Toyota Glanza : టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్​కు రెడీ.. ప్రీమియం హ్యాచ్​బ్యాక్​లో మార్పులు ఇవి!

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పాపులర్ అయిన టయోటా గ్లాంజా నయా ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను కంపెనీ టీజర్ ద్వారా పరిచయం చేసింది. అక్టోబర్ 14, 2026న అధికారికంగా మార్కెట్లోకి రానున్న ఈ మోడల్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 11, 2026, 06:45:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విపణిలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’.. తన పాపులర్ మోడల్ గ్లాంజాలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తోంది! అక్టోబర్ 14, 2026న ఈ గ్లాంజా ఫేస్​లిఫ్ట్​ని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన టయోటా, దానికి సంబంధించి సరికొత్త టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిన్న వీడియో క్లిప్‌లో కారు ముందు భాగంలో చేసిన డిజైన్ మార్పులను స్పష్టంగా చూపించారు.

టయోటా గ్లాంజా..
టయోటా గ్లాంజా..

లాంచ్​ నేపథ్యంలో ఈ టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్- ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్..

మారుతీ సుజుకీ బలెనో ప్లాట్​ఫామ్​పైనే ఈ గ్లాంజాని తయారు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక గత నెలలో వచ్చిన బలెనో ఫేస్​లిఫ్ట్​కి లభించిన అప్​డేట్లకు అనుగుణంగానే గ్లాంజాలో కొత్త హంగులతో రెడీ అవుతోంది. టీజర్ ఆధారంగా:

కొత్త ఫ్రంట్ గ్రిల్ అండ్ ఎంబ్లమ్: రేడియేటర్ గ్రిల్‌ను సరికొత్త శైలిలో తీర్చిదిద్దగా, టయోటా లోగోను బానెట్ ముందు భాగానికి కొద్దిగా పైకి జరిపారు.

క్రోమ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్: గ్రిల్ పక్కన క్రోమ్, సిల్వర్ యాక్సెంట్లు, బంపర్ డిజైన్‌లో సరికొత్త మార్పులు చేశారు.

ఫాగ్ లాంప్స్: స్క్వేర్ ఆకారపు హౌసింగ్‌లో అమర్చిన నయా ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్‌లు కారుకు మోడరన్ లుక్‌ని అందిస్తున్నాయి.

కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను కూడా ఇందులో చేర్చే అవకాశం ఉన్నప్పటికీ, కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్- కాబిన్ ఫీచర్లు, లెవెల్ 2 అడాస్!

2026 టయోటా గ్లాంజా లోపలి భాగంలో ప్రధాన లేఅవుట్ మారకపోయినా, అధునాతన సౌకర్యాలను జోడించనున్నారు.

వెంటిలేటెడ్ సీట్లు: వేసవిలో సౌకర్యవంతమైన ప్రయాణానికి ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం రానుంది.

ఇన్ఫోటైన్మెంట్: వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్​ఫుల్ క్లారియన్ ఆడియో సిస్టమ్ లభిస్తాయి.

హైటెక్ ఫీచర్లు: కూల్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రానున్నాయి.

లెవెల్ 2 అడాస్ : గ్లాంజా చరిత్రలోనే తొలిసారిగా లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) రాబోతున్నట్లు సమాచారం. దీని ద్వారా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై-బీమ్ అసిస్ట్ వంటి కీలక భద్రతా ఫీచర్లు లభించే అవకాశముంది.

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్- కొత్త 3 సిలిండర్ ఇంజిన్..

ఇప్పటివరకు ఉన్న 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో, గ్లాంజా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ద్వారా సరికొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ 'Z12E' పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేయబోతున్నారు. ఇది 83హెచ్​పీ పవర్‌ను, 112ఎన్​ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే సీఎన్జీ మోడల్‌లోనూ ఈసారి తొలిసారిగా ఏఎంటీ ఆప్షన్‌ను ఇచ్చే అవకాశం ఉంది.

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్- ధర, పోటీ..

2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో మారుతీ సుజుకీ బలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌లకు నేరుగా పోటీ ఇవ్వనుంది. అక్టోబర్ 14న వేరియంట్ల వారీగా ధరలు, పూర్తి ఫీచర్ల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. ప్రస్తుత మోడల్ ధర కంటే కొత్త వర్షన్ స్వల్పంగా ప్రీమియం ధరకు లభించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More