రేపే 2026 Renault Duster లాంచ్​- మధ్యతరగతి ప్రజల కోసం కొత్త ఎస్​యూవీ..

ఒకప్పుడు భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలిన 'రెనాల్ట్ డస్టర్' జనవరి 26న సరికొత్త హంగులతో రీ-ఎంట్రీ ఇస్తోంది. పాత పేరుతో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తూ, ఈసారి మధ్యతరగతి ప్రజల మనసు గెలుచుకోవడానికి రెనాల్ట్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 2026 రెనాల్ట్​ డస్టర్​ డిజైన్, ఇంజిన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 25, 2026, 14:02:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 రెనాల్ట్ డస్టర్ జనవరి 26న భారతదేశంలో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ఇప్పటికే ఈ కొత్త తరం ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్లను పలుమార్లు విడుదల చేసింది. రాబోయే మోడల్ డిజైన్, దాని దృఢమైన సామర్థ్యాలను ఇవి మనకు పరిచయం చేశాయి. రెనాల్ట్ ఇండియా ఈసారి పాత పేరుతో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తూ, దేశంలోని ప్యాసింజర్ వాహన విభాగంలో గణనీయమైన మార్కెట్ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2026 రెనాల్ట్​ డస్టర్​..
2026 రెనాల్ట్​ డస్టర్​..

ఈ కొత్త తరం 2026 రెనాల్ట్ డస్టర్ లాంచ్‌తో, భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'డస్టర్' అనే పేరు మళ్లీ మారుమోగనుంది. తొలుత 2012లో లాంచ్ అయినప్పుడు డస్టర్ ఎస్​యూవీ భారతీయులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇది డిస్కంటిన్యూ అయినప్పటికీ, ఈ ఎస్‌యూవీపై కస్టమర్లకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇండియాలో బలమైన బ్రాండ్​ వాల్యూ ఉన్న కార్లలో డస్టర్ ఒకటి. ఈ కొత్త తరం డస్టర్ కేవలం ఎంట్రీ-లెవల్ వినియోగదారులనే కాకుండా, ముఖ్యంగా మధ్యతరగతి కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వస్తోంది.

జనవరి 26న ఈ కారు అరంగేట్రం చేయనుండగా, ఈ ఎస్‌యూవీని కొనేందుకు గల మూడు ప్రధాన కారణాలు (ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు) ఇక్కడ తెలుసుకోండి..

2026 రెనాల్ట్​ డస్టర్​- ఈ 3 విషయాలు హైలైట్​..

1. ఫుల్లీ రీడిజైన్డ్​ లుక్​: పాత మోడల్‌తో పోలిస్తే 2026 రెనాల్ట్ డస్టర్ సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో వస్తోంది. ఇది పాత మోడల్ కంటే చాలా బోల్డ్‌గా, మస్క్యులర్​గా కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కొత్త డస్టర్ కొలతలు గమనిస్తే.. ఇది 4,300 ఎంఎం పొడవు, 1,800 ఎంఎం వెడల్పు, 1,600 ఎంఎం ఎత్తును కలిగి ఉంది. ఇందులో సరికొత్తగా డిజైన్ చేసిన స్లీక్ ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎల్​ఈడీ డీఆర్ఎల్​లు, రీడిజైన్ చేసిన ఎల్​ఈడీ కనెక్టెడ్ టెయిల్‌లైట్లు ఉన్నాయి. వెనుక వైపు 'సీ' ఆకారంలో ఉండే టెయిల్‌ల్యాంప్‌లను కలిపే ఎల్​ఈడీ స్ట్రిప్ మధ్యలో బ్రాండ్ లోగో కనిపిస్తుంది.

ఫ్రంట్ బంపర్‌పై బాడీ క్లాడింగ్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్‌లు, వృత్తాకార ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. కారు బోనెట్‌పై ఉన్న స్కల్ప్​టెడ్​ లైన్స్ ఫ్రంట్ ప్రొఫైల్‌కు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్ గమనిస్తే విండో లైన్స్ పాత డస్టర్‌ను గుర్తుకు తెస్తాయి. మస్క్యులర్​ ఫ్రంట్, రియర్ ఫెండర్లు, వీల్ ఆర్చ్‌లు, డోర్ల వద్ద ఉన్న భారీ క్లాడింగ్, డైమండ్-కట్ అలాయ్ వీల్స్ ఈ 2026 రెనాల్ట్​ డస్టర్​ ఎస్‌యూవీకి మరింత అందాన్ని జోడిస్తాయి.

2. ఫీచర్లతో నిండిన ఇంటీరియర్: 2026 రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్ ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే డ్యూయల్-టోన్ థీమ్ ఆప్షన్ కూడా ఉంది. డ్యాష్‌బోర్డ్ అంతటా పదునైన లైన్లతో లేయర్డ్ లుక్‌ను ఇచ్చారు. డ్రైవర్-సెంట్రిక్ సెంటర్ కన్సోల్‌లో హెక్సాగోనల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే, ఇండియన్ వెర్షన్ డస్టర్‌లో 10-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో), 7.0-ఇంచ్​ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, అర్కామిస్ 3డీ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉంటాయని భావిస్తున్నారు.

భద్రత పరంగా, రెనాల్ట్ నుంచి అడాస్​ ఫీచర్‌తో వస్తున్న మొదటి మోడల్ ఇదే కావచ్చు. దీనితో పాటు ఆటోమేటిక్ హై/లో బీమ్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఫ్రంట్, సైడ్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా వంటి అనేక భద్రతా ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

3. శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్: రెనాల్ట్ డస్టర్ ఎస్​యూవీ.. ప్రారంభంలో 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, సీవీటీ యూనిట్ ఆప్షన్లు ఉంటాయి. అయితే, భవిష్యత్తులో రెనాల్ట్ ఇందులో స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా లాంచ్ చేయవచ్చు. ఇది 1.6-లీటర్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో పనిచేస్తుంది.

2026 రెనాల్ట్​ డస్టర్​ ధర, ఇతర ఫీచర్స్​ వంటి వివరాలు సోమవారం లాంచ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More