ఛేంజ్ ఆఫర్లతో కలిపి గరిష్టంగా రూ.3.35 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.

Published on: Jun 6, 2026, 08:14:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tata Nexon EV discounts : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్‌ను శాసిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూన్ 2026 నెలకు గాను తన ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిపై ఏకంగా రూ.3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది! కస్టమర్లు ఎంచుకునే మోడల్‌ను బట్టి గ్రీన్ బోనస్, ఎక్స్​ఛేంజ్ ఆఫర్లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ బోనస్‌లతో పాటు అదనపు ఇన్సెంటివ్‌లను కూడా అందుకోవచ్చు. కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ‘టాటా కర్వ్ ఈవీ’కి చెందిన కొన్ని వేరియంట్లపై అత్యధికంగా డిస్కౌంట్లు లభిస్తుండగా.. పంచ్ ఈవీ, తియాగో ఈవీ పాత వెర్షన్లపై కూడా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ..
టాటా నెక్సాన్ ఈవీ..

ఈ నేపథ్యంలో ఈ జూన్ 2026లో టాటా ఈవీలపై లభిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

టాటా కర్వ్ ఈవీపై ఆఫర్లు..

ఈ జూన్ నెలలో టాటా కార్లపై లభిస్తున్న ఆఫర్లలో అత్యధిక లాభం కర్వ్ ఈవీపైనే ఉంది! దీనికి చెందిన కొన్ని నాన్-ఎక్స్ వేరియంట్లపై కస్టమర్లు గరిష్టంగా రూ.3.35 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో రూ.3 లక్షల గ్రీన్ బోనస్, రూ.30,000 ఎక్స్​ఛేంజ్ బోనస్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ కలిసి ఉన్నాయి. అలాగే కర్వ్ ఈవీ క్రియేటివ్ వేరియంట్లపై రూ.2.85 లక్షల వరకు ఆఫర్లు ఉండగా.. కర్వ్ ఈవీ ఎక్స్ వేరియంట్లపై ఎక్స్​ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో మొత్తం రూ.65,000 వరకు లబ్ధి పొందవచ్చు.

అద్భుతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన డ్రైవింగ్ రేంజ్, అధునాతన ఫీచర్ల జాబితా ఈ కర్వ్ ఈవీకి ప్రధాన బలాలు. ఈ విభాగంలో ఇది మంచి వాల్యూ ఫర్ మనీ ఆఫర్‌గా నిలుస్తుంది. అయితే, ఎక్కువ ఎత్తు ఉన్న ప్రయాణికులకు వెనుక సీటు కంఫర్ట్ కాస్త తక్కువగా ఉండటం, కొన్ని ఎర్గోనామిక్ సమస్యలు దీని లోపాలుగా చెప్పవచ్చు.

టాటా హారియర్ ఈవీపై ఆఫర్లు..

హారియర్ ఈవీకి చెందిన అన్ని వేరియంట్లపై టాటా మోటార్స్ రూ.2.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందులో రూ.50,000 ఎక్స్​ఛేంజ్ బోనస్ లేదా రూ.75,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.1 లక్ష లాయల్టీ బోనస్, మరో రూ.1 లక్ష అదనపు ప్రయోజనం కలిసి ఉన్నాయి. హారియర్ ఈవీ దాని అద్భుతమైన రైడింగ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. కాకపోతే దీని బ్రేక్ ఫీల్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సి ఉంది. అలాగే సాఫ్ట్‌వేర్‌లో ఉన్న కొన్ని చిన్నపాటి లోపాలను కంపెనీ ఇంకా సరిచేయాల్సి ఉంది.

టాటా పంచ్ ఈవీపై ఆఫర్లు..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పంచ్ ఈవీ పాత వెర్షన్లపై రూ.95,000 నుంచి రూ.1.45 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి. ఇందులో లాంగ్ రేంజ్ (ఎల్​ఆర్) వేరియంట్లపై గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు ఆఫర్లు ఉండగా, మీడియం రేంజ్ (ఎంఆర్) వేరియంట్లు రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలతో లభిస్తున్నాయి. ఇక ఎంఆర్ స్మార్ట్ బేస్ వేరియంట్‌పై డిస్కౌంట్ పరిమితిని రూ.95,000 గా నిర్ణయించారు. పంచ్ ఈవీ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు మంచి రైడ్ కంఫర్ట్, ఎన్నో అదిరిపోయే ఫీచర్లను అందిస్తుంది. అయితే, దీని వెనుక సీటు కొంచెం ఇరుకుగా ఉంటుంది, డ్రైవ్ కంట్రోలర్ ఆపరేట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో స్పేర్ టైర్ రాదు.

టాటా టియాగో ఈవీపై ఆఫర్లు..

టాటా ఫ్యామిలీలో బడ్జెట్ ఈవీగా పేరు తెచ్చుకున్న టియాగో ఈవీ పాత మోడళ్లపై రూ.65,000 నుంచి రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. లాంగ్ రేంజ్ ఎక్స్‌టి వేరియంట్‌పై అత్యధికంగా రూ.1.45 లక్షల ఆఫర్ ఉంది, ఇందులో రూ.50,000 అదనపు బెనిఫిట్ కూడా కలిసి ఉంది. ఇతర ఎల్‌ఆర్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు, అలాగే మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.65,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. టియాగో ఈవీ తక్కువ ధరలో మంచి వాల్యూ ఫర్ మనీ, ఇంజిన్ రిఫైన్‌మెంట్, అద్భుతమైన రైడ్ కంఫర్ట్‌ను అందిస్తుంది. అయితే, ఈవీల నుంచి ఆశించే తక్షణ వేగంఇందులో కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు డ్రైవ్ సెలెక్టర్ స్పందించడానికి సమయం తీసుకుంటుంది.

టాటా నెక్సాన్ ఈవీపై ఆఫర్లు..

టాటా బెస్ట్ సెల్లింగ్ మోడల్ నెక్సాన్ ఈవీకి చెందిన అన్ని వేరియంట్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.15,000 గ్రీన్ బోనస్, రూ.25,000 ఎక్స్​ఛేంజ్ బెనిఫిట్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే ఎక్స్​ఛేంజ్, స్క్రాపేజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే కస్టమర్లకు వర్తిస్తుంది. నెక్సాన్ ఈవీ లగ్జరీ ఇంటీరియర్, సుదీర్ఘమైన ఫీచర్ల జాబితాతో మార్కెట్లో దూసుకుపోతోంది. కాకపోతే కొన్ని చోట్ల ఫిట్ అండ్ ఫినిషింగ్ క్వాలిటీ ఇంకాస్త మెరుగ్గా ఉండవచ్చని, ఈ విభాగంలోని ఇతర కార్లతో పోలిస్తే దీని డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ కొంచెం తక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ డిస్కౌంట్లు అనేవి నగరాల ఆధారంగా మారుతుంటాయి. అలాగే స్టాక్ లభ్యతను బట్టి ఆఫర్లు వర్తిస్తాయి. కాబట్టి మీ సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సంప్రదించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More