E20 పెట్రోల్ దెబ్బ: మారుతి గ్రాండ్ విటారాను మార్చాలని కోర్టు సంచలన తీర్పు
ఇథనాల్ మిశ్రమ (E20) పెట్రోల్ వల్ల ఇంజన్ పదేపదే మొరాయించిందన్న కస్టమర్ ఫిర్యాదుపై రాయ్‌పూర్ వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధితుడికి కొత్త వాహనాన్ని అందించాలని లేదా ఆర్టీవో, ఇన్సూరెన్స్‌తో కలిపి రూ. 20.50 లక్షల పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేయాలని మారుతి సుజుకి సంస్థను ఆదేశించింది.
దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల కారు ఇంజన్ పదేపదే ఆగిపోతోందని దాఖలైన ఫిర్యాదును విచారించిన రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (అదనపు బెంచ్) కస్టమర్‌కు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

కేంద్ర ప్రభుత్వం ఇంధన స్వయంసమృద్ధి కోసం పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పెంచుతున్న నేపథ్యంలో, వాహనాల ఇంజన్ సామర్థ్యం, మైలేజీపై వస్తున్న సవాళ్లపై దేశంలో వెలువడిన మొదటి కోర్టు తీర్పుగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.
రూ. 20.50 లక్షల రీఫండ్ లేదా కొత్త కారు
రాయ్‌పూర్‌కు చెందిన డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేవతా 2023 మోడల్‌కు చెందిన 'మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జీటా ప్లస్' (Maruti Grand Vitara Strong Hybrid Zeta Plus) కారును కొనుగోలు చేశారు. అయితే, ఈ కారులో ఈ20 పెట్రోల్ పోయించిన ప్రతిసారీ ఇంజన్ మధ్యలోనే ఆగిపోవడం ప్రారంభమైంది. సమస్య పరిష్కారం కోసం ఆయన ఇంధనాన్ని మార్చడం, ట్యాంక్ క్లీన్ చేయించడం వంటివి చేయడమే కాకుండా పదేపదే సర్వీస్ సెంటర్‌కు తిరగాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇంజన్ సమస్య తగ్గలేదు.
ఈ నేపథ్యంలో కస్టమర్ కోర్టును ఆశ్రయించగా, కమిషన్ చైర్మన్ ప్రశాంత్ కుందు, సభ్యుడు డాక్టర్ ఆనంద్ వర్గీస్‌లతో కూడిన బెంచ్ 23 పేజీల సుదీర్ఘ ఆదేశాలను జారీ చేసింది. సదరు 2023 మోడల్ వాహనం ఈ20 పెట్రోల్‌కు అనుకూలంగా లేదని కోర్టు నిర్ధారించింది. వినియోగదారునికి ఈ20 ఇంధనానికి సరిపోయే కారును అందించకపోవడాన్ని తీవ్ర సేవా లోపంగా (Service Deficiency), అనుచిత వ్యాపార విధానంగా (Unfair Trade Practice) కమిషన్ పరిగణించింది.
45 రోజుల్లోగా ఆర్డర్ అమలు చేయాలి
జూలై 14, 2026న ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం, మారుతి సుజుకి సంస్థ సదరు కారును వెనక్కి తీసుకుని 45 రోజుల్లోగా అదే మోడల్‌కు చెందిన కొత్త ఈ20 కంపాటబుల్ (అనుకూలమైన) వాహనాన్ని కస్టమర్‌కు అందించాలి. ఒకవేళ కొత్త కారు ఇవ్వలేని పక్షంలో, వాహనానికి సంబంధించిన పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేయాలని స్పష్టం చేసింది.
కోర్టు నిర్దేశించిన రీఫండ్ వివరాలు:
- కారు అసలు ధర: రూ. 18.29 లక్షలు
- ఆర్టీవో (RTO) రుసుము: రూ. 1,86,850
- ఇన్సూరెన్స్ ప్రీమియం: రూ. 34,644
- మొత్తం రీఫండ్ విలువ: రూ. 20,50,494
దీనికి అదనంగా, కస్టమర్ పడిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 1 లక్ష, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 10,000 చెల్లించాలని మారుతి సుజుకి, డీలర్‌ను కోర్టు ఆదేశించింది. ఒకవేళ 45 రోజుల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయకపోతే, పరిహారం, కోర్టు ఖర్చుల మొత్తాలపై వార్షికంగా 7 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇథనాల్ ఇంధన వివాదంపై కేంద్రం వైఖరి
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగంగా ప్రోత్సహిస్తున్న తరుణంలో వాహనదారులు, నిపుణులు పాత వాహనాల అనుకూలతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై గతంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడటం ఇష్టం లేని వారు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని, అయితే దానికి కొంత అదనపు ధర చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వినియోగదారుల కోర్టు ఇచ్చిన ఈ తీర్పు కంపెనీపై బైండింగ్ (తప్పనిసరి) అయినప్పటికీ, దీనిని ఉన్నత కమిషన్లలో లేదా హైకోర్టులలో ఆర్టికల్ 226, 227 కింద రిట్ పిటిషన్ల ద్వారా సవాలు చేసే అవకాశం మారుతి సుజుకి సంస్థకు ఉంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


