‘5వేల డాలర్ల డివిడెండ్ ఇస్తా’- ట్రంప్ హామీ! అమెరికాలో కూడా ‘ఉచిత’ రాజకీయాలు..

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ హౌస్, సెనేట్‌లను కైవసం చేసుకుంటే అమెరికన్ పౌరులందరికీ 'ట్రంప్ డివిడెండ్' పేరిట రూ. 4.7 లక్షల చొప్పున పంచుతామని ప్రకటించారు.

Published on: Sep 10, 2026, 09:59:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలనం సృష్టించారు. త్వరలో జరగనున్న మిడ్‌టర్మ్ (మధ్యంతర) ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్లకు కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించారు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో బుధవారం రాత్రి ప్రారంభమైన రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ.. ఎన్నికల్లో రిపబ్లికన్లను గెలిపిస్తే ప్రతి వయోజన అమెరికన్ పౌరుడికి 5,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 4,76,000) నగదును ప్రోత్సాహకంగా ఇస్తానని హామీ ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. (REUTERS)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. (REUTERS)

'ట్రంప్ డివిడెండ్' వెనుక అసలు కథ ఏంటి?

"మా ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాధించిన విజయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా మారింది. అందుకే అమెరికాలోని ప్రతి వయోజన పౌరుడికి 5,000 డాలర్ల చొప్పున డివిడెండ్ చెల్లిస్తాం. దీన్ని 'ట్రంప్ డివిడెండ్' అని పిలుస్తాము," అని ట్రంప్ ప్రకటించారు.

అయితే కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ రెండింటిలోనూ రిపబ్లికన్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తేనే ఈ పథకం వర్తిస్తుందని ట్రంప్ షరతు విధించారు.

కాగా ఈ సొమ్మును ఎలా బదిలీ చేస్తారు? ఎవరెవరు అర్హులు? అనే విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు విదేశాల్లో నివసిస్తున్న అమెరికన్లు కాకుండా కేవలం అమెరికా భూభాగంలో నివసించే వారికి మాత్రమే ఈ నగదు అందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సొమ్ము పంపిణీకి కఠినమైన షరతు

ఈ నగదు విషయంలో ఒకే ఒక కఠిన నిబంధన ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి పొందే ఈ డివిడెండ్ సొమ్మును కేవలం అమెరికా సరిహద్దుల లోపలే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. పౌరులు ఈ డబ్బును తీసుకొని కెనడా, చైనా లేదా జర్మనీ వంటి దేశాలకు వెళ్లి ఖర్చు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. స్వదేశీ వస్తువుల కొనుగోలును ప్రోత్సహించడానికే ఈ నిబంధన అని ఆయన వ్యాఖ్యానించారు.

భారీ బడ్జెట్ భారం.. సాధ్యమేనా?

ప్రస్తుత అంచనాల ప్రకారం అమెరికాలో దాదాపు 24.5 కోట్ల మంది వయోజన పౌరులు ఉన్నారు. వీరందరికీ తలో 5,000 డాలర్లు ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా దాదాపు 1.22 బిలియన్ డాలర్లకు పైగా భారం పడుతుంది. ఇది చాలా పెద్ద మొత్తమని, దీనిని చట్టసభ ఆమోదించడం అంత సులువు కాదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా ఈ డబ్బు పంపిణీ, పౌరులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారనేది నిఘా పెట్టడం సైతం ఆచరణలో ఎన్నో సవాళ్లతో కూడుకున్న అంశమని అంటున్నారు.

ఈ ప్రతిపాదన ఓటర్లను ఆకట్టుకోవడానికి తెచ్చిన రాజకీయ గిమ్మిక్కు అని డెమోక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏదేమైనా అమెరికా ఎన్నికల బరిలో ట్రంప్ విసిరిన ఈ 5,000 డాలర్ల డివిడెండ్ పాచిక ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More