Electric bike : సింగిల్ ఛార్జ్‌తో 343 కి.మీ రేంజ్- అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ ఎలక్ట్రిక్ బైక్ హైలైట్స్
భారత ఈవీ స్టార్టప్ అల్ట్రావయోలెట్ తన కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ 'ఎక్స్-47 వెనమ్'ను రూ.2.65 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. 343 కి.మీ అత్యుత్తమ రేంజ్, అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీ, 155 కి.మీ గరిష్ఠ వేగంతో ఈ బైక్ కొనుగోలుదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ 'అల్ట్రావయోలెట్' కొత్త స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేసింది. 'అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్' పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూ.2.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొదట బుకింగ్ చేసుకునే 5,000 మంది వినియోగదారులకు మాత్రమే ఈ ప్రారంభ ధర వర్తిస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ 22న సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా, నవంబర్ నుంచి డెలివరీలు కూడా మొదలవుతాయి.

సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన కొత్త 'వీఎక్స్-100 100వీ' హై-వోల్టేజ్ ఆర్కిటెక్చర్ వేదికపై రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడం విశేషం. భవిష్యత్తులో రాబోయే పలు వాహనాలకు ఇదే ప్లాట్‌ఫామ్ ప్రాతిపదికగా నిలవనుంది. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్ ఆధారిత 200-400 సీసీ స్పోర్ట్స్ బైక్‌లకు ప్రత్యామ్నాయంగా ఈవీలను కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకుని ఈ వాహనంలో అత్యుత్తమ సేఫ్టీ, పర్ఫార్మెన్స్ ఫీచర్లను అమర్చారు.
అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ బ్యాటరీ, పర్ఫార్మెన్స్..
ఈ అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ ఎలక్ట్రిక్ బైక్ 11 kWh సామర్థ్యం కలిగిన 'ఎస్ఆర్బీ-11' బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. సింగిల్ ఛార్జింగ్‌పై ఇది ఐడీసీ ధృవీకరించిన ప్రకారం ఏకంగా 343 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో వాడిన 'లైట్ ఫ్యూరీ' ఎలక్ట్రిక్ మోటార్ 30 kW (దాదాపు 40 బీహెచ్పీ) పవర్, వీల్ వద్ద 550 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కేవలం 5.9 సెకన్లలోనే సున్నా నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకునే ఈ అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ గరిష్ఠంగా గంటకు 155 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. పాత తరం మోడళ్లతో పోలిస్తే ఇది 20 కేజీల బరువు తగ్గి, మొత్తం 180 కేజీల బరువుతో రూపుదిద్దుకుంది. నగరాల్లోని ట్రాఫిక్‌లోనూ, హైవేలపై సుదీర్ఘ ప్రయాణాల్లోనూ ఇది అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని ఇస్తుందని సంస్థ పేర్కొంది.
బ్యాటరీ పరిమాణంలో 15 శాతం బరువు తగ్గించడమే కాకుండా, 25 శాతం ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ సాధించారు. కూలింగ్ పనితీరును రెట్టింపు చేసేందుకు ఎగ్జియల్ కూలింగ్ టెక్నాలజీని వాడారు. 12 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది మద్దతు ఇస్తుంది. అదనంగా, బ్యాటరీ ఛార్జ్ 10 శాతానికి పడిపోయే వరకు 'బ్యాలిస్టిక్ మోడ్' అందుబాటులో ఉంటుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ 100 శాతం ఛార్జింగ్ నుంచే పని చేసేలా మార్పులు చేశారు.
అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ మోటార్, భద్రత..
ఈ అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ లైట్ ఫ్యూరీ మోటార్ నిమిషానికి 9,000 ఆర్పీఎం వేగంతో తిరుగుతుంది. రేర్-ఎర్త్ లోహాల వినియోగాన్ని 50 శాతం తగ్గించి, మోటార్ బరువును 25-30 శాతం తగ్గించారు. మోటార్ కంట్రోలర్ పరిమాణాన్ని సగానికి తగ్గించి, బరువును 40 శాతం తగ్గించినప్పటికీ పవర్ ఉత్పత్తిలో ఎలాంటి కాంప్రమైజ్ కాకపోవడం గమనార్హం.
షార్ట్ సర్క్యూట్ లేదా ఏదైనా అత్యవసర ప్రమాదం సంభవించినప్పుడు మైక్రోసెకన్లలో బ్యాటరీ సర్క్యూట్‌ను వేరు చేసేందుకు ‘పైరో-ఫ్యూజ్’ వ్యవస్థను అమర్చారు. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో పాటు సెల్-లెవల్ ఫ్యూజులు కూడా రక్షణగా నిలుస్తాయి. డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ కోసం దీనికి ఐపీ67 రేటింగ్ లభించింది.
అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ వరల్డ్ ఫస్ట్ రాడార్ టెక్నాలజీ..
ఈ అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ ఎలక్ట్రిక్ బైక్‌లో అత్యంత ప్రధాన ఆకర్షణ 'యూవీ హైపర్‌సెన్స్' రాడార్ సిస్టమ్! వెనుక వైపు అమర్చిన 77 GHz రాడార్ ఏకంగా 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలను పసిగడుతుంది. దీనివల్ల బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్ ఛేంజ్ అసిస్ట్, ఓవర్టేక్ అలర్ట్‌లు లభిస్తాయి. వెనుక నుంచి ఏదైనా వాహనం ప్రమాదకరంగా దగ్గరకు వస్తే హజార్డ్ లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి.
ఇతర ఫీచర్లలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, మ్యాపుల్స్ నేవిగేషన్, రియర్ కెమెరాతో కూడిన పార్క్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, సాఫ్ట్వేర్ ఓటీఏ అప్డేట్స్ ఉన్నాయి. పడిపోవడం, టోయింగ్ చేయడం లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు 'వయోలెట్ ఏఐ' వెంటనే అలర్ట్‌లు పంపుతుంది.
ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, టర్బో రెడ్, కాస్మిక్ బ్లాక్, స్టెల్లార్ వైట్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ ఎలక్ట్రిక్ బైక్ లభిస్తుంది. దీనితో పాటు మళ్లీ మళ్లీ ఉపయోగించుకోగలిగే 'బీ-మ్యాక్స్' సేఫ్టీ వెస్ట్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. వాహనానికి ఏకంగా 8,00,000 కిలోమీటర్ల వరకు ఎక్స్ప్యాండెబుల్ వారంటీ ఆఫర్ చేస్తుండటం విశేషం!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


