Are You Dead : అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్న యాప్ ఇది- అద్భుతమైన ఆలోచన!
ఒంటరితనం వెంటాడే వేళ, ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ లేరన్న భయం చాలా మందిలో ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికే 'Are You Dead?' (ఆర్ యూ డెడ్?) అనే యాప్ చైనాలో ట్రెండ్ అవుతోంది. దీని పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
"Are You Dead? (నువ్వు చచ్చిపోయావా?)".. ఈ మాటలు వినగానే ఎవరైనా భయపడిపోతారు, ఆశ్చర్యపోతారు. మరికొందరు అసహ్యించుకుంటారు కూడా. కానీ ఇదొక "యాప్" అంటే మీరు నమ్మగలరా? ఇంత భయంకరమైన పేరున్న యాప్‌ను ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుంటారా? అని అనిపిస్తోందా. కానీ, చైనాలో ఇప్పుడు ఈ యాప్ ఒక సంచలనం! ఆ దేశంలో ఇప్పుడు ఇదే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న నంబర్ వన్ పెయిడ్ యాప్. అసలేంటి ఈ ఆర్ యూ డెడ్ యాప్?

ఆర్ యూ డెడ్ యాప్.. అంటే ఏంటి?
ఒంటరిగా నివసించే వారిలో ఉండే ఒక అంతులేని భయాన్ని ఈ యాప్ అడ్రస్ చేస్తోంది.
మే నెలలో ప్రారంభమైన ఈ యాప్, అనతి కాలంలోనే విపరీతమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా, నగరాల్లో ఒంటరిగా బతికే యువతకు, వృద్ధులకు ఇది ఒక రక్షణ కవచంలా మారింది. ఒకవేళ తమకు అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా లేదా ప్రమాదం జరిగినా.. ఎవరూ గమనించకపోతే ఏంటి? అన్న ప్రశ్న నుంచి పుట్టిందే ఈ యాప్.
ఈ యాప్ పనితీరు చాలా సరళంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సోషల్ మీడియా ఫీడ్స్ కానీ, ట్రాకింగ్ ఫీచర్స్ కానీ ఉండవు. వినియోగదారులు ప్రతి రెండు రోజులకు ఒకసారి యాప్ ఓపెన్ చేసి, స్క్రీన్ మీద ఉన్న పెద్ద బటన్‌ను నొక్కి "నేను బాగానే ఉన్నాను" అని ధృవీకరించాలి. ఒకవేళ యూజర్ నిర్ణీత సమయంలోగా ఆ బటన్‌ను నొక్కకపోతే, యాప్ వెంటనే సదరు వ్యక్తి ముందుగా ఎంచుకున్న అత్యవసర కాంటాక్ట్ నంబర్‌కు సందేశాన్ని పంపుతుంది. తద్వారా ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నారని వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు తెలుసుకుంటారు.
ఒక నిశ్శబ్ద రక్షణ కవచం.. ఈ యాప్
2030 నాటికి చైనాలో ఒంటరిగా నివసించే వారి సంఖ్య 20 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాల మధ్య, ఈ యాప్ ఒక సామాజిక అవసరంగా మారింది.
మొదట్లో ఉచితంగా లభించిన ఈ యాప్, ఇప్పుడు 8 యువాన్లు (సుమారు రూ. 95 నుంచి రూ. 100) ధరతో లభిస్తోంది. ఇది యూజర్ల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోదు లేదా వారిని గమనిస్తున్నట్లు అనిపించదు. కేవలం ఒక విపత్కర సమయంలో ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తున్నారా లేదా అనే దానికి సమాధానంలా మాత్రమే పనిచేస్తుంది.
పేరుపై వివాదం..
అయితే, ఈ యాప్ పేరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. "చనిపోయారా?" అని అడగడం చాలా అసౌకర్యంగా ఉందని, దీనికి బదులుగా "Are You Alive?" (మీరు బతుకున్నారా?) లేదా ఏదైనా సున్నితమైన పేరు పెట్టాలని యూజర్లు కోరుతున్నారు. ఈ విమర్శలపై స్పందించిన యాప్ తయారీదారులు.. త్వరలోనే పేరు మార్చడంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.
అంతేకాదు ఈ యాప్‌లో ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి కొత్త ఫీచర్లను కూడా జోడిస్తామని తెలిపారు.
ఆన్‌లైన్ వేదికల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వరం లాంటిదని అంటుంటే.. మరికొందరు ఆధునిక సమాజంలో మనుషుల మధ్య తగ్గుతున్న సంబంధాలకు ఇది ఒక నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఫీచర్లతో ఇతర దేశాల్లో కొన్ని యాప్స్ ఉన్నప్పటికీ, ఈ యాప్ దానికున్న నిర్మొహమాటమైన పేరు వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది.
మొత్తానికి, పేరు వినడానికి కాస్త కఠినంగా ఉన్నా, ఇది అందించే భరోసా మాత్రం నిజమైనది. రెండు రోజులకోసారి చిన్న క్లిక్ చేయడం ద్వారా.. అటు ఒంటరిగా ఉండేవారికి, ఇటు వారి గురించి ఆందోళన చెందే కుటుంబ సభ్యులకు ఈ యాప్ మానసిక ప్రశాంతతను ఇస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


