Tata Safari EV : టాటా సఫారీ ఈవీ వచ్చేస్తోంది- 500 కి.మీ రేంజ్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో!
భారత ఈవీ మార్కెట్‌లో సరికొత్త సంచలనం సృష్టించేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. పెద్ద కుటుంబాల కోసం 7-సీటర్ సామర్థ్యం, 500 కిలోమీటర్ల రియల్-వరల్డ్ రేంజ్, ఆల్-వీల్ డ్రైవ్ సపోర్ట్‌తో రాబోతున్న 'టాటా సఫారీ ఈవీ' విశేషాలు ఇక్కడ చూడండి..
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న టాటా మోటార్స్ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమైంది! నెక్సాన్, పంచ్, కర్వ్ వంటి మోడళ్లతో ఇప్పటికే ఈవీ విభాగంలో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న కంపెనీ.. ఇప్పుడు పెద్ద కుటుంబాల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు త్రీ-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘టాటా సఫారీ ఈవీ’ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇటీవల ఇంధన ధరల భారం పెరగడంతో చాలామంది ప్రీమియం ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పెద్ద కుటుంబాలకు తగిన 6 లేదా 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ లోటును పూడుస్తూ సఫారీ ఈవీ ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది.
ఆల్-వీల్ డ్రైవ్ సపోర్ట్.. శక్తివంతమైన పర్ఫార్మెన్స్
హారియర్ ఈవీలో ఉపయోగించిన అధునాతన 'acti.ev+' ప్లాట్‌ఫామ్ ఆధారంగానే ఈ సరికొత్త సఫారీ ఈవీని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో రెండు రకాల డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లను అందుబాటులోకి తెస్తున్నారు. సాధారణ నగర ప్రయాణాల కోసం సింగిల్-మోటార్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ (ఎఫ్‌డబ్ల్యూడీ) వేరియంట్ లభిస్తుండగా, ఆఫ్‌రోడింగ్- మెరుగైన ట్రాక్షన్ కోరుకునే వారి కోసం డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్‌ను అందిస్తున్నారు. నాలుగు చక్రాలకు సమానంగా పవర్ అందించడం వల్ల ఎలాంటి కఠినమైన రోడ్లపైనైనా ఈ కారు సునాయాసంగా దూసుకుపోతుంది.
సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీ రేంజ్..
దీర్ఘకాలిక ప్రయాణాలు చేసే వారికి ఛార్జింగ్ ఆందోళన లేకుండా టాటా మోటార్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించనున్నారు. పెద్దదైన 75kWh బ్యాటరీ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే రియల్ వరల్డ్ రేంజ్ దాదాపు 500 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా.
హైటెక్ డ్యాష్‌బోర్డ్.. ఏకంగా 3 డిజిటల్ స్క్రీన్లు!
క్యాబిన్ ఫీచర్ల విషయానికి వస్తే సఫారీ ఈవీ విలాసవంతమైన ప్రీమియం కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. డ్యాష్‌బోర్డ్‌పై ఏకంగా మూడు డిజిటల్ స్క్రీన్లను అమర్చడం దీని ప్రత్యేకత.
- 12.3-ఇంచుల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్
- 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే క్లస్టర్
- ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో 12.3-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్
దీనితో పాటు ప్రయాణికుల రక్షణ కోసం ఈ టాటా సఫారీ ఈవీలో లెవెల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్లు, వెెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రెండవ వరుసలో కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా వెంటిలేషన్ ఫెసిలిటీ ఉన్న కెప్టెన్ సీట్లను అందిస్తున్నారు.
ఇతర వాహనాలకు ఛార్జింగ్ ఇచ్చే వినూత్న ఫీచర్!
సాంకేతికతలో మరో అడుగు ముందుకేసి వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇందులో చేర్చారు. వీ2ఎల్ ద్వారా క్యాంపింగ్ లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు కార్ బ్యాటరీ నుంచే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడవచ్చు. టాటా సఫారీ ఈవీలోని వీ2వీ ద్వారా అత్యవసర సమయంలో మరొక ఎలక్ట్రిక్ కారుకు ఈ కారు నుంచే విద్యుత్‌ను బదిలీ చేయవచ్చు. అంతేకాకుండా కాలు కదిపితే తెరుచుకునే 'జెస్టర్ కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్' వంటి అధునాతన సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
'టాటా సఫారీ ఈవీ- లాంచ్, ధర..
ఈ ఏడాదినాటికి (2026 అక్టోబర్ - నవంబర్ పండుగల సీజన్‌లో) సఫారీ ఈవీని భారత మార్కెట్లోకి తెచ్చేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. వేరియంట్, బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 22 లక్షల నుంచి గరిష్టంగా రూ. 32 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.
ఈ టాటా సఫారీ మరిన్ని వివరాలు లాంచ్ టైమ్ దగ్గరపడే కొద్ది తెలుస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


