...
...
Next Story

Muhoozi Kainerugaba : ‘డబ్బులు కావాలి, అందమైన అమ్మాయిని పంపండి’- టర్కీకి షాక్ ఇచ్చే వార్నింగ్!

Muhoozi Kainerugaba Turkey : టర్కీ ప్రభుత్వానికి ఉగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ కైనెరుగాబా షాకింగ్ అల్టిమేటం జారీ చేశారు. 30 రోజుల్లోగా ఒక బిలియన్ డాలర్ల పరిహారంతో పాటు దేశంలోని అత్యంత అందమైన మహిళను తనకు ఇచ్చి వివాహం చేయాలని, లేదంటే దౌత్య సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు.

Published on: Apr 13, 2026, 10:00:39 IST
Advertisement

సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం ఉగాండా సైన్యాధ్యక్షుడు, ఆ దేశ అధ్యక్షుడు యోవేరి ముసెవేని కుమారుడైన ముహూజీ కైనెరుగాబాకు అలవాటే. అయితే ఈసారి ఆయన నేరుగా టర్కీ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. టర్కీ తమకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,300 కోట్లు) "సెక్యూరిటీ డివిడెండ్" చెల్లించాలన్నారు. అంతేకాదు, ఆ దేశంలోని అత్యంత అందగత్తెను తనకు భార్యగా అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం 30 రోజుల సమయాన్ని ఇస్తున్నట్టు, ఆలోగా తన డిమాండ్లను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సోమాలియా ప్రయోజనాలపై ఉగాండా కన్ను!

ఉగాండా ఆర్మీ చీఫ్.. (@mkainerugaba/X)
ఉగాండా ఆర్మీ చీఫ్.. (@mkainerugaba/X)

గత రెండు దశాబ్దాలుగా సోమాలియాలో అల్-షబాబ్ ఉగ్రవాదులతో ఉగాండా సైన్యం పోరాడుతుంటే, ఆ పోరాటం వల్ల టర్కీ లబ్ధి పొందుతోందని ముహూజీ ఆరోపించారు. సోమాలియాలో మౌలిక సదుపాయాలు, ఓడరేవుల ఒప్పందాల ద్వారా టర్కీ భారీగా లాభపడుతోందని, అందులో తమకు కూడా వాటా కావాలని ఆయన వాదిస్తున్నారు.

"టర్కీ మాకు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాలి. దాంతో పాటు ఆ దేశంలోనే అత్యంత అందమైన మహిళ నాకు భార్యగా కావాలి," అని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

అయితే ఆయన వ్యాఖ్యలపై వివాదం ముదరడంతో కొద్దిసేపటికే ఆ పోస్ట్‌లను తొలగించారు.

ఉగాండా ఆర్మీ చీఫ్​ పోస్ట్..

30 రోజుల గడువు.. రాయబార కార్యాలయం మూసివేత!

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "ఏడాది కాలంలో నన్ను ఇస్తాంబుల్‌లో ఒక హీరోలా ఆహ్వానిస్తారు. అప్పుడు మా అంకుల్ ఎర్డోగాన్‌ను కలుస్తాను," అని వ్యాఖ్యానించడం గమనార్హం.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ “కైనెరుగాబా”

ముహూజీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు.

కెన్యాపై దండయాత్ర: 2022లో పొరుగు దేశమైన కెన్యాను ఆక్రమించి, కేవలం రెండు వారాల్లో నైరోబీని స్వాధీనం చేసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద గొడవకు దారితీశాయి. దీనిపై ఉగాండా ప్రభుత్వం బహిరంగ క్షమాపణలు చెప్పడమే కాకుండా, ఆయన్ని కొన్నాళ్ల పాటు పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది.

ఇటలీ ప్రధానికి ఆఫర్: ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనికి కూడా గతంలో ఇలాంటి వింత ప్రతిపాదన చేశారు. వంద పశువులను ఇస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

సాధారణంగా దౌత్య సంబంధాలు దేశాల మధ్య ఒప్పందాలు, చర్చల ద్వారా సాగుతాయి. కానీ ఒక దేశ ఆర్మీ చీఫ్ హోదాలో ఉండి, ఇలా బహిరంగంగా డబ్బులు, పెళ్లి సంబంధాలు అడగడం ఆఫ్రికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఈ వ్యవహారంపై టర్కీ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఉగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ కైనెరుగాబా టర్కీని ఎందుకు డబ్బులు అడిగారు?

సోమాలియాలో ఉగాండా సైన్యం ఉగ్రవాదులతో పోరాడుతుంటే, టర్కీ అక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా లాభపడుతోందని, ఆ లాభంలో తమకు వాటా కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

2. టర్కీకి ఆయన ఇచ్చిన గడువు ఎంత?

తన డిమాండ్లను నెరవేర్చడానికి ఆయన 30 రోజుల గడువు ఇచ్చారు. లేనిపక్షంలో టర్కీ ఎంబసీని మూసివేసి, దౌత్య సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు.

3. గతంలో ముహూజీ చేసిన ఇతర వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి?

గతంలో కెన్యా రాజధాని నైరోబీని ఆక్రమిస్తామని, అలాగే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని పెళ్లి చేసుకుంటానని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe