Trading : ట్రేడింగ్ మోజులో రూ.38 లక్షల నష్టం.. ఐటీ ఉద్యోగి జీవితాన్ని కూల్చేసిన వ్యసనం!

స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ వ్యసనంగా మారి రూ.38 లక్షలు పోగొట్టుకున్న ఒక ఐటీ ఉద్యోగి విషాద గాథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, కుటుంబానికి దూరమై అతను అనుభవిస్తున్న క్షోభను వివరిస్తూ ఒక నెటిజన్ చేసిన పోస్ట్ ట్రేడర్లను హెచ్చరిస్తోంది.

Published on: Oct 2, 2026, 11:21:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌ల మోజు, ఒక్క రోజులోనే లక్షలు సంపాదించవచ్చనే భ్రమలు ఎంతోమంది మధ్యతరగతి జీవితాలను నాశనం చేస్తున్నాయి. నెలకు రూ.2 లక్షల వేతనం, రూ.14 లక్షల పొదుపుతో హాయిగా సాగిపోతున్న ఒక 35 ఏళ్ల ఐటీ ఇంజనీర్.. ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యామోహంలో పడి ఏకంగా రూ.38 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ట్రేడింగ్​ వ్యసనంతో భారీ నష్టం!
ట్రేడింగ్​ వ్యసనంతో భారీ నష్టం!

రూ.12,000 లాభం చూసి మొదలైన వ్యసనం!

హెమ్‌దర్పణ్ అనే ఎక్స్ యూజర్ తన స్నేహితుడి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనను ఎక్స్​లో షేర్ చేశాడు. సదరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అతని సహోద్యోగి ఒకరోజు లంచ్ సమయంలో జెరోధా యాప్ డాష్‌బోర్డ్ చూపించాడు. నిఫ్టీ ఆప్షన్లలో కేవలం 45 నిమిషాల్లో రూ.12,000 సంపాదించినట్లు కనిపించడంతో, దీర్ఘకాలిక పెట్టుబడుల కంటే ఇంట్రాడే ట్రేడింగ్ చాలా సులువని అతడు నమ్మాడు.

ప్రారంభంలో కేవలం రెండు గంటల్లో రూ.18,000 లాభం రావడంతో వచ్చిన డోపమైన్ కిక్ అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే ఐటీ ఉద్యోగం అతనికి సమయం వృథాగా అనిపించింది.

'రివేంజ్ ట్రేడింగ్' తో మునిగిన రూ.14 లక్షల పొదుపు!

అయితే మార్కెట్ రెండో నెలలోనే తన అసలు రూపాన్ని చూపించింది. స్టాప్ లాస్ నిబంధనను పాటించకపోవడంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే రూ.50,000 నష్టపోయాడు. ఆ పోగొట్టుకున్న డబ్బును వెంటనే ఎలాగైనా రాబట్టాలనే ఉద్దేశంతో ‘రివేంజ్ ట్రేడింగ్’ ప్రారంభించాడు. కుటుంబ పొదుపు ఖాతా నుంచి రూ.1 లక్ష బదిలీ చేసి రోజుకు 30 నుంచి 40 ట్రేడ్లు చేయడం మొదలుపెట్టాడు. కానీ బ్రోకరేజీ, లావాదేవీల ఛార్జీలే అతని లాభాలను మింగేశాయి. 2024లో ప్రారంభమైన ఈ వ్యసనంతో 2025 మధ్యనాటికి అతని సొంత పొదుపు రూ.14 లక్షలు పూర్తిగా ఆవిరైపోయాయి.

ఆఫీస్ బాత్‌రూమ్‌లలో లెక్కలు.. అప్పుల ఊబి!

డబ్బులన్నీ పోయినా అతని వ్యసనం ఆగలేదు. ఆఫీస్ పనివేళల్లో బాత్‌రూమ్‌లలో దాక్కుని ఓపెన్ పొజిషన్లు, మార్జిన్ కాల్స్ చూసుకోవడం అలవాటుగా మారింది. ఇంటి పునర్నిర్మాణం పేరుతో అబద్ధాలు చెప్పి మూడు వేర్వేరు బ్యాంకుల నుంచి రూ.24 లక్షల పర్సనల్ లోన్లు తీసుకున్నాడు. అవి కూడా పూర్తయ్యాక ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేశాడు. ‘ఎక్స్‌పైరీ డే’ నాడు ఒక పెద్ద ట్రెండ్ వస్తే తన అప్పులన్నీ తీరిపోతాయని భ్రమపడ్డాడు.

బజారున పడ్డ కుటుంబం.. ఏజెంట్ల బెదిరింపులు!

2025 చివరినాటికి లోన్ రికవరీ ఏజెంట్లు అతని ఇంటి తలుపు తట్టడంతో నిజాన్ని దాచడం సాధ్యపడలేదు. బిడ్డ స్కూల్ ఫీజు చెల్లించిన చెక్ బౌన్స్ కావడం, బ్యాంకుల్లో తీసుకున్న రూ.24 లక్షల అప్పు, తుడిచిపెట్టుకుపోయిన రూ.14 లక్షల పొదుపు.. మొత్తం రూ.38 లక్షల నష్టాన్ని కుటుంబ సభ్యుల ముందు ఒప్పుకోక తప్పలేదు. కొడుకు చేష్టలతో తల్లిదండ్రుల కష్టార్జితం నాశనమైంది. భర్త చేసిన నిర్వాకంతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య, బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది!

ప్రస్తుతం ఆ ఐటీ ఉద్యోగి తన కారును విక్రయించి, అప్పుల పునర్వ్యవస్థీకరణ వైపు అడుగులు వేస్తున్నాడు. "స్టాక్ మార్కెట్ చాలా నిర్దయగా ఉంటుంది. మీ అప్పులు తీర్చాలనో, మీ భావోద్వేగాలనో అది పరిగణనలోకి తీసుకోదు. ఈ వ్యసనం నుంచి బయటపడటానికి యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేసి, తక్షణమే నిపుణుల సాయం తీసుకోవడమే ఏకైక మార్గం," అని హెమ్‌దర్పణ్ హెచ్చరించారు.

ప్రస్తుతం భారతదేశంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్​ అండ్ ఓ) ట్రేడింగ్‌లో 90 శాతం మందికి పైగా రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని సెబీ అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఫైనాన్షియల్ అవగాహన, క్రమశిక్షణ లేని ట్రేడింగ్ జీవితాలను ఎలా నాశనం చేస్తుందో అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More