...
...
Next Story

Tesla flying car : సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు.. రియాలిటీ! ఫ్లయింగ్ కారును ప్రపంచానికి పరిచయం చేసిన టెస్లా

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా సంస్థ తమ నెక్ట్స్-జనరేషన్ 'రోడ్‌స్టర్' ఎలక్ట్రిక్ కారుతో సరికొత్త రికార్డు సృష్టించింది. స్పేస్‌ఎక్స్ థ్రస్టర్ సాంకేతికతతో రూపొందించిన ఈ కారు తలకిందులుగా ప్రయాణించి, గాల్లో ఎగురుతూ ల్యాండ్ అయి ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

Published on: Oct 16, 2026, 09:14:36 IST
Advertisement

కార్లు గాలిలో ఎగరడం అనేది ఇప్పటివరకు మనం సినిమాల్లోనే చూశాము. కానీ దానిని రియాలిటీ తీసుకొస్తోంది దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా! ఎలాన్ మస్క్​కు చెందిన ఈ కంపెనీ.. తమ ప్రతిష్టాత్మక ‘రోడ్‌స్టర్’ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుతో అసాధారణ ప్రయోగాన్ని నిర్వహించింది. టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్‌లోని స్పేస్‌ఎక్స్ పరిశోధనా కేంద్రంలో అక్టోబర్ 15న జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ రోడ్​స్టర్ ఈవీ గాలిలోకి ఎగిరింది!

టెస్లా ఫ్లయింగ్ కారు..
టెస్లా ఫ్లయింగ్ కారు..

టెస్లా రోడ్‌స్టర్ ఒక భారీ కర్వ్‌డ్ ర్యాంప్‌పై వేగంగా దూసుకెళ్లి, తలకిందులుగా ప్రయాణించడమే కాకుండా, కొన్ని క్షణాల పాటు గాలిలోనే విన్యాసాలు చేస్తూ సురక్షితంగా కిందకు ల్యాండ్ అయింది.

స్పేస్‌ఎక్స్ సాంకేతికత.. కోల్డ్ గ్యాస్ థ్రస్టర్లు!

ఈ చారిత్రాత్మక ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ తమ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంటూ.. "భవిష్యత్తులో నిజంగానే ఎగిరే కార్లు ఉండబోతున్నాయి," అని రాసుకొచ్చారు.

ఈ రీడిజైన్ చేసిన రోడ్‌స్టర్ కారు తయారీలో మస్క్‌కు చెందిన రోదసి పరిశోధనా సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ సాంకేతికతను జోడించారు. కారులో ప్రత్యేకంగా అమర్చిన ‘కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లు’ అధిక ఒత్తిడితో కూడిన వాయువును విడుదల చేస్తూ అవసరమైన ఫుష్​-అప్ పవర్ (థ్రస్ట్) ఉత్పత్తి చేస్తాయి. సాధారణ రహదారి కార్లతో అసాధ్యమైన వినూత్న వైమానిక విన్యాసాలు సాధ్యపడటానికి ఈ రాకెట్ పరిజ్ఞానమే ప్రధాన కారణం.

తొమ్మిదేళ్ల నిరీక్షణ.. 2028లో ఉత్పత్తి?

తాజా ప్రదర్శన అనంతరం వెలువడిన నివేదికల ప్రకారం.. ఎలాన్ మస్క్ కంపెనీ ఈ కారు ఉత్పత్తిని 2028 నాటికి ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది. అంటే వినియోగదారులకు ఇది వాణిజ్యపరంగా మార్కెట్లో లభించడానికి మరికొంత సమయం పట్టనుంది.

చట్టపరమైన అనుమతులు.. రహదారి భద్రత

ఈ ప్రదర్శన భవిష్యత్ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికినప్పటికీ, గాల్లో ఎగిరే కార్లు మన సామాన్య రహదారులపైకి రావడం ఇప్పటికిప్పుడు సాధ్యపడే అంశం కాదు! ఈ ప్రయోగం కేవలం స్పేస్‌ఎక్స్ నియంత్రిత వాతావరణంలో, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరిగింది.

బహిరంగ రహదారులపై ఇలాంటి కార్లను నడపడానికి పౌర విమానయాన సంస్థల ఆమోదం, చట్టపరమైన నిబంధనలు, ట్రాఫిక్ భద్రతా ప్రమాణాలు అత్యంత సంక్లిష్టమైనవి. అయినప్పటికీ, టెస్లా చేపట్టిన ఈ తాజా ప్రయత్నం ఎగిరే కార్ల సాంకేతికతను భవిష్యత్ రవాణాకు మరింత దగ్గరగా తీసుకెళ్లింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks