బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి: దట్టంగా కమ్ముకున్న పొగలు.. ఇరాక్‌లో హై అలర్ట్

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై శనివారం క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనతో ఎంబసీ భవనం నుంచి భారీగా పొగలు వెలువడుతున్నాయి. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Published on: Mar 14, 2026, 10:17:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి క్షిపణి దాడులతో దద్దరిల్లింది. గ్రీన్ జోన్ పరిధిలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) లక్ష్యంగా శనివారం క్షిపణులు దూసుకొచ్చాయి. ఈ మెరుపు దాడితో రాయబార కార్యాలయ భవనం నుంచి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని ఇరాక్ భద్రతా వర్గాలు వెల్లడించాయి.

ఖుద్స్ డే (జెరూసలేం డే) సందర్భంగా పాలస్తీనయన్లకు మద్దతుగా ఇరాక్ లోని బాగ్దాద్‌లో షియా ముస్లింలు ఇరాన్ జెండాలతో, ఇరాన్ మాజీ సుప్రీం అలీ ఖమేనీ చిత్రాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం (AP)
ఖుద్స్ డే (జెరూసలేం డే) సందర్భంగా పాలస్తీనయన్లకు మద్దతుగా ఇరాక్ లోని బాగ్దాద్‌లో షియా ముస్లింలు ఇరాన్ జెండాలతో, ఇరాన్ మాజీ సుప్రీం అలీ ఖమేనీ చిత్రాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం (AP)

అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయిటర్స్' కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. క్షిపణులు ఎంబసీ ప్రాంగణంలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఆకాశంలోకి పొగలు వ్యాపించాయి. అయితే, ఈ దాడిలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను భద్రతా దళాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఎంబసీలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

గత కొంతకాలంగా ఇరాక్‌లో అమెరికా లక్ష్యంగా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు దాడులు చేస్తున్న నేపథ్యంలో, తాజా ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం బగ్దాద్‌లోని గ్రీన్ జోన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాక్ అదనపు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More