E20 fuel damage : ఈ20 పెట్రోల్​పై కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా 45శాతం మంది! సర్వేలో షాకింగ్ విషయాలు..

భారతదేశంలో ఈ-20 ఇంధన వినియోగం పెరిగిన తర్వాత కార్లలో ఇంజన్ సమస్యలు, మైలేజ్ పతనంపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటే 45 శాతం మంది లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది.

Published on: Jul 18, 2026, 09:08:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన దిగుమతులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధన విధానం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీస్తోంది. ఈ-20 పెట్రోల్ వాడకం వల్ల తమ కార్ల ఇంజన్లు దెబ్బతింటున్నాయని, మైలేజీ ఘోరంగా పడిపోతోందని దేశవ్యాప్తంగా వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఒకవేళ ఈ ఇంధనం కారణంగా కారు ఇంజన్ పూర్తిగా పాడైపోతే, నష్టపరిహారం కోసం వాహన తయారీ సంస్థలపై లేదా చమురు కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మెజారిటీ వాహనదారులు సిద్ధమవుతున్నారు. ఈ విషయాలను ప్రముఖ కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘లోకల్ సర్కిల్స్’ విడుదల చేసిన తాజా సర్వే నివేదిక స్పష్టం చేసింది.

'ఈ20 పెట్రోల్​తో కారు పాడైతే.. కోర్టుకు వెళతాము..'
'ఈ20 పెట్రోల్​తో కారు పాడైతే.. కోర్టుకు వెళతాము..'

కోర్టు మెట్లెక్కేందుకు సగం మంది సిద్ధం!

దేశంలోని 316 జిల్లాల్లోని 22,000 కంటే ఎక్కువ మంది పెట్రోల్ వాహనదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా లోకల్ సర్కిల్స్ ఈ సర్వేను రూపొందించింది. "ఈ20 పెట్రోల్ వల్ల మీ వాహనానికి భారీ నష్టం వాటిల్లిందని మీరు నమ్మితే, ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మీరు ఎంతవరకు వెళ్తారు?" అని వాహనదారులను ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి:

31 శాతం మంది తాము ఖచ్చితంగా కన్స్యూమర్ కోర్టును (వినియోగదారుల ఫోరమ్) ఆశ్రయిస్తామని చెప్పారు.

14 శాతం మంది తమకు అందుబాటులో ఉన్న అన్ని రకాల చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.

అంటే, మొత్తంగా 45 శాతం మంది వాహనదారులు లీగల్ రూట్ ఎంచుకోవడానికి మొగ్గు చూపారు.

మరోవైపు, 18 శాతం మంది వాహన తయారీ సంస్థ (మాన్యుఫ్యాక్చరర్), చమురు కంపెనీ రెండింటి నుంచి నష్టపరిహారం కోరతామని చెప్పారు. కేవలం కారు కంపెనీ నుంచే పరిహారం ఆశిస్తామని 9 శాతం మంది పేర్కొన్నారు. మిగిలిన వారిలో 14 శాతం మంది ఈ విషయాన్ని వదిలేస్తామని చెప్పగా, మరో 14 శాతం మంది ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు.

రాయ్‌పూర్ కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో వాహనదారుల్లో ధైర్యం పెరిగిందని, అందుకే వారు చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నారని ఈ సర్వే విశ్లేషించింది.

కన్స్యూమర్ కోర్టు ఏం తీర్పు ఇచ్చింది?

ఈ సర్వే ఫలితాలు వెలువడటానికి కొన్ని రోజుల ముందే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (కన్స్యూమర్ కోర్టు) ఒక సంచలన తీర్పునిచ్చింది. ఈ20 పెట్రోల్ వల్ల ఇంజన్ సమస్యలు తలెత్తాయనే కేసులో ఒక కస్టమర్‌కు అనుకూలంగా కోర్టు నిలిచింది. సదరు కస్టమర్ కొనుగోలు చేసిన మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా కారును కొత్తదానితో రీప్లేస్ చేయాలని లేదా అందుకు సంబంధించిన పూర్తి మొత్తం రూ. 20.5 లక్షలను రీఫండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీనతో పాటు మానసిక క్షోభకు గురిచేసినందుకు గాను మరో రూ. 1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని మారుతీ సుజుకీ, దాని డీలర్‌ను ఆదేశించింది. పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్ మాత్రమే ప్రధానంగా అందుబాటులో ఉన్నప్పుడు, వినియోగదారులు దానిని కొట్టించకుండా ఎలా ఉండగలరని కోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

రాయ్‌పూర్ కోర్టు కేసు నేపథ్యం ఏంటి?

రాయ్‌పూర్‌కు చెందిన ఒక గ్రాండ్ విటారా కారు యజమాని, తన కారులో ఈ20 పెట్రోల్ పోయించినప్పటి నుంచి ఇంజన్ పదేపదే ఆగిపోవడం, పికప్ తగ్గడం, మైలేజ్ పడిపోవడం వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కోర్టును ఆశ్రయించారు. అయితే, మారుతీ సుజుకీ సంస్థ కారును విక్రయించే సమయంలో అది ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని వాదించింది. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో కోర్టు కంపెనీకి భారీ జరిమానా విధించింది.

ఈ తీర్పుపై మారుతీ సుజుకీ పైకోర్టులో అప్పీల్ చేయాలని భావిస్తోంది.

పాత వాహనదారుల్లోనూ పెరుగుతున్న గుబులు..

భారతదేశంలో ఈ20 ఇంధన రోల్‌అవుట్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, పాత పెట్రోల్ వాహనాలు (2023 కంటే ముందు తయారైనవి) ఉన్నవారిలో ఆందోళన తీవ్రమవుతోంది. 2023 కంటే ముందు మోడల్ వాహనాలు కలిగిన వారిలో సుమారు 55 శాతం మంది, 2025 ప్రారంభం నుంచి తమ వాహనాల విడిభాగాలు త్వరగా అరిగిపోతున్నాయని లేదా తరచూ రిపేర్లు వస్తున్నాయని లోకల్ సర్కిల్స్ సర్వేలో వాపోయారు. అంతేకాకుండా, గతంలో నిర్వహించిన సర్వేలో 66 శాతం మంది వాహనదారులు ఈ20 పెట్రోల్ వాడటం ప్రారంభించిన తర్వాత తమ కారు మైలేజీ 10 శాతం కంటే ఎక్కువ పడిపోయిందని వెల్లడించారు.

పాలసీని సమీక్షించాలని లోకల్ సర్కిల్స్ డిమాండ్..

ఈ సర్వే ఫలితాల ఆధారంగా, భారతదేశపు ఇథనాల్ బ్లెండింగ్ రోడ్‌మ్యాప్‌ను పాలసీ మేకర్లు మరోసారి సమీక్షించాలని లోకల్ సర్కిల్స్ కోరింది. ఇంధన భద్రత, కాలుష్య నియంత్రణ లక్ష్యాలతో పాటు, వాహనాల ఇంజన్ లైఫ్, మైలేజీకి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

పెట్రోల్ బంకుల్లో కేవలం ఈ20 మాత్రమే కాకుండా, పాత వాహనదారుల సౌకర్యార్థం ఇథనాల్ లేని సాధారణ పెట్రోల్ లేదా తక్కువ ఇథనాల్ ఉండే ఈ5, ఈ10 ఇంధనాలను కూడా అందుబాటులో ఉంచాలని, తద్వారా వినియోగదారులకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More