...
...
Next Story

ఇరాన్‌ను వదిలేది లేదంటున్న ట్రంప్.. సాయం చేసే దేశాలకూ హెచ్చరిక

ఇరాన్‌పై మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్‌కు ఏ రూపంలో ఆర్థిక సాయం అందించినా తీవ్ర పరిణామాలు తప్పవని ఇతర దేశాలను స్పష్టంగా హెచ్చరించారు.

Published on: Aug 20, 2026, 07:00:21 IST
Advertisement

ఇరాన్‌కు వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చర్యలకు అమెరికా శ్రీకారం చుట్టింది. ప్రపంచ చరిత్రలోనే ఏ దేశంపై విధించనంత భారీ ఆర్థిక ఆంక్షలను టెహ్రాన్‌పై అమలు చేయబోతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారని LiveMint నివేదించింది. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు నెరిపేందుకు లేదా ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించే ఏ దేశమైనా దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇరాన్‌ను వదిలేది లేదంటున్న ట్రంప్.. సాయం చేసే దేశాలకూ హెచ్చరిక
ఇరాన్‌ను వదిలేది లేదంటున్న ట్రంప్.. సాయం చేసే దేశాలకూ హెచ్చరిక

"ఏ దేశంపైనైనా చేపట్టిన అత్యంత భయంకరమైన ఆర్థిక ఆపరేషన్ ఇది. మునుపెన్నడూ లేని రీతిలో ఇరాన్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా పూర్తిగా ఒంటరిని చేస్తాం" అని ట్రంప్ పేర్కొన్నారు. టెహ్రాన్‌కు ఆర్థిక లేదా వ్యాపారపరమైన సాయం అందించేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ సంస్థలను అనుమతించే దేశాలు కూడా తీవ్ర ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటాయని తేల్చిచెప్పారు. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, ఫ్రంట్ కంపెనీల కార్యకలాపాలన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారని ఇరాన్ ఇంట్నరేషనల్ న్యూస్ నివేదిక పేర్కొంది.

నిలిచిపోయిన శాంతి చర్చలు

గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన శాంతి చర్చలు ప్రస్తుతం నిలిచిపోయాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి భవిష్యత్తుపై తీవ్ర విభేదాలు రావడమే దీనికి కారణమని సమాచారం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధాన్ని ముగించేందుకు జూన్ 17న 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించి, హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించడమే ఈ ఒప్పంద ముఖ్య లక్ష్యం. అయితే ఇరు వర్గాల మధ్య సమ్మతి లేకపోవడంతో ఈ ఒప్పందం విఫలమైంది.

చర్చల్లో పురోగతి సాధిస్తున్నామని, ఇరాన్ శాంతి ఒప్పందం కోసం కోరుతోందని ట్రంప్ చెప్పినప్పటికీ, ఇరాన్ నాయకత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. రాబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో వైట్ హౌస్‌పై ఉన్న రాజకీయ ఒత్తిళ్లను ఆసరాగా చేసుకుని ఇరాన్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది.

ఒమన్ మధ్యవర్తిత్వంపై ట్రంప్ ఆగ్రహం

హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఇరాన్, ఒమన్ ల మధ్య ఒప్పందం కుదిరిందన్న నివేదికల నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తక్షణమే లొంగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అణు ఆయుధాలపై రాజీ లేదన్న అమెరికా

యుద్ధాన్ని ముగించడానికి అవసరమైన ఒప్పందానికి ఇరాన్ రావడం లేదని వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో ట్రంప్ చెప్పారు. "మేము అనుకున్న రీతిలో ఇరాన్ ఒప్పందం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనేదే మా ప్రధాన లక్ష్యం" అని ట్రంప్ స్పష్టం చేశారని CBS News వెల్లడించింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe