...
...
Next Story

Tata Sierra dark : ఇక ‘డార్క్​’గా టాటా సియెర్రా! ఎస్​యూవీలో కొత్త ఎడిషన్ లాంచ్- ధర ఎంతంటే..

టాటా మోటార్స్ తన ప్రాచుర్యం పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'సియెర్రా'లో సరికొత్త 'డార్క్ ఎడిషన్'ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన బ్లాక్-పర్పుల్ థీమ్, వినూత్న ఫీచర్లతో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర వివరాలు, వేరియంట్ల విశేషాలు ఇవే!

Published on: Sep 21, 2026, 16:21:02 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా సరికొత్త ‘టాటా సియెర్రా డార్క్’ ఎడిషన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. భారతీయ వాహన ప్రియుల్లో 'డార్క్ ఎడిషన్' కార్లకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఈ ప్రత్యేక మోడల్‌ను రూపొందించింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 13.99 లక్షలుగా నిర్ణయించగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 20.59 లక్షల వరకు ఉంది.

టాటా సియెర్రా డార్క్..
టాటా సియెర్రా డార్క్..

ఈ నేపథ్యలో ఈ టాటా సియెర్రా డార్క్​ ఎడిషన్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా డార్క్​ ఎడిషన్- ఎక్స్‌టీరియర్..

బాహ్య రూపం విషయానికి వస్తే ‘ఫ్రీజియన్ బ్లాక్’ కలర్ షేడ్ కారుకు అత్యంత విలాసవంతమైన లుక్‌ను ఇస్తుంది. ఫ్రంట్, రియర్ బంపర్లపై సాటిన్ మిడ్‌నైట్ బ్లాక్ స్కిడ్ ప్లేట్లను అమర్చారు. జెట్ పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

సాధారణ లోగోల స్థానంలో డార్క్ క్రోమ్, పియానో బ్లాక్ కలయికలో టాటా లోగోలను, సియెర్రా బ్యాడ్జింగ్‌ను తీర్చిదిద్దారు. ఫ్రంట్ డోర్లు, టెయిల్‌గేట్‌పై ప్రత్యేకంగా 'డార్క్' ఐడెంటిఫైయర్‌ బ్యాడ్జ్‌లను జోడించడం వల్ల రహదారిపై ఈ కారు ఎంతో రాజసంగా కనిపిస్తుంది.

టాటా సియెర్రా డార్క్​ ఎడిషన్- క్యాబిన్..

టాటా సియెర్రా డార్క్​ ఎడిషన్ క్యాబిన్ లోపల ‘వయొలెట్ ఎక్లిప్స్’ అనే వినూత్న థీమ్‌ను పరిచయం చేశారు. ఆల్-బ్లాక్ బేస్ క్యాబిన్‌కు పర్పుల్ రంగు స్టిచింగ్, సాటిన్ క్రోమ్ స్పర్శ కలసి రాయల్ లుక్ ఇస్తాయి. సీట్లు, డ్యాష్‌బోర్డ్, ఆర్మ్‌రెస్ట్‌లపై గ్రానైట్ బ్లాక్ ఆర్ట్ లెదర్ ఉపయోగిస్తూనే, పర్పుల్ యాక్సెంట్స్‌తో స్పోర్టీ డిజైన్ ఇచ్చారు.

కేవలం టాప్ వేరియంట్‌కే పరిమితం చేయకుండా, విభిన్న బడ్జెట్ ఉన్న కస్టమర్ల కోసం అనేక వేరియంట్లలో ఈ ఎస్​యూవీకి చెందిన డార్క్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ‘ప్యూర్ ఎల్’ నుంచి ప్రారంభమై ప్యూర్ ఎల్(ఓ), ప్యూర్+ ఎల్, అడ్వెంచర్+ ఎల్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ మోడళ్లలో ఇది లభిస్తుంది (స్మార్ట్+ ఎల్ వేరియంట్ లేదు).

ప్యూర్ ఎల్ మోడల్‌లోనే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 8-స్పీకర్ల ఆడియో, రేర్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఇచ్చారు. ఇక టాప్ మోడల్ అయిన అకాంప్లిష్డ్+ వేరియంట్‌లో 'హొరైజన్ వ్యూ' ట్రిపుల్ స్క్రీన్లు, లెవెల్ 2+ అడాస్ భద్రతా ఫీచర్లు, 12-స్పీకర్ల జేబీఎల్ డాల్బీ ఆట్మోస్ ఆడియో సిస్టమ్ అందుబాటులో ఉంటాయి.

టాటా సియెర్రా డార్క్​ ఎడిషన్- ఇంజిన్..

ఈ టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ కేవలం డిజైన్ మార్పులకే పరిమితమైంది, మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్లుగా 1.5-లీటర్ రివోట్రాన్ పెట్రోల్, 1.5-లీటర్ క్రయోజెట్ డీజిల్, 1.5-లీటర్ హైపరియాన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో దీనిని ఎంచుకోవచ్చు.

ఇంజిన్‌ను బట్టి 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీఏ), 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన భద్రత, తిరుగులేని లుక్ కోరుకునే ఎస్‌యూవీ ప్రియులకు ఈ కొత్త టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ మంచి ఎంపిక కానుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks