Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీపై బిగ్ అప్డేట్! డెలివరీ షురూ..
Tata Sierra EV delivery : టాటా మోటార్స్ తన ప్రతిష్టాత్మక 'సియెర్రా ఈవీ' డెలివరీలను దేశవ్యాప్తంగా, శరవేగంగా ప్రారంభించింది. ధరలు ప్రకటించి, బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దివారాల్లోనే అహ్మదాబాద్‌లో మొదటి కారు కస్టమర్‌కు చేరింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సరికొత్త రూపునిచ్చిన టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఐకానిక్ ‘సియెర్రా ఈవీ’పై బిగ్ అప్డేట్! ఈ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధరలను అధికారికంగా ప్రకటించి, బుకింగ్స్ ప్రారంభించిన కొద్దివారాల వ్యవధిలోనే కస్టమర్లకు వాహనాలను చేరవేసే ప్రక్రియను కంపెనీ మొదలుపెట్టింది. దేశంలోనే మొదటి సియెర్రా ఈవీ డెలివరీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరిగింది. కారును డెలివరీ తీసుకున్న ఓ యజమాని, తన సరికొత్త ఎస్‌యూవీతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అహ్మదాబాద్ నగరంలో రోడెక్కిన మొట్టమొదటి సియెర్రా ఈవీ ఇదే కావడంతో ఈ డెలివరీ టాటా మోటార్స్ రోలౌట్ ప్రయాణంలో అత్యంత కీలకంగా మారింది. డెలివరీ అయిన ఈ కారు ‘నైనిటాల్ నాక్టర్న్ బ్లూ’ ఆకర్షణీయమైన రంగులో మెరిసిపోతోంది. నివేదికల ప్రకారం, ఇది భారీ బ్యాటరీ ప్యాక్, ఆల్-వీల్ డ్రైవ్ సామర్థ్యాలు కలిగిన టాప్-ఎండ్ ‘ఎంపవర్డ్ ఏడబ్ల్యూడీ’ వేరియంట్ అని తెలుస్తోంది.
లుక్‌లో అదరహో.. ఐసీఈ మోడల్‌కు ఏమాత్రం తగ్గకుండా..!
సియెర్రా ఈవీ ఎక్స్టీరియర్ డిజైన్ దాదాపుగా రాబోయే పెట్రోల్, డీజిల్ వెర్షన్‌ల తరహాలోనే ఉన్నప్పటికీ, ఇది ఎలక్ట్రిక్ కారు అని స్పష్టంగా తెలియజేయడానికి టాటా కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేసింది. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, స్వల్పంగా మార్చిన ఫేసియాతో ఇది సరికొత్త లుక్‌ను సంతరించుకుంది. మిగిలిన డిజైన్ పాత సియెర్రా జ్ఞాపకాలను గుర్తుచేసేలా వినూత్నంగా ఉంది.
ఇందులో నైట్ సేబర్ బై-ఎల్‌ఈడీ బూస్టర్ హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ ఫ్రంట్ బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, కారు వెడల్పు పొడవునా కనెక్ట్ అయ్యే ఎల్‌ఈడీ లైట్ బార్, డ్యూయల్-ఫంక్షన్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉన్నాయి. వీటికి తోడు గాలి ఒత్తిడిని తట్టుకునే ఏరో ఇన్సర్ట్‌లతో కూడిన 19-ఇంచుల అలాయ్ వీల్స్, బాడీలో కలిసిపోయే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్లిమ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, రీ-డిజైన్ చేసిన రియర్ బంపర్ కారుకు తిరుగులేని స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి.
లగ్జరీ క్యాబిన్.. అదిరిపోయే టెక్నాలజీ!
కారు లోపలి భాగంలో అడుగుపెడితే టాటా మోటార్స్ సిగ్నేచర్ స్టైల్ అయిన ‘హోరైజన్ వ్యూ ట్రిపుల్ స్క్రీన్’ లేఔట్ కస్టమర్లను కట్టిపడేస్తుంది. ఇందులో ఒక స్క్రీన్ డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్) అందిస్తుండగా, మిగిలిన రెండు స్క్రీన్‌లు వినోదం (ఇన్ఫోటైన్‌మెంట్) కోసం ఉపయోగపడతాయి. ఈ సిస్టమ్ ప్రత్యేకమైన 'Arcade.ev' సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగపడే ప్రత్యేకమైన రూట్ ప్లానింగ్‌తో పాటు 30 కి పైగా యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.
క్యాబిన్‌ను లైట్ కలర్ థీమ్‌తో లేదరెట్ అప్హోలిస్ట్రీతో ఎంతో లగ్జరీగా తీర్చిదిద్దారు.
"ఈ విభాగంలోనే అత్యంత పెద్దదైన పనోరమిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసే 12-స్పీకర్ల జేబీఎల్ బ్లాక్ సౌండ్ సిస్టమ్ సియెర్రా ఈవీ ప్రత్యేకతలు," అని కంపెనీ వర్గాలు తెలిపాయి.
దీనితో పాటు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇన్‌బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, థై సపోర్ట్ అడ్జస్ట్‌మెంట్, హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి. భద్రత, పార్కింగ్ సులువు చేయడం కోసం 540-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా (ట్రాన్స్‌పరెంట్ మోడ్) ఇందులో అందించారు.
రేంజ్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్..
టాటా సియెర్రా ఈవీని వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చింది: 63 kWh, 75 kWh. ఇందులో పెద్దదైన 75 kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై ఎంఐడీసీ సైకిల్ ప్రకారం గరిష్టంగా 665 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, వాస్తవ ప్రపంచంలో (సీ75 రేటింగ్) 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇక చిన్నదైన 63 kWh బ్యాటరీ ప్యాక్ ఎంఐడీసీ ప్రకారం 565 కిలోమీటర్లు, నిజమైన రోడ్లపై దాదాపు 440 నుంచి 460 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఇంజిన్ పవర్ విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి పవర్ అవుట్‌పుట్ మారుతుంది. 63 kWh వేరియంట్ 238 పీఎస్ పవర్‌ను జనరేట్ చేయగా, రియర్-వీల్ డ్రైవ్ కలిగిన 75 kWh మోడల్ 209 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇప్పుడు అహ్మదాబాద్‌లో డెలివరీ అయిన ఆల్-వీల్ డ్రైవ్ టాప్ వేరియంట్ ఏకంగా 345 bhp పవర్‌ని, 504 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తూ రోడ్లపై రాకెట్‌లా దూసుకెళ్తుంది.
ప్రయాణాన్ని మరింత సుఖమయం చేయడానికి ఇందులో బూస్ట్ మోడ్‌తో పాటు ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్‌తో కూడిన 5-లింక్ రియర్ సస్పెన్షన్ గల 'అల్ట్రా గ్లైడ్ సస్పెన్షన్'ను వాడారు. ఏడబ్ల్యూడీ వెర్షన్‌లో నార్మల్, గ్రాస్/స్నో, మడ్ రట్స్/గ్రావెల్, శాండ్, రాక్ క్రాక్, కస్టమ్ అనే 6 రకాల టెర్రైన్ మోడ్‌లు ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో టాటా సియెర్రా ఈవీ ప్రారంభ ధర రూ. 18.79 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 26.48 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


