Best selling SUV : కియా సోనెట్ @5లక్షల సేల్స్- ఎందుకు ఇది భారతీయుల ఫేవరెట్ ఎస్‌యూవీ?
భారత సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కియా సోనెట్ విజయయాత్రను కొనసాగిస్తోంది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే 5 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటేసింది ఈ సోనెట్. ఈ నేపథ్యంలో ఈ మోడల్ క్లిక్ అవ్వడానికి కారణాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా ఇండియా మరో అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటిగా పేరుగాంచిన ‘కియా సోనెట్’.. తాజాగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది.

కియా సోనెట్ ఎస్‌యూవీ..
కియా కంపెనీ దేశీయ వృద్ధిలో సోనెట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ సాధిస్తున్న మొత్తం విక్రయాల్లో కేవలం ఈ ఒక్క మోడల్ వాటాయే దాదాపు 35 శాతంగా ఉండటం విశేషం.
భారత్‌లోనే తయారవుతున్న సోనెట్.. ఇక్కడ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం దేశాలకు ఎగుమతి అవుతోంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, మధ్య- దక్షిణ అమెరికా, మెక్సికోతో పాటు ఆసియా పసిఫిక్ మార్కెట్లలోనూ ఈ కారు దూసుకుపోతోంది. సెల్టోస్, కార్నివాల్ తర్వాత 2020 సెప్టెంబర్‌లో కియా నుంచి వచ్చిన మూడొవ మోడల్ ఇది.
తీవ్రమైన పోటీ ఉన్న ఈ విభాగంలోనూ సోనెట్ ఎస్‌యూవీ ఇంతటి విజయం సాధించడానికి గల ప్రధాన 5 కారణాలను ఇక్కడ తెలుసుకోండి..
1. అదిరిపోయే ఫీచర్లు.. ప్రీమియం లుక్!
సోనెట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే తన విభాగంలో మరెక్కడా లేని ఫీచర్లతో సంచలనం సృష్టించింది. ఈ కారులో ఉన్న వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి కస్టమర్లను అమితంగా ఆకర్షించాయి. ముఖ్యంగా టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చే నేటి యువత మనసును సోనెట్ గెలుచుకుంది.
2. ఇంజన్- గేర్ బాక్స్ ఎంపికలో వైవిధ్యం
వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా కియా సోనెట్ ఎస్‌యూవీ అనేక రకాల ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది.
1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్.
1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.
1.5 లీటర్ డీజిల్ ఇంజన్.
గేర్ బాక్స్ విషయానికి వస్తే మాన్యువల్, ఐఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్, ఆటోమేటిక్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. సిటీలో తిరిగే వారికి, హైవేలపై లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.
3. భద్రతకే మా ప్రాధాన్యం
ఫ్యామిలీ ఎస్‌యూవీగా పేరు తెచ్చుకున్న ఈ సోనెట్ భద్రత విషయంలో కియా ఎక్కడా రాజీ పడలేదు. ఇందులోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి 15 రకాల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 2024లో లెవల్-1 అడాస్ ఫీచర్లను కూడా చేర్చి భద్రతను మరింత పెంచారు.
4. అన్ని బడ్జెట్లకు తగిన వేరియంట్లు
సోనెట్‌లో దాదాపు 18 నుంచి 23 వరకు విభిన్న వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే హెచ్‌టీఈ వేరియంట్ నుంచి విలాసవంతమైన ఎక్స్-లైన్ (X-Line) వరకు కియా ఆప్షన్లను ఇస్తోంది. దీని ధర రూ. 7.30 లక్షల నుంచి రూ. 18.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండటం వల్ల మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి దిగ్గజాలకు ఇది గట్టి పోటీనిస్తోంది.
5. కాంపాక్ట్ డిజైన్.. ప్రాక్టికల్ యూసేజ్
చూడటానికి ఎంతో మస్క్యులర్ ఉండే సోనెట్, రోడ్డుపై వెళుతుంటే ఒక గంభీరమైన రూపాన్ని ఇస్తుంది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండటం వల్ల నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డ్రైవ్ చేయడానికి, ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేయడానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. నిత్యం సిటీలో ప్రయాణించే వారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


